অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఏనుగు తొండం కష్టం

ఏనుగు తొండం కష్టం

అదొక ప్రముఖ దేవాలయం. దానిని సందర్శించడానికి రఘురాం కుటుంబం వచ్చారు. పూజాకార్యక్రమం జరిగినంత సేపు కూర్చోలేనన్న తాతగారిని, గలాభా చేస్తాడని వంశీని గుడిముందు వదిలి మిగిలిన వారంతా గుడిలోకి వెళ్ళారు.

(తాత, మనవడు గుడి ముందు కాలక్షేపం చేస్తున్నారు)

వంశీ: తాతా! ఐస్ క్రీం కొనివ్వవు?

తాత: ఒరే వంశీ, ఇప్పటికే రెండు తిన్నావు, ఇక చాలు.

వంశీ: తాత ఆ బొమ్మల కొట్టంలో ఎగిరే హెలికాప్టర్ వుంది. కాని పెట్టవా?

తాత: చూద్దాం లేరా..! అమ్మా వాళ్ళు రానీ... కొని పెడతాను.

వంశీ: తాతా! బోరు కొడుతోందీ!

తాత: పద! గుడిలోకి వెళ్ళి, అక్కడి శిల్పాలు చూద్దాం. (తాత, మనవళ్ళు గుడిలోకి వెళ్ళారు)

వంశీ: అబ్బ! ఎంత పెద్ద గుడో? ఎన్ని గోపురాలున్నాయో చూడూ!

తాత: (గుడి విశేషాలు వివరించసాగాడు).

వంశీ: తాతా! ఒక రూపాయి ఇవ్వవా?

తాత: దేనికిరా?

వంశీ: (మండపంలో అందంగా అలంకరించిన ఏనుగును చూపుతూ) ఆ ఏనుగుకిస్తే, అది దీవిస్తుంది.

తాత: ఏనుగు దీవెన కోసమా?

వంశీ: అవును తాతయ్యా!, నానమ్మ నిన్ననే చెప్పింది. గుడిలోని ఏనుగు చేత దీవెన పొందితే ఎంతటి కష్టమైనా... చిటికలో పోతుందట.

తాత: వెర్రి తలకెక్కి, అదీ అలానే చెప్పి ఉంటుంది లేరా!

వంశీ: ఏం తాతయ్యా రూపాయి ఇస్తావా? లేదా?

తాత: ఏనుగు దీవెనతో నీకష్టం తీరితే? నిన్ను దీవించే ఏనుగు కష్టం ఎవరు తీరుస్తారు చెప్పు?

వంశీ: ఏనుగుకు కష్టం ఏంటి తాతయ్యా?

తాత: ఒరే వంశీ! పూజాకార్యక్రమానికి వెళ్ళిన నానమ్మ వాళ్ళు తిరిగి రావడానికి, మరో నాలుగు గంటలు పడుతుంది కదా!

వంశీ:అవునూ.....! తాత , ఈ లోపు నీకో పందెం పెడతా, నీవు గెలిస్తే నీవడిగిన హెలీకాప్టర్ బొమ్మ కొని పెడతా? సరేనా?

వంశీ:భలే భలే! ఏంటా పందెం?

తాత: ఆ ఏనుగులా నువ్వు కూడా ఒకే చోటులో, నానమ్మ వాళ్ళు వచ్చేవరకు నిల్చోవాలి?

వంశీ:ఓస్.. అంతేకదా! ఇదిగో ఈ బండ మీద నిల్చుంటా... దీనిని దాటను. సరేనా!

తాత: అలాగే, ఏనుగు ఎవరినైనా దీవిస్తే! నీ చేతిని దాని తొండంలానే కదపాలి.

వంశీ:భలే! ఇంకా...!

తాత: ఏనుగు తిన్నప్పుడే తినాలి, తాగినప్పుడే తాగాలి.

వంశీ:చాలా బాగుంది తాతా!, అలానే చేస్తాను.

తాత: గుంపు చేరినా, గేలి చేసినా వెనకకు తగ్గరాదు.

వంశీ:సరే తాతా!, ఇక పందెం ప్రారంభిస్తామా!

(అరగంట పైగా గడిచింది. చుట్టు పక్కల జనం ఏనుగునూ అనుకరిస్తున్న వంశి వైపు చూస్తూ

వెళుతున్నారు),

వంశీ:తారా! ఇంకెంత సేపూ.....?

తాత: ఏం....? హెలికాప్టర్ బొమ్మ వద్దా!

(గంట గడిచింది. వంశీ చుట్టు గుంపు పెరిగింది)

వంశీ: తాతా! కాళ్ళు నెప్పి పెడుతున్నాయి?

తాత: నీ కంటే రెండు గంటల ముందు నుండే ఏనుగు నిల్చింది.

వంశీ: నీళ్ళు కావాలి!

తాత: ఏనుగు తాగితే నీవు తాగవచ్చు. (2 గంటలు గడిచాయి. ఏనుగు వద్ద కంటే వంశీ చుట్టే జనం ఎక్కువగా పోగైనారు)

(ఓడిపోరాదనే మొండి పట్టుదలతో) ఈ ఏనుగు అలానే ఎంతసేపని నిలబడుతుంది. దానికి విసుగు పుట్టదా!

తాత: ఒక్క పూటకే నీవిలా అంటే, ప్రతి రోజు అది అలానే వుండాలే? దాని కష్టమెంత? (రెండున్నర గంటలు గడిచింది. తాతామనవళ్ళ చుట్టూ పెద్దగుంపు పోగైంది)

వంశీ: (నడుములోనేమో సలుపు... చేయి ఊపి ఊపి భుజం నొప్పి) తాతా! ఈ ఏనుగుకు దాహం కాదా? నా నోరు పిడచగట్టుకుపోతుంది, గంట నుంచి లఘుశంఖ బాధిస్తుంది.

తాత: మరి ఏనుగుకు రోజు ఇలాంటి సమస్యలుండవా? (పోగైన జనంలో ఏనుగు కష్టం గుర్తించిన చర్చ మొదలైంది)

వంశీ:పందెం పేరుతో నన్నిలా ఏడిపిస్తే నాకు భలే కోపం వస్తుంది తాతా!

యాత్రికుడు: నీకు మల్లె ఆ ఏనుగుకు కోపం వస్తే... ప్రమాదం కదండీ!

తాత: అందుకే దాని కాలును బలమైన చైనుతో స్థంభానికి కట్టారు. అంతేగాక అదుపు చేయడానికి మావటివాడు అంకుశమనే.., ముల్లు కర్రతో పొడుస్తుంటాడు.

యాత్రికురాలు: ఎంత క్రూరత్వం?

మరో స్థానికుడు: తాత గారు మొదట్లో ఈ ఏనుగును మచ్చిక చేసుకోవడానికి 15 రోజుల పైనే హింసించారు.

తాత: హింసించడమా? ఎలా?

స్థానికుడు: ఇది మావటి మాట వినే వరకు తిండి, నీరు ఇవ్వలేదు. ముందు కాలును, వెనుక కాలును మోకులతో లాగి దూరదూరంగా రోజుల తరబడి కట్టి వుంచారు.

తాత: అంటే అది కూర్చోలేదు, పడుకోలేదన్న మాట!

ప్రక్కనున్న వృద్ధురాలు: దేవుడా! జీవహింస మహాపాతకం! ఈ తప్పంతా మావటిదే!

తాత: లేదమ్మా. ఆవేశంలో ఏనుగులు మావటీలను తొక్కి చంపిన సంఘటనలు చాలానే వున్నాయి?

పూజారి: ఔనండి! ఈ విధంగా ఏనుగులను గుడిముందు నిలపాలని ఏ పురాణాలలోనూ చెప్పలేదు.

యాత్రికురాలు: మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ మూఢాచారాల్ని దూరం చేయలేవా?

తాత: అమ్మ 'వైల్డ్ లైఫ్ యాక్ట్' క్రింద చాలా చట్టాలే చేశారు. 'బ్రూక్రాస్' లాంటి స్వచ్ఛంధ సంస్థలు వాటి అమలుకు ప్రయత్నిస్తూనే వున్నాయి.

పూజారి: జనంలో మార్పు రావాలి కానీ...., చట్టాలు ఏం చేస్తాయి?

మావటి: అయ్యా! మీ అందరికంటే ఈ ఏనుగు కష్టం నాకే బాగా తెల్సు, కాని ఇలా చెయ్యకపోతే నా పొట్ట నిండదు. దానికి బ్రతుకు లేదు.

తాత: నిన్ను మేము తప్పు పట్టడం లేదు. అధికారులతో మాట్లాడి దీనికో పరిష్కారం

కనుగొంటాను.

మావటి: మంచిదయ్యా! ఈ ఏనుగు దీవెనకే మహత్తుంటే నేను మారాజులా వుండేవాడిని కదా! (అంటూ ఏనుగుతో గజశాల వైపు బయలుదేరాడు)

యాత్రికులు: తాతగారూ! ఒట్టేసి చెపుతున్నాం, ఇకపై ఏనుగు దీవెనకై మేం ఎగబడము.

తాత: మంచిదండీ....!

వంశీ: (వంశీ తన ఓటమిని అంగీకరిస్తూ ఎప్పుడో, తాత గారి ఒడిలో ఒదిగి పోయివున్నాడు)

తాతా! నాకు కొనిస్తానన్న బొమ్మ బదులు,  ఏనుగుకు మంచి పండ్లు కానివ్వవూ?

తాత: సరే పదరా!

(పండ్ల బుట్టతో తాత మనవళ్ళు గజశాల వైపు నడిచారు.)

ఆధారం: జి. చంద్రశేఖర్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate