অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రోబో యుగం

ఇది రోబో యుగం. దాదాపు అన్నీ రంగాల్లోనూ రోబోల పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. 2050 నాటికి మనం చేస్తున్న అన్ని పనులకూ రోబోలతోనే జరిగినా ఆశ్చర్యం లేదు. ఈ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా రోబోల గురించి వస్తున్న కొంత సమాచారాన్ని అందిస్తున్నాం.

చంద్రుని మీద రోబో స్టేషన్ ఏర్పాటు

చంద్రుని భౌగోళిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసేందుకు అక్కడ ఓ రోబో స్టేషన్ ని ఏర్పాటు చేయాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ స్టేషన్ వల్ల అక్కడి శాంపిల్స్ ను భూమ్మీదికి తీసుకొచ్చే అవసరం లేకుండా అక్కడే పరిశోధించే అవకాశం ఏర్పడుతుందని పీకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జియోవీక్సిన్ తెలిపారు. ఒక సోలార్ పవర్ జనరేటర్ ను కూడా అక్కడ ఏర్పాటు చేస్తే రోవర్లు అవసరం లేకుండానే చంద్రుని భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయవచ్చు. ఈ ప్రయోగానికి సంబంధించి మొదటి క్యారియర్ రాకెట్ ను 2030లోగా పంపేందుకు చైనా సిద్ధమవుతోంది.

పౌరసత్వం పొందిన తొలి రోబో

హాంగ్ కాంగ్ కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన రోబో ‘సోఫియా' కు అక్టోబర్ 2017 లో సౌదీ అరేబియా ఆ దేశ పౌరసత్వాన్ని మంజూరు చేసింది. దీంతో ప్రపంచంలోనే ఒక దేశ పౌరసత్వం పొందిన రోబోగా 'సోఫియా' గుర్తింపుపొందింది. ఇది మనుషుల ముఖాలను గుర్తుపడుతుంది. సహజంగా వారితో సంభాషణ చేస్తుంది. మనుషుల్లాగా కన్పిస్తూ మనుషుల్లాగా పని చేసే రోబోలను సృష్టించడం తమ లక్ష్యమని కంపెనీ వ్యవస్థాపకుడు హన్సన్ తెలియజేశాడు. మనుషుల్లాగే తనకు కోపం, విచారం, నిరాశ వంటి భావనలను తన మఖకవళికల ద్వారా సోఫియ ప్రదర్శిస్తుంది. మన ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. మనిషి యంత్రం కలిసి మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలవని హన్సన్ అన్నారు. తనూ ఈ అభిప్రాయంలో ఏకీభవిస్తున్నానని సోఫియా చెప్పింది. రోబో టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు ముందుముందు మనిషిని మించిపోయే మెషీన్ లను తయారు చేయగలుగుతాయనేందుకు 'సోఫియా' ఒక ఉదాహరణ.

మన దేశానికి వచ్చిన సోఫియా

సోఫియా రోబో తొలిసారిగా మన దేశానికి వచ్చింది. డిసెంబర్ 30 న ఐ.ఐ.టి బొంబేలో సాంస్కృతిక  కార్యక్రమాల్లో పాల్గొంది. చీర కట్టుకుని ఒక భారతీయ మహిళలాగా మెరిసిపోయింది. 3 వేల మంది ఎంతో ఆసక్తితో తిలకించిన కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇండియాకు తన తొలి యాత్ర గురించిని అడిగినపుడు ఇండియాకు రావాలని నేను చాలా సార్లు అనుకున్నాను. ఘనమైన ఈ దేశం గురించి, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను గురించి విన్నాను. సిలికాన్ వ్యాలీకి భారతీయులు చాలా తోడ్పడ్డారు. అంతరిక్ష సాంకేతిక రంగానికి ఇండియా ఇస్తున్న ప్రాధాన్యత అద్భుతం, అని చెప్పింది సోఫియా. ‘ఎన్నో సమస్యలుండగా రోబోలకు విపరీతంగా ఖర్చు చేయడంపై అభిప్రాయం' అడగ్గా మౌనం వహించింది ఓ సోఫియా.

రోబోకు జపాన్ లో రెసిడెన్స్ సర్టిఫికెట్

ఆ అబ్బాయి పేరు షిబుయా మిరాయ్. వయస్సు ఏడేళ్ళు. మనుషులతో ఛాటింగ్ చేసేందుకు LINE మెసేజింగ్ ఆప్ ను ఉపయోగించుకుంటాడు. ఇంతకీ ఈ అబ్బాయి ప్రాణమున్న మనిషి అనుకోకండి. కృత్రిమ మేధస్సు సృష్టించిన ఒక రోబో. విశేషమేమిటంటే ఈ రోబోకు జపాన్ టోక్యోలోని షిబుయావార్డ్ లో నివాసం కల్పించి దానికి సంబంధించి ‘రెసిడెన్స్ సర్టిఫికేట్' ను ఇచ్చింది. అధికారికంగా నివాస ధృవీకరణ పత్రం పొందిన తొలి రోబో 'షిబుయా మిరాయ్'. మిరాయ్ అంటే జపనీస్ భాషలో భవిష్యత్ అని అర్ధం. మొదటి తరగతి చదువుతున్నట్లు లెక్క, మనం ఏదైనా మెసేజ్ పంపితే దానికి తిరిగి జవాబిస్తుంది ఈ రోబో. ఫోటోలు తీయడం దీని హాబీ జనంతో మాట్లాడం ఇష్టం. అదీ, ఇది అని కాదు ఏ విషయం గురించి అయినా మాట్లాడతాడి బుడతడు.

మెడికల్ ఎంట్రన్స్ పరిక్షలో రోబోకు ఫస్ట్ ర్యాంకు

చైనాలో జాతీయ స్థాయిలో నిర్వహించిన మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కు 5.3 లక్షల మంచి హాజరయ్యారు. విద్యార్థుల్లో అత్యధిక మార్కులు 360 కాగా రోబో మాత్రమే 456 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరీక్షకు రోబో కూడా విద్యార్థులతో పాటే హాజరయింది. ఇంటర్నెట్ సిగ్నలింగ్ వ్యవస్థలు లేకుండానే పరీక్ష రాసింది. ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ రోబో క్లినికల్ డయాగ్నోసిస్ లో డాక్టర్లకు సాయపడుతుంది.

ఉద్యోగాలన్నీ రోబోకేనా

2030 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల ఉద్యోగాలను రోబోలు భర్తీ చేయనున్నాయని అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సేవల సంస్థ మెక్సిన్సే మరియు కంపెనీ తాజా నివేదిక అంచనా వేసింది. ఆధునిక యాంత్రీకరణ పరిజ్ఞానాల ప్రభావం అన్ని దేశాల్లోను ఉద్యోగాల పైన భారీగా ప్రభావం ఉంటుందంటున్నారు. ఆటోమేషన్ కారణంగా మన దేశంలో 5.7 కోట్ల ఉద్యోగాలు రోబోలు కైవసం చేసుకుంటాయట. ఐటి, టెక్నాలజీ రంగాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ గార్ట్ నర్ సంస్థ ఇటీవల ఇందుకు భిన్నమైన నివేదిక వెలువరించింది. 2020 నాటికి కృత్రిమ మేధస్సు కారణంగా భౌతికమైన ఉద్యోగాలు 1.8 మిలియన్ వరకు తగ్గినా, 2.3 మిలియన్ కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని ఈ నివేదిక వెల్లడించింది. ఆరోగ్య రంగం, పబ్లిక్ రంగం, విద్యకు సంబంధించిన ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది కాని ఉత్పాదన రంగం మాత్రం Artificial Intelligence ప్రభావానికి ఎక్కువగా గురవుతుందని అంచనా!

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate