অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ తిండి కలిగితే కండగలదోయ్

కండగలవాడేను మనిషోయ్ అన్న మహాకవి గురజాడ మాటలు అక్షర సత్యాలు. తిండి కావలసిందే కాని ఎటువంటి ఆహారం తినాలి. అదెంత శుభ్రంగా వుండాలి. ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా వుంటాం. జబ్బుల బారిన పడకుండా ఉండటమే ఆరోగ్యం అనుకుంటాం మనం. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యానికిచ్చిన నిర్వచనం సమగ్రమైనది, సరైనది కూడా. అదేమంటే మనిషి కేవలం శారీరకంగానే గాక, మానసికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఆరోగ్యంగా వున్నప్పుడే మనిషి ఆరోగ్యవంతుడంది. ఆరోగ్యానికి ఇన్ని పార్శ్వాలున్నాయన్న మాట. కనీసం శారీరకంగానైనా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలనీ, ఏ హానికర అనారోగ్య పదార్థాలతో కల్తీ కానిదై ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పంట నుంచి పళ్లెం వరకూ సురక్షిత ఆహారం' (Safe food from land to Plate) అనే నినాదాన్నిచ్చి ప్రజలకు తమ ఆరోగ్యం పట్ల, ఆరోగ్యాన్ని దెబ్బతీసే కలుషిత వాతావరణం పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపట్టమని సూచించింది. నిత్య జీవితంలో మనం ప్రతిరోజూ మనకు తెలియకుండానే పోషక విలువలు లేని అనారోగ్యకర ఆహారాన్ని తింటున్నామో!? ఒక సగటు మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఈ చిన్న సంభాషణను గమనిస్తే విషయం ఇట్టే తెల్సిపోతుంది. చదువుదామా వారి సంభాషణ.

apr0017.jpg“ఏమిటమ్మా పిల్లవాడు అంతగా బతిమిలాడుతుంటే కూల్ డ్రింకే గా... ఏం బోయింది, ఆ పనిపిల్లను పంపించి తెప్పించరాదూ” అంటూ అత్తగారు మనవడికీ కోడలికీ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తోంది. కోడలు ససేమిరా వీలు కాదంటే వీలు కాదని మొండికేసింది. పిల్లగాడంటే తెలియదనుకుందాం! మీరు కూడా ఏమిటమ్మా అంత మొండిగా' మధ్యవర్తిత్వం చేయబోయింది అత్తాకోడళ్ల మధ్య పనమ్మాయి.

“మీరు వంద చెప్పండి, వెయ్యి చెప్పండి నేను పిల్లలకు శీతల పానీయాలను తాగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది కోడలు.

“పోన్లే అమ్మా నేను కొనిస్తాలే బాబుకు' అని పనమ్మాయి బాబును బుజ్జగించబోయింది. కోడలు ఇక లాభం లేదని అసలు సంగతి చెప్పింది.

'ఈ మాత్రం ప్రేమ నా కొడుకు మీద నాకు లేదనా మీ ఉద్దేశం? కూల్ డ్రింక్స్ లో పురుగుమందులున్నాయని మీరు విన్లేదా?”

'పురుగు మందులా? మనం లొట్టలేసుకుని తాగే కూల్ డ్రింక్స్ లోనా?' ప్రశ్నించింది పనమ్మాయి.

'అవును, మన బుజ్జిగాడు మారంజేస్తున్న ఆ కూల్ డ్రింక్స్ లోనే పురుగు మందులున్నాయని సైంటిస్టులే తేల్చిచెప్పారు.

'నాకు తెలియకడుగుతాను. పురుగుమందులున్నాయని తేల్చితే వాటినెందుకు మార్కెట్లోకి రానిచ్చినట్టు?' ప్రశ్నించింది పనమ్మాయి.

'నీకు తెలియదంటూనే చాలా మంచి ప్రశ్న వేశావు. నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలనే నేను వాడికి కూల్ డ్రింక్స్ ఇవ్వటం లేదు. కానీ అమ్మా నీలాగ ఎంతమంది తల్లులు పిల్లల్ని ఈ డ్రింకులు తాగకుండా ఆపుతారు? దీనికంటే గవర్నమెంట్ ఈటిని బయటకు రాకుండా చేయటం మంచిపని గదమ్మా! అంది పనమ్మా యి.

నీలాగ ఆలోచించటాన్నే సరైన ఆలోచన, శాస్త్రీయ ఆలోచన అంటారు. జనవిజ్ఞాన వేదిక అని సైన్సు ప్రచారంజేసేటోళ్లు అసలీ డ్రింకుల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఏ పోషక పదార్ధాలు లేవని సవాల్ కూడా చేశారు. మానవ హక్కుల కమీషన్ బళ్లల్లో, దవాఖానాల్లో వీటిని అమ్మవద్దని ఆర్డరు కూడా వేసింది. చిన్నపాటి ఉపన్యాసమే ఇచ్చింది కోడలు.

'అయ్యో! అట్లనా! ఏం చేస్తే ఏం లాభం మంచి నీళ్లు దొరకడం కష్టం గాని, వీటికి మాత్రం కొదవలేదు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉన్నాయి' అంది అత్తగారు.

'ఆటిని తయారుచేసే కంపినోళ్లని కట్టడి జేయొచ్చుగా' అంది పనమ్మాయి.

'ఏం కట్టడి జేస్తారు? కట్టడి మాట అట్లుంచు. మేమేమన్నా కావాలని మందులు గలిపినమా? మీ నీళ్ళల్లోనే ఆ పురుగుమందులున్నాయని దబాయిస్తున్నారు వాళ్లు ఈ మాటలు విన్న అత్తగారికి ఒకింత కోపం కూడా వచ్చింది. ఇదేం చోద్యం కల్తి డ్రింకులు తయారుజేసింది. గాక దబాయింపా? ఇంతకీ అది నిజమంటావా కోడలా? అని దీర్ఘం తీసింది అత్త.

'కొంత వరకు నిజమే అత్తమ్మా కోడలు జవాబు. 'అంతా విచిత్రంగా వుంది. నీళ్ళలో పురుగుమందులా? అట్లెట్ల వస్తయమ్మా? కుతుహలంగా అడిగింది పనమ్మాయి.

అన్ని సంగతులూ తెలిస్తే ఒకోసారి బతకాలంటేనే భయమేస్తుంది. కాని తెల్సుకోవటం అవసరం. అప్పుడే ఆ ప్రమాదాల నుండి బయట పడే ఉపాయం దొరుకుతుంది. మన కాళ్ళకింది నేల, మనం తాగే నీరు, పీల్చేగాలి, పాలు, పళ్లు, ఒకటేమిటి కల్తీ కానిది లేదు. శ్రీశ్రీ అనే మహా కవి 'కాదేదీ కవితకనర్హం' అన్నాడు గాని చూస్తుంటే, 'కాదేదీ కల్తీకనర్హం' అని లాభాల కోసం నడిచే ఈ దగుల్బాజీ సమాజం రుజువు చేస్తున్నది. కోడలు మాటలను పనిపిల్ల, అత్తగారు ఇద్దరూ సీరియస్ గా వినటం మొదలుపెట్టారు. మనం తినే పిడికెడు మెతుకులు మన నోటికి చేరే వరకు ఎన్ని కల్తీ లో, ఆ కల్తి కూడు తినే మనకు ఎన్ని రోగాలో... మనం తినే ఆహారం కల్తీ కావటం వల్ల పరిశుభ్రత లేని నీళ్లు తాగటం వల్ల మనకు దగ్గర దగ్గర 200 రకాల రోగాలు వస్తున్నాయి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం వలన వచ్చే విరేచనాలతో ఏటా ప్రపంచంలో 22 లక్షల మంది చనిపోతున్నారట. వాళ్లలో పసిపిల్లలు ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అందుకే ఏప్రిల్ 7, ప్రపంచ ఆరోగ్య దినం మొదలు ఈ సం. అంతా 'పరిశుభ్రమైన ఆహారం' ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చింది. 'ఇయ్యాల నాకు నిన్ను సూత్తంటే చాలా కుషీ అయితంది. ఎంత బాగా జెబుతున్నావ్ ఇసయాలు' మెచ్చుకుంది పనమ్మాయి..

'ఏమనుకున్నవ్ నా కోడలంటే... భుజాలెగరేసింది అత్త గర్వంగా.

“రోజూ ఇట్లాంటి మంచి ఇసయాలు చెప్పరాదమ్మ'.

చెబుతా ఇయ్యాల నుండి ఈ సం. పొడుగునా మన ఆరోగ్యం గురించి, తినే తిండి, మనం పరిశుభ్రంగా ఎలా ఉండాలో, మన చుట్టుప్రక్కల్ని శుభ్రంగా ఎందుకుంచుకోవాలో చెబుతా.

'మా ఇద్దరికే కాదు, రేపు మీ చిట్టీవోళ్లు వస్తరు గదా! వాళ్లందరికీ జెప్పు.

మంచిగడిగినవ్. నాకంటే బాగా జెప్పే సైంటిస్టుల్ని పిలిపించి అన్ని విషయాలు తెల్సుకుందాం!

'అంత పెద్దోళ్లు మనదెగ్గరికోస్తారమ్మా? నిన్నంటే అన్ని ఇసయాలు అడిగినం గాని పెద్దోళ్ళని అడగాలంటే... అమ్మో.. భయం...! పనమ్మాయి సందేహం జెప్పింది.

అట్లేంగాదు జనవిజ్ఞాన వేదికన్నానే ఇందాక వాళ్లు ఎంత పెద్ద సైంటిస్టులైనా, అందరితో కల్సిపోయి అన్ని విషయాలు విడమర్చి చెబుతారు.

'అట్లయితే తిండి కల్తీ, పాల కల్తీ, నేల కల్తీలన్నింటినీ వాళ్లను పిలిపించే చెప్పించు'

'ఇంతకీ నీళ్లల్లోకి పురుగుమందులచ్చిన సంగతి చెప్పనే లేదు. గట్ల దాటేస్తే నేనొదలా' అంది పనమ్మాయి

నేనేం మరవలే. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నానే అది హానికరమైన ఆహారం తినొద్దన్నది. తినొద్దనటం తేలికే. కాని ఆ హానికర పదార్థాలెట్లా మన ఆహారంలోకి వస్తున్నయ్యో దాని మూలాలను కూడా తెల్సుకోమంది. అందుకు పొలంలో పండించే పంట దగ్గర్నుండి, మనం ముద్ద మింగే దాక జరిగే కల్తీ, కథ కమామిషు తెల్సుకోవాలంది. మనం క్షేమంగా ఉండాలంటే మనం తినే ఆహారం కూడా మంచిగా ఉండాలి. ఆహారం మంచిగుండాలంటే పండించే పొలం, పంట కాల్వలో నీళ్లు, బోరు బావి ఇలా ప్రతి ఒక్కటీ శుభ్రంగా ఉండాలి గదా?

దాంట్లో ఏముండి ఉండాలె

సరే! మన ఊల్లో వరి పంటకు ఎన్ని మందులు కొడుతున్నం? ప్రశ్నించింది పనమ్మాయిని కోడలు.

ఒకటా రొండా... ఎన్నని జెప్పాల!

మరి ఆ మందులన్నీ ఎక్కడకు పోతన్నయి. ఎంతో కొంత మనం తినే ఆహారంలోకి కూడా వస్తున్నయి. దానితోనే రోగాలు ఎక్కువైనయి.

మరేం జెయ్యాల. తినకుండా కుదరదు గదా! బతకాలంటే...

అందుకే పురుగు మందుల్లేని పంటలను పండించుకోవాలి. అప్పుడే మన ఫడ్ సేఫ్. మనం సేఫ్....

మరి నేనడిగిన నీళ్ళలో పురుగుమందుల సంగతి?

మొత్తానికి బాగానే పట్టుకున్నావ్ నీళ్ళల్లో పురుగు మందుల్ని, పంటల మీద చల్లిన పురుగుమందులు నీళ్లల్లోకి ఇంకిపోయి మన భూగర్భజలాలు కూడా ఈ మందులతో కలుషితం అవుతున్నాయి. విపరీతంగా సుగుమందులు వాడటం వల్ల మన భూగర్భజలాలు చెడిపోయినయి.

పురుగు మందులేంటి అమ్మా' అంటూ బుజ్జిగాడు వచ్చిండు.

పురుగుమందులంటే... అని వాళ్లమ్మ మొదలుపెట్టకముందే 'అమ్మమ్మ మింగే గోలీలా' అని అడిగిండు. ముగ్గురూ నవ్వి - గోలీలు మింగితే అమ్మమ్మ ఆరోగ్యంగా ఉంటుంది. కాని పురుగుమందులున్న కూల్ డ్రింక్స్ తాగితే... ఇంతే సంగతులు – అందుకే ఎప్పటికీ సురక్షితమైన ఆహారాన్నే తినాలి తెల్సిందా?

  1. పరిశుభ్రత పాటించండి
    • చేతులు, వంట పాత్రలు, వాటిని తుడిచే గుడ్డలు, కూరగాయలను కోసే కత్తులు, పీటలపై ఏవైనా హానికరమైన సూక్ష్మక్రిములు ఉంటే అవి ఆహారంపై చేరి వ్యాధులు కలుగచేస్తాయి. తరుచూ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.
    • ఆహారం వండడానికి ముందు, తినడానికి ముందు, మలమూత్ర విసర్జన అనంతరం చేతులు కనీసం 20 సెకండ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి.
  2. పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించండి
    • పచ్చి పండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. శుభ్రంగా కడగడం, చెక్కు తీయడం వంటివి ఈ సూక్ష్మ క్రిములను తొలగిస్తాయి.
    • వంటకు త్రాగడానికి పరిశుభ్రమైన నీటిని వాడండి.
    • పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే ఉపయోగించండి. కాల పరిమితి దాటిన ఆహార పదార్థాలలో సూక్ష్మ క్రిములు పెరగవచ్చు.
  3. ఆహార పదార్థాలను సరిగా ఉడికించండి
    • ఆహారాన్ని ముఖ్యంగా మాంసపు ఉత్పత్తులు సముద్ర ఆహారం, గుడ్లను సరిగా ఉడికించడం ద్వారా హానికారక సూక్ష్మ క్రిములను సంహరించవచ్చు.
    • ఉడికించిన ఆహారం మీరు తినే సమయానికి చల్లారిటైతే మరలా ఒకసారి వేడిచేసి తినండి.
  4. ఆహారాన్ని తగిన ఉష్ణోగ్రత వద్ద ఉంచండి
    • ఉడికించిన ఆహారాన్ని వేడిగా తినండి.
    • వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకండి.
    • వండిన ఆహారాన్ని రెండు గంటల తరువాత తినాలనుకుంటే ఫ్రిజ్ లో 5డిగ్రీల వద్ద ఉంచి, తినే ముందు వేడిచేయండి.
    • ఆహారాన్ని ఫ్రిజ్లో రోజుల తరబడి నిల్వ ఉంచకండి.
  5. పచ్చి మరియు ఉడికించిన ఆహారాలను విడివిడిగా ఉంచండి
    • ఉడికించని పదార్థాలను వండిన ఆహారం నుంచి దూరంగా ఉంచండి. వాటిని వేరు వేరు పాత్రలలో ఉంచి, ఆ పాత్రలను ఒక దానికి ఒకటి దూరంగా ఉంచండి.
    • ఫ్రిజ్ లో ఉంచేటప్పుడు వండిన పదార్థాలను పై అరలలో, ఉడికించని పదార్థాలను (ముఖ్యంగా మాంసపు ఉత్పత్తులను) క్రింది అరలలో ఉంచండి.

ఆధారం: కట్టా సత్యప్రసాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 11/20/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate