పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మన గురించి మనం

ఈ విశ్వం అంతా సైన్స్.

june24ఈ ప్రపంచంలో ఏమి ఉన్నవి? అంటే కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం ‘చేగోడీలు’ అంటాడు తడుముకోకుండా, అతగానికి చేగోడీలు, గేదె పెరుగే ప్రపంచం. చేగోడీలు చేయాలంటే పిండిలో తగిన పదార్థాలు, నీటితోబాటు కలపాలి. బాణలిలో నూనె మరగాలి. పిండిని సరి అయిన ఆకారంలోకి మార్చి ఆ మరిగే నూనెలో వేసి, తగినంతగా గోలించాలి. అప్పుడు తినడానికి అనువుగా కరకరలాడే చేగోడీలు తయారవుతాయి. ఈ చేగోడీలు ఎవరికి? మనకు? అంటే మనుషులకు. నిర్లక్ష్యం చేస్తే చీమలకు! పిండి ఎట్లా వచ్చింది. ఫలానా ధాన్యాన్ని మరపట్టించితే. ఆ ఫలానా పంట ఎట్లా పండింది. ఒక విత్తు నాటితే అంత మొక్క పెరిగి దానికి పంట కాయడం తెలిసిందే. పచ్చిగా ఉన్న కాయ నుంచి గింజ, గింజనుంచి పప్పు. పప్పుల్లో రకాలు. వాటికి వేరువేరు రుచులు. అందుకు కారణం వాటిలోని రసాయనాలు నూనెల సంగతి కూడా ఇదే రకంగా ఉంటుంది. పప్పును ఘర్షణకు గురిచేసి పిండి చేయాలి. గింజను ఘర్షణకు గురిచేసి నూనె పిండాలి. ఆ నూనెను వేడి చేయాలి. అందులో పిండి ముద్దను వేస్తే అందులోని నీరు ఆవిరయి, నూనె చేరుతుంది. తింటే నాలుకకు రుచి తెలుస్తుంది. కరకరలో గట్టిదనం తెలుస్తుంది. ఆ ధ్వని చెవులకు తెలుస్తుంది. వాసన ముక్కులకు తెలుస్తుంది. ఇలా కథను ఎంత దూరమయినా చెప్పవచ్చు.

ఇందులో మనము, చీమలు, పప్పు, పంటలు జీవశాస్త్రం. వీటన్నిటి నిర్మాణం కొంత రసాయన శాస్త్రం, కొంత భౌతిక శాస్త్రం. పిండి, నూనె వంట కూడా ఈ రెండు శాస్త్రాల కలయిక వల్లనే ఈ శాస్త్రాలన్నీ జరగడానికి గల రంగం వాతావరణం, పర్యావరణం. అక్కడ నుంచి స్థలం గురించి ఆలోచిస్తూ అంచెలంచెలుగా వెళితే, భూమి, సౌరమండలం, నక్షత్రాలు, గ్రహాలు, విశ్వంలోని వివిధ వివరాలు! ఈ రకమయిన ఆలోచనలు మనకు సాధారణంగా రావు.

ప్రపంచంలోని సంగతులన్నీ పరిచయమైనట్లే, అర్ధమయినట్లే అనిపిస్తాయి. ప్రశ్నలడిగితే మాత్రం వాటికి అంతు ఉండదు. ఆ ప్రశ్నలకు జవాబులు అందాలంటే అది ఆలోచనలకు సంబంధించిన సంగతి. ఆ ఆలోచనలు, పరిశీలనలు, అందులోంచి వచ్చిన సమాచారమే సైన్సు! అందుకే సైన్సంటే ఏమిటి? మేధ ఎందుకు? అంటే జవాబు కష్టం! అంతా సైన్సే. ఎక్కడని మొదలు పెట్టడం?

తెలివి అంతా సైన్సు. అందులో మరికొన్ని పద్ధతులుండాలి. విశ్వం, ప్రపంచం ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో లేదా ఒక చివరలో మనిషి వచ్చాడు. ఈ మనిషికి మెదడు ఉంది. ఆలోచన ఉంది. పరిశీలన ఉంది. సంబంధంగల సంగతులను ఒకచోట చేర్చి, గమనించగల శక్తి ఉంది. అనుభవాలను, తెలివిగా విశ్లేషించి, సిద్దాంతాలుగా చూడగల ఒడుపు ఉంది. వాటిలోని క్రమబద్ధతను విమర్శించే నిష్కర్ష ఉంది.

మానవులు ఈ భూమిమీద, పరిణామక్రమంలో ఒక జాతిగా ఏర్పడక ముందు నుంచీ సూర్యుడు తూర్పున ఉదయిస్తూనే ఉన్నాడు. మానవుడు కూడా ఉదయించాడు. సూర్యుడు ఉదయించడం ఇంచుమించు చటుక్కున జరుగుతుంది. మానవుని ఉదయం అలా జరగలేదు. ఆ మానవునికి సూర్యుడు ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, అప్పుడు వెలుగు వస్తుంది, 'సూర్యుడు లేనిదే వెలుగు లేదు' లాంటి భావాలు స్థిరం కావడానికి కొంతకాలం పట్టి ఉంటుంది గదా! మనిషి ఏ రకమయిన అనుభవాలను, ఏ క్రమంలో సిద్ధాంతాలుగా మార్చుకున్నాడో ఊహించడం కష్టం కానీ, అదే సైన్సుకు ప్రారంభ దశ. ఆ సిద్ధాంత పరంపరకు ఒక పద్ధతి ఉంది. సైన్సులో ఆలోచనలు ముందుపుట్టవచ్చు. లేదా అనుభవం ముందు పుట్టవచ్చు. కానీ వాటిని పరీక్షించడం మాత్రం, అసలు విషయం చెట్లు పెరుగుతాయి అన్ని చెట్లు పెరుగుతాయా? ‘పెరుగుదలకు పరిస్థితులు ఏమిటి?' లాంటి పరీక్షలు నిప్పు ముట్టుకుంటే కాలుతుంది. దీనిప్పంటే ఏమిటి?', 'దాని లక్షణాలు ఏమిటి?', 'నిప్పును ఎవరు ముట్టుకున్నా కాలుతుందా?', 'నిప్పు అనేది వస్తువులనూ కాల్చగలదా?” ప్రశ్నలు, ప్రయోగాలు పరీక్షలకు అంతం లేదు. వాటిలో నుంచి ఒక సక్రమ ఆధారం బయటపడాలి. కాని మరో అనుభవం చెప్పేవరకు, ఈ ఆధారం ఒక సిద్ధాంతమవుతుంది. సైన్సులోని అనుభవాలు, ప్రయోగాలు, సిద్ధాంతాలన్నీ మన ఈ సహజ ప్రపంచానికి చెందినవి అని కూడా ఊహల ఆధారంగానే నడుస్తాయి. కానీ ఈ ఊహలు ఒకే రకమయిన అనుభవాలను, ఇంచుమించు ఇస్తాయి. అనుభవాలు కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. పరిస్థితులు మారితే అనుభవాలు కూడా మారతాయి.

ఈ ప్రశ్నలు, మామూలు చిన్నచిన్న సంగతులను గురించి మాత్రమే ఉన్నంత వరకు సమస్యరాదు. కానీ, ఆలోచనకు అంతులుండవు గనుక. కొత్త ప్రశ్నలు పుడుతూ పోయి అనుభవాలు, అందరికీ అర్ధం కాని పరిస్థితి వచ్చింది. అప్పుడు, సైన్సుకు ఆధారమయిన మనిషికి సైన్సు అవగాహనకు మధ్య కొంత ఖాళీ ఏర్పడింది. సైన్సుకు, మనిషికి మధ్యన మాత్రం ఏ మాత్రం ఖాళీ లేదని గుర్తుంచుకోవాలి. సంవత్సరంలో ఒకానొకనాడు, పగటి సమయం నిడివి ఎక్కువగా ఉంటుంది. ఆ సంగతి తెలిసిన వారికి, తెలియని వారికి కూడా అదే అనుభవం! ఆ అనుభవాన్ని గుర్తించక పోయినంత మాత్రాన అందులో మార్పు ఉండదు. మనకున్న గత అనుభవాలే తెలివి. అందులోని లోతు కారణంగా కొన్ని అనుభవాలు విడమర్చి చెప్పినా అర్థం కావు. ఒక రోజున పగలు నిడివి ఎక్కువగా ఎందుకు ఉంటుంది? అందుకు ఎన్నో అనుభవాలు లెక్కల రూపంలో వస్తాయి. వాటిని మనం, అనుభవించలేకపోవచ్చు. అట్లాగని ఆ అనుభవాలు తప్పు కానేకావు. అయితే అవన్నీ ప్రాకృతిక ప్రపంచానికి సంబంధించినవి. కొన్ని అనుభవాలు, పరిస్థితులు ఒకేలాగున్నా, అందరికీ ఒకేలాగ ఉండవు, అవి బహుశః మనసుకు సంబంధించినవయి ఉంటాయి. సైన్సు వాటిని గురించి వ్యాఖ్యానించదు, సైన్సుకు ఎంత విస్తృతి ఉందో, అంతగానూ పరిధులు కూడా ఉన్నాయంటే, సులభంగా అర్థం కాకపోవచ్చు!

ప్రకృతి, ప్రపంచం అంటే ఏమిటి? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది? ఈ ప్రపంచంలోని అంశాల మధ్య పరస్పరం సంబంధాలు ఎట్లా పనిచేస్తాయి? లాంటి ప్రశ్నలకి సైన్సు సులభం జవాబులు ఇస్తుంది. ఇవన్నీ ఏవో కొన్ని పత్రాలు ఆధారపడి ఉంటాయనుకుంటే తప్పే. సమకాల ఎందరి అనుభవాల ఆధారంగా, అనుభవాలకు కాల లక్షణాలను నియమిస్తారు. ఆ లక్షణాలు సరిగా కుదరకుంటే, నిన్నటి దాకా నిజం అనుకున్నది ఇళ్ల నిజం కాకుండా పోతుంది. సూర్యుని చుట్టు తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నాయి!" అనుకున్నాము. కానీ ప్రస్తుతం బడిపిల్లలు కూడా “కాదు. ఎనిమిదే.” అంటున్నారు.

ప్లూటో అనేది గ్రహాలకుండే లక్షణాలకు ఒదగలేదు కనుక అది ప్రస్తుతం గ్రహం కాదు! వద్దనుకున్నా సరే, మనం సైన్సు. మన ప్రపంచము సైన్సు. కొంచెం ఓపిక పడితే అది మనందరికీ అర్ధమవుతుంది. అందుతుంది.

ఆధారం: కె.బి. గోపాలం

2.99132947977
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు