పూర్వకాలంలో 'ఇండియన్ రోప్ ట్రిక్' అని ఓ గమ్మత్తు గారడీ చేసేవారట. ఓ బుట్టలో పొడవాటి తాడు చుట్టగా చుట్టబెట్టి బుట్టలోని తాడు పాములాగా పైకి లేచి అలా గాలిలో ప్రాకుతూ పైకి లేచి పైకి పోయి గాలిలో నిలబడుతుందట... మరి ఆ తాడు గాలిలో నిలబడిందో లేదో తెలీదు గానీ మనం ఓ దారపు ముక్కను అలా గాలిలో నిలబెడదామా! పాఠశాల సెలవుల తరువాత పాఠశాలలో స్నేహితులతో పందెం కాయండి.. దారం ముక్కను గాలిలో నిలబెడతానని... నీ వల్ల కాదంటారు... 'కాదంటే ఆవుననిలే' అని పాట పాడి దారాన్ని గాలిలో నిలువుగా నిలబెట్టండి ... ఎలాగంటారా... రండి... చేసి చూద్దాం.
కావలసిన పరికరాలు
చేయు విధానం : బట్టల హేంగర్ తీసుకొని (అల్యూమినియం హేంగర్ అయితే సులభంగా వంగుతుంది) పటంలో చూపిన విధంగా కాస్త వంచి హేంగర్ కొక్కీకి అయస్కాంతాన్ని (గుర్రపునాడా అయస్కాంతం లేక పోతే గుండ్రటి అయస్కాంతాన్ని కట్టండి) వ్రేలాడదీయండి. హేంగర్ రెండవ కొనను 'L' ఆకారంలో వంచి దాని బరువైన పుస్తకాన్ని పెట్టి పటంలో చూపిన విధంగా నిట్ట నిలువుగా అమర్చండి.
ఇప్పుడు పేపరు క్లిప్పుకు దారపు ముక్క ఒక కొనను ముడి వేయండి. ఈ క్లిప్పును వ్రేలాడదీసిన అయస్కాంతం దగ్గరకు తీసుకువస్తే అది ఆకర్షింపబడుతుంది కదా. దారంతో క్లిప్పును అయస్కాంతం నుండి వేరు పడేలా క్రిందకు లాగండి. అయస్కాంతానికి క్లిప్పుకు ఓ సెంటీమీటరు దూరం వుండేలా లాగి దారపు రెండవ కొనను పటంలో చూపిన విధంగా పుస్తకం పై వుంచి గం టేప్ తో అతికించండి. అంతే దారపు ముక్క అలా గాలిలో తేలుతూ వుంటుంది (క్లిప్పుతో సహా) అంతే. దారపు ముక్క గాలిలో నిలబడింది కదా. మీరు పందెం గెలిచినట్లే.
ఇంతకు ఇదెలా సాధ్యం అయింది?
అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షిస్తుంది కదా. పేపరు క్లిప్ ఇనుప ముక్కతో చేయబడింది కదా. అందువల్ల ఆకర్షింపబడింది. మరి మనం క్లిప్పును అయస్కాంతం నుండి లాగి 1 సెం.మీ దూరంలో వుంచాము కదా. ఇలా అంటే అయస్కాంతం చుట్టూ అయస్కాంతం ప్రభావం (అయస్కాంతం క్షేత్రం) వుంటుంది.
క్లిప్పు పై రెండు బలాలు పనిచేస్తూ వుంటాయి. అయస్కాంతపు ఆకర్షణ బలం పై వైపుకి దారం ముక్క ద్వారా భూమ్యాకర్షణ బలం క్రిందికి పనిచేస్తూ వుంటాయి. ఈ రెండు బలాలు సమానమైనప్పుడు క్లిప్పు, దాని వల్ల దారము అలా గాలిలో తేలుతూ వుంటుంది. అదన్నమాట.
ఆధారం: పలమనేరు యుగంధర్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020