অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భారత దేశంలో జైనము మరియు భౌద్ధము

భారత దేశంలో జైనము మరియు భౌద్ధము

పరిచయం

క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మతాలు ఆవిర్భవించాయి. వీటిలో ముఖ్యమైనవి జైనమతం, బౌద్ధమతం. ఈ రెండు మతాలు భారతదేశ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది.

జైన మతం

 • జైనమతం చాలా పురాతన కాలం నుంచి ఉందని తెలుస్తోంది.
 • రుగ్వేద మంత్రాల్లో జైన మత స్థాపకులైన మొదటి తీర్థంకరుడైన రుషభనాథుని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది.
 • జైన సాహిత్యం ప్రకారం జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారని, అందరూ క్షత్రియులేనని తెలుస్తోంది.
 • వీరిలో మొదటి ఇరవై రెండు మంది పౌరాణిక వ్యక్తులు. కానీ 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడైన మహావీరుడు చారిత్రక పురుషులు.
 • చారిత్రకంగా మాత్రం జైనమత స్థాపకుడు 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. ‘తీర్థంకరులంటే జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు’ అని అర్థం.
  పార్శ్వనాథుడు:
 • కాశీ (బెనారస్) రాజైన అశ్వసేనుడు, రాణి వామలకు జన్మించాడు. 30 ఏళ్ల వయస్సు వరకు గృహస్థ జీవితాన్ని గడిపాడు. తర్వాత ఇహలోక సుఖాలను త్యజించి, 84 రోజులు తపస్సు చేసి జ్ఞానిగా మారాడు.
 • అహింస, సత్యం, అస్తేయం(దొంగతనం చేయకూడదు), అపరిగ్రహం (ఆస్తి ఉండకూడదు) అనే నాలుగు సూత్రాలను బోధించాడు. అదనంగా ఐదో సూత్రమైన బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు. పార్శ్వనాథుడు తన వందో ఏట బెంగాల్‌లో నిర్యాణం చెందాడు.
  వర్థమాన మహావీరుడు (క్రీ.పూ. 540- 468):
 • వర్థమానుడు.. సిద్ధార్థ, త్రిశాల దంపతులకు క్రీ.పూ. 540లో వైశాలి సమీపాన కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో జన్మించాడు.
 • వర్థమానుని తండ్రి జ్ఞాత్రిక తెగకు అధిపతి కాగా, తల్లి వైశాలిని పరిపాలించిన చేతకుడి సోదరి, లిచ్ఛవీ రాజకుమార్తె.
 • మగధ రాజు బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల మగధను పరిపాలించిన హర్యాంక రాజ వంశీకులకు మహావీరుడు బంధువు అవుతాడు.
 • మహావీరుడికి యుక్త వయసులోనే యశోదతో వివాహం అయింది. తన 30వ ఏట సన్యసించాడు. ఆరేళ్లు దిగంబర యోగిగా తపస్సు చేసి విఫలుడై మక్కలి గోసాలుని (అజీవక మతశాఖ స్థాపకుడు) వద్ద శిష్యత్వం స్వీకరించాడు.
 • తన 42వ ఏట జ్ఞానోదయం (కైవల్య) పొంది జినుడయ్యాడు. ‘జినుడు అంటే పంచేంద్రియాలను జయించినవాడు’ అని అర్థం. ధైర్యసాహసాలతో తపస్సు సాగించినందున మహావీరుడు అని, మహాజ్ఞాని కావడం వల్ల కేవలి అని, సకల బంధాలు తెంచుకొన్నందున నిర్గ్రంధుడని వర్థమానుడు గుర్తింపు పొందాడు.
 • జ్ఞానోదయం పొందిన తర్వాత వర్థమాన మహావీరుడు ఏడాదిలో ఎనిమిది నెలలు దేశాటన చేస్తూ ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. మిగిలిన నాలుగు నెలలు చంప, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్తి మొదలైన పట్టణాల్లో కాలం గడిపేవాడు. ఈ నగరాలు జైనమత వ్యాప్తిని సూచిస్తాయి. మహావీరుడు 72వ ఏట క్రీ.పూ. 468లో పాటలీపుత్రం సమీపంలోని పావపురిలో హస్తిపాలుడనే రాజు గృహంలో నిర్యాణం చెందాడు.
 • మహావీరుడు వేదాలు ప్రామాణిక గ్రంథాలు, యజ్ఞాలు మోక్ష సాధనాలు కాదని చెప్పాడు. జంతు బలులను, వర్ణ భేదాలను ఖండించాడు.
 • బ్రాహ్మణుల ఆధిక్యతను ఖండించి, అన్ని వర్ణాలవారు మోక్షానికి అర్హులే అనే సమత్వ సూత్రాన్ని ఉద్భోదించాడు. పవిత్ర జీవితం గడుపుతూ సన్యాసిగా తపస్సు చేసి నిర్యాణం పొందొచ్చని మహావీరుడు బోధించాడు.
 • భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని విశ్వసించ లేదు. మానవుడు.. ముక్తి కోసం భగవంతుడి అనుగ్రహం పొందిన లేదా మరే ఇతర వ్యక్తిపైనా ఆధారపడకూడదని, తన భవిష్యత్తుకు తానే కర్తని బోధించాడు.

 • వర్ణ వ్యవస్థలో ఒక వ్యక్తి స్థానాన్ని అతని పూర్వ జన్మలోని పాపపుణ్యాలు నిర్ణయిస్తాయని మహావీరుడు పేర్కొన్నాడు.

 • మహావీరుడికి భగవంతుడిపై నమ్మకం లేకపోయినప్పటికీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆత్మ ఉందని, ఆత్మకు పునర్జన్మ ఉందని కూడా అంగీకరించాడు. మానవుల కర్మలే వారి భవిష్యత్తుని నిర్ణయిస్తాయని కర్మ సిద్ధాంతాన్ని చాటి చెప్పాడు.
 • కామ, క్రోధ, లోభ, మోహం, అజ్ఞానం కర్మకు కారణమని, కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్లీ జన్మించాల్సి వస్తుందని అన్నాడు.
 • కర్మను అంతం చేసి మోక్షం పొందాలంటే ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని బోధించాడు. వీటిని త్రిరత్నాలు అంటారు. అవి..
  సరైన విశ్వాసం అంటే మహావీరుడి భావనల్లో శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండటం.
  సరైన జ్ఞానం అంటే మహావీరుడి బోధనల్లోని సత్యాన్ని గ్రహించడం.
  సరైన నడవడి అంటే జైన పంచ వ్రతాలను ఆచరించడం.
  జైనుల మొదటి సమావేశం పాటలీపుత్రంలో క్రీ.పూ.300లో జరిగింది. ఈ సమావేశ ఫలితంగా జైన తీర్థంకరులు బోధించిన సిద్ధాంతాలను 12 అంగాలుగా క్రోడీకరించారు. వీటిపై వ్యాఖ్యానాలు కూడా రాశారు. వాటిని నిర్యుక్తులు అని అంటారు.
  క్రీ.పూ. 4వ శతాబ్ది చివరి కాలంలో బీహార్‌లో భయంకరమైన కరువు ఏర్పడింది. ఇది 12 ఏళ్లపాటు ఉంది. ఈ సమయంలో భద్రబాహు నాయకత్వంలో కొందరు జైనులు దక్షిణాదిలోని మైసూరు ప్రాంతానికి వెళ్లారు. వీరు దక్షిణాదిలో జైనమతం వ్యాపింప చేశారు.
  స్థూలభద్రుడి అనుచరులను శ్వేతాంబరు లని, భద్రబాహు అనుచరులను దిగంబరులని అంటారు.‘శ్వేతాంబరుల ఆధ్వర్యంలో క్రీ.శ.5 వ శతాబ్దంలో వల్లభి (గుజరాత్)లో జైనమత రెండో పరిషత్ జరిగింది’. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పవిత్ర గ్రంథాలను సేకరించి వాటిని క్రమ పద్ధతిలో, అర్థమాగధి భాషలో రాయడం.

బౌద్ధ మతం

 • గౌతమబుద్ధుడి అసలు పేరు.. సిద్ధార్థుడు.
 • క్రీ.పూ. 563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని వద్ద జన్మించాడు.
 • తండ్రి శుద్ధోధనుడు శాక్య తెగ అధిపతి. తల్లి మాయాదేవి కొలియ తెగలో పుట్టింది.
 • సిద్ధార్థుడు పుట్టిన కొద్ది కాలానికే తల్లి మరణించడంతో సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి చేతుల్లో పెరిగాడు. అందుకే అతడిని గౌతముడు అంటారు. అయితే ‘సిద్ధార్థుని గోత్ర నామమైన గౌతమి నుంచి కూడా గౌతముడు అనే పేరు వచ్చి ఉండొచ్చు’.

 • గౌతముడికి యశోధర అనే రాకుమార్తెతో వివాహం జరిగింది. వారికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. ఒకరోజు రథసారథి చెన్నడు రథం తోలుతుండగా బుద్ధుడు దారిలో ముసలివాడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూశాడు. వీరిని చూసిన తర్వాత అతడికి దేహం అశాశ్వతమని, ప్రాపంచిక సుఖాలు క్షణభంగురాలని, నిష్ర్పయోజనాలని అనిపించి హృదయంకలత చెందింది. అర్ధరాత్రి తన రథసారథిని అశ్వం సిద్ధం చేయమని ఆజ్ఞాపించి దానిపై బయలుదేరి వెళ్లాడు. సిద్ధార్థుడు తన 29వ ఏట మహాభినిష్ర్కమణం చేశాడు.

 • సిద్ధార్థుడు చాలా గ్రామాలు ప్రయాణం చేసి వైశాలి గ్రామం చేరాడు. అక్కడ ‘అలారకలామ’ అనే గురువు దగ్గర సాంఖ్య దర్శన విజ్ఞానం సంపాదించాడు. కానీ దీనివల్ల తృప్తి పొందలేకపోయాడు. తర్వాత వైశాలి రాజధాని అయిన రాజగృహానికి వెళ్లాడు. అక్కడ కూడా సంతృప్తి చెందలేక ఉరువేల అనే ప్రాంతం చేరాడు. అక్కడ బోధి వృక్షం కిందకు చేరాడు. ఈ ప్రదేశం గౌతముడికి నచ్చడంతో జ్ఞానోదయం పొందేవరకు అక్కడే తపస్సు చేయాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏడువారాల దీర్ఘ తపస్సులో నిమగ్నమైన తర్వాత వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం అయింది. అప్పుడతడు బుద్ధుడయ్యాడు. ఆ ప్రదేశం బుద్ధ గయగా మారింది.
 • బుద్ధ గయ (ఉరువేల) నుంచి బుద్ధుడు వారణాసి చేరి తర్వాత సారనాథ్‌లోని జింకల వనంలో తన పూర్వ సహచరులైన ఐదుగురు బ్రాహ్మణ సన్యాసులకు ప్రప్రథమంగా జ్ఞానోపదేశం చేశాడు. ఇదే ధర్మచక్ర ప్రవర్తనంగా పేరొందింది. వారు బుద్ధుడికి శిష్యులు అయ్యారు. వారితో బుద్ధుడు ఒక సంఘం స్థాపించాడు. తర్వాత మగధాధీశులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు బుద్ధుడికి శిష్యులయ్యారు. దొంగ అయిన అంగుళీమాలుడిని బుద్ధుడు బౌద్ధుడిగా చేశాడు.

 • దుఃఖ నివారణ సాధించడానికి దుఃఖ కారణమైన కోరికలను త్యజించాలని అందుకు అష్టాంగ మార్గాన్ని అవలంబించాలని బుద్ధుడు బోధించాడు. అష్టాంగ మార్గంలో ఎనిమిది సూత్రాలున్నాయి. ఈ ఎనిమిది సూత్రాలను చక్కగా అర్థం చేసుకొని ఆచరణలో వాటిని పాటించడం ద్వారా మనశ్శాంతి, జ్ఞానం, నిర్యాణంపొందొచ్చని బౌద్ధం చెబుతోంది.

 • వృద్ధాప్యంలో ఆనందుడిని తన పరిచారకుడిగా ఎంపిక చేసుకున్నాడు. బుద్ధుడు తన 80వ ఏట క్రీ.పూ. 483లో కుశినార అనే ప్రదేశం వద్ద నిర్యాణం చెందాడు. దీనినే మహాపరినిర్యాణం అంటారు. ‘మహాపరిని బానసుత్త’ కుశినార వరకు జరిగిన బుద్ధుడి చివరి యాత్రను, అపాయకరమైన రోగం, నిర్యాణం, అవశేషాల పంపిణీ గురించి విపులంగా పేర్కొంటుంది.

 • బుద్ధుడి మరణం తర్వాత ఆయన బోధనలను త్రిపీఠకాల రూపంలో సేకరించారు. త్రిపీఠకాలు అంటే మూడు ధర్మపు బుట్టలు. అందుకే వాటికి త్రిపీఠకాలు అని పేరు వచ్చింది. బౌద్ధం కొన్నేళ్లకు హీనయానం, మహాయానం, వజ్రయానం రూపాలుగా పరిణామం చెందింది. మహాయానంలో బుద్ధుడిని దేవుడిగా పరిగణించారు. వజ్రయానంలో మళ్లీ కర్మకాండలకు ప్రాధాన్యం పెరిగింది.
  బుద్ధుడి పూర్వ జీవితం గురించి చెప్పే కథలే జాతక కథలు. ఎడ్విన్ ఆర్నాల్డ్ బుద్ధుడిని ‘ఆసియాజ్యోతి (light of Asia)’ అని, శ్రీమతి రైస్ డేవిడ్‌‌స ‘ప్రపంచ జ్యోతి (light of world)’ అని కీర్తించారు.

 • మహనీయులు బుద్ధుడిని భగవంతుడిగా చేసి ప్రజలకు పూజించే అవకాశం కల్పించారు. మహాయాన బౌద్ధ మతం సుమారు క్రీ.పూ. 1వ‌ శతాబ్దంలో ఆంధ్ర దేశంలో ప్రవేశించిందని తెలుస్తోంది. మహాయాన బౌద్ధుల నుంచి హిందువులు విగ్రహారాధన చేపట్టారు.

ఆధారము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పదవతరగతి సాంఘీక శాస్త్రము.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate