অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కరువు సీమలో కప్పల పెళ్ళి

కరువు సీమలో కప్పల పెళ్ళి

frogరఘురాం తాత :

"కప్పదేవరంటు - కప్పల పెళ్ళిల్లు చేసి,

కరువు సీమలోన - వానల్ల కురుయననుచు,

అంబరంబంతటా - ఆశలు పులుముచున్న

పిచ్చిమూరులున్న - రాళ్ళసీమ మా రాయలసీమ"

(మనస్సులోని బాధను కాగితంపై, కవితారూపకంగా నిలుపుతున్నారు తాతగారు.)

వెంకటయ్య : (తాతగారి బాల్యస్నేహితుడు) ఏమిటి రఘూ! ఏదో రాసేస్తున్నావు?

రఘురాం : (కవితను అతని ముందుకు జరిపాడు)

వెంకటయ్య : (చదివి! ఒక నిమిషం తరువాత..!) ఇంటిల్లిపాది, ఉద్యోగాలు చేసే మీలాంటి వారికి వరాభావం గురించి ఏం తెలుసుంది..! వూలాంటి రైతులకైతే వాన నీళ్ళు లేకపోతే, కన్నీళ్ళు కాలువలు కట్టడం ఖాయంగాని!

రఘురాం : వరాధారమైన భూములలో వానలు కురవకపోతే చాల కష్టమని నాకు తెల్పును. కాని అమాయకపు కప్పను రోకలికి కట్టి, కప్పల పెళ్ళిళ్ళు చేస్తే వానలు పడతాయనడం మూర్ఖత్వం కాదా?>

వెంకటయ్య : ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయలు అన్నీ తప్పే అనడం కూడా మూఢత్వం కదా? రఘురాం : కప్పదేవరలో శాస్త్రీయ కోణం ఏముంది?

వెంకటయ్య : నిన్న వునఊరిలో జరిగిన కప్పదేవరను ఒకసారి గుర్తుతెచ్చుకో రఘు! (వారి మనస్సులో, నిన్నటి రోజున గ్రామంలో జరిగిన కప్పదేవర కళ్ళ ముందు గిర్రున తిరగడం ప్రారంభంమైంది)

పిల్లలు :

“వానలు కురవాలి - వానదేవుడా,

కప్పల్లు తడవాలి - వానదేవుడా,

వంకలు పారాలి - వానదేవుడా,

చెరువులు నిండాలి - వానదేవుడా,

పంటలు పండాలి - వానదేవుడా!

(అని పాడుతూ, ఓ గుంపు వచ్చి తాతగారి యింటి ముందు ఆగింది. లేపలి నుండి నానమ్మ బిందెడు నీరు, పసుపు, కుంకుమ, గిన్నెలు తీసుకొని వడివడిగా బయటకు వచ్చింది.)

నానమ్మ : ఒరే నాయనా! పెద్దదాన్ని బిందె ఎత్తి పోయలేను, కాస్త వంగండి రా!

(మధ్యలో కప్పను కట్టి, వేపాకుతో అలంకరించిన రోకలిని మోస్తున్న మల్లేసు, రాజయ్యలు ముందుకు వంగారు దానిపై నీరు కుమ్మరిసూ!)

నానమ్మ : వానదేవుడా! సమయానిక తగిన వానలు కురిపించు తండ్రి (అని మొక్కుకుంది)

frogtwoరఘురాం : కప్పను చంపితే దేవుడు కరుణిస్తాడా?

మల్లేసు : సామీ! మాట జాగ్రత్త! ఇది కప్పదేవర దీన్ని చంపితే మాకు నాశనమే!

రఘురాం : కాదురా! మీరు చేసే హంగామాకు, ఆ కప్ప బతుకుతుందంటావా?

రాణెమ్మ : అయ్యా! మళ్ళీ అదే మాట, మా భక్తి మాది, మా నమ్మకాలు మూవి!

రాజయ్య : శాస్రం చట్టూ బండలంటు మా ఆచారాలకు అపశకునాలు పలికితే యవ్వారం బాగుండదంతే!

వెంకటయ్య : ఒరే! ఒరే, ఆవేశ పడకండి రా! వయస్సులో పెద్దాయన! తెలీక ఏదో అన్నాడు.

మల్లేసు : తెలీకపోతే తెల్సుకోమని చెప్పవయ్యా!

వెంకటయ్య : రఘూ! ఈ కప్పను వీళ్ళు జాగ్రత్తగా శ్రద్ధగా పూజించి మరో కప్పతో పెళ్ళిచేసి, ఏదైనా నీటి చలమలో వదులుతారు.

రాణెమ్మ : కప్పల పెళ్ళి చేస్తే, వానలు బాగా కురిసి, గాదెలు నిండేలా పంటలు పండుతాయని మా నమ్మకమయ్యా!

(తాతగారు వాదించపోతుంటే నానమ్మ ఆయనను ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది.)

(మర్నాడు)

రఘురాం : నిన్నటి వారి ప్రవర్తనలో ఆక్రోశమో, ఆవేశమో కన్పించింది నాకు!

వెంకటయ్య : అది వారిలోని ఆవేదన మాత్రమే! ఒకసారి వారివైపు నుంచి ఆలోచించు, ఐదు సంవత్సరాలుగా వానలు లేవు! పంట భూములు, పచ్చిక బయళ్ళు ఎండిపోయాయి, కరువు వారి బతుకులలో నాట్యం చేస్తోంది..!

రఘురాం : మేఘ మధనం, రైన్ గన్స్ ద్వారా వ్యవసాయశాఖ వారు ఆదుకుంటున్నారుగా! వెంకటయ్య : (నవ్వుతూ) నారు పోసేటప్పుడు తొలకరి చినుకులు, పైరు పెరిగేటప్పడు అంచెలంచలుగా భారీవరాలు, పంటకు అవసరం. రైతుకు ప్రకృతి మాత మాత్రమే అలా, నీటిని వానగా కురిపించగలదు.

రఘురాం : ఔన్లే! ప్రకృతిని శాసించగల శాస్రవిజ్ఞానం మనదగ్గర లేదు. కానీ కప్పల పెళ్ళితో వర్షాలంటేనే...! వెంకటయ్య : కప్పల పెళ్ళితో వర్షాలు కురియవని ఖచ్చింతంగా చెప్పగలను! (తాతయ్య శ్రద్ధగా వింటున్నాడు.) కరువు వల్ల నైరాశ్యంలో కూరుకుపోయిన రైతులను ఉత్సాహపరిచి వ్యవసాయం వైపు ఆకర్షించాలంటే ఒక పండగో, జాతరో జరపాలి..!

రఘురాం : అందుకోసం కప్పను రోకలికి కట్టి హింసించడమేమిటి?

వెంకటయ్య : నీకది హింసగా కన్పించవచ్చు. కాని కరువు రోజులలో కప్పలు కనిపించడం, వారికి రాబోయే వానలకు, చిహ్నంగా కన్పిస్తుంది. కప్పలకు, వానలకు అవినాభావ సంబంధం ఉందని వారినమ్మకం.

రఘురాం : నిజమే! కప్పలు ఎండాకాలమంతా "గ్రీష్మాకాల సుప్తావస్థ" అనే నిద్రలో వుండి, వానలు పడగానే, బయటకు వచ్చి, బెకబెక లాడటం మనం చూసూనే వున్నాం కదా! (ఈ సంభాషణంతా, శ్రద్దగా వింటున్నాడు వంశీ!)

వంశీ : తాతయ్యా! కప్పను రాయితో కొట్టినా, చంపినా వీపు మీద కురుపులొస్తాయని మా స్నేహితులు చెప్పారు, నిజమేనా!

రఘురాం : లేదు కన్నా అది ఒట్టి అబద్ధం! కాని కప్పలు పంటలు తినే క్రిములను, మిడతలను, కీటకాలను తినడం ద్వారా పంటను రక్షిస్తాయి. వాటిని చంపరాదు.

వేంకటయ్య : చూశావా! రఘూ, కప్పలకు దైవత్వం ఇవ్వడం ద్వారా వాటికి ప్రాణాపాయం తప్పింది.

కఘురాం : ఒక వ్యక్తికిగాని, ప్రాణికిగాని దైవత్వం ఇవ్వడానికి నేనెప్పటికి ఆంగీకరించలేను. కానీ సంఘవిశ్వాసాలు, మతాచారాలను సున్నితంగా సంస్కరించాలి.

వెంకటయ్య : ఎక్కువగా నిరక్షరాస్యులైనా జానపదులకు ఇవ్వన్ని  చెప్పి ఒప్పించడం కష్టమే!

రఘురాం : అలాంటప్పుడు శాస్త్రాన్ని జోడిస్తూ కళారూపాల ద్వారా ప్రచారం చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయేమో!

వంశీ : తాతయ్యా! కప్పలకు సంబంధించిన కరపత్రాలు ముద్రించి, కప్పదేవరతో పాటు గ్రామమంత పంచితే?

వెంకటయ్య : (వంశీ భుజంతడుతూ) తాతకు తగిన మనవడివిరా! కనీసం చదువుకున్న గ్రామస్తులైనా అర్ధం చేసుకుంటారు.

రఘురాం : ఇప్పడే ఆ పని ప్రారంభిస్తాను.

(కవితలు వదిలి, ప్రజలకు అర్థమయ్యేలా కరపత్రాలు రాసే పనిలో తాతగారు తలమునకలవుతున్నారు. చేతికొచ్చిన తేనీటిని ఆస్వాదించడంలో వెంకటయ్యగారు నిమగ్నమైనారు!)

రచయిత: జి. చంద్రశేఖర్, సెల్. 9494746248© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate