హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / ఆరోగ్యం - ప్రాముఖ్యత
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆరోగ్యం - ప్రాముఖ్యత

సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే.

సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆర్ధిక ఉన్నతి అదృష్టం మీదనఒ, కష్టానికి తగిన ఫలితం మీదనో ఆధారపడి ఉండగా ఆరోగ్యం మాత్రం వారి వారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ మహద్భాగ్యాన్ని పొందడం కోసం అందరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు యోగాను ఆశ్రయిస్తే, మరికొందరు ఇతర వ్యాయామాలను, మరికొందరు ప్రాణాయామాన్ని, ఆరోగ్య నియంత్రణ సూత్రాలను పాటిస్తుంటారు. జాతిపిత మహాత్మా గాంధి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో విలువైనవి బంగారు, వెండి ఆభరణాలు కాదు, అరోగ్యం మాత్రమే అన్నారు. ఈ మాటని అంగీకరించకుండా ఉండడం అసాధ్యం. అయితే నేడు ఎంతమంది ఈ సత్యానికి దగ్గరగా ఉంటున్నారు? ఎందరు ఆరోగ్యంపట్ల నిజమైన శ్రద్ధ కనబరుస్తున్నారు? అని అలోచిస్తే సమాధానం అంత ఆశాజనకంగా కనిపించదు. స్పీడు యుగంలో ఆహారాన్ని కూడా అంతే స్పీడుగా అదేదో మొక్కుబడి వ్యవహారంగా భావిస్తూ ఎందరో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎప్పటికప్పుడే తొందర, చింత, ఒత్తిడిలతో సతమతమవుతూ తీసుకునే ఆహారంపట్ల ఏమాత్రం ఆసక్తి చూపించలేకపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ పట్ల మక్కువ చూపుతూ కలుషితమైన ఆహారం తీసుకుంటున్నాడు. నేడు కల్తీ లేని ఆహారంగానీ, కలుషితం కాని వాతావరణం గానీ కనిపించదు. ఇటివంటి పరిస్థితుల్లోఅ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించడం అవసరం.

గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలకంటే మెరుగైన ఆరోగ్యనికి అవకాశమున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు కారణం కలుషితం కాని వాతావరణమే. వాతావరణం కలుషితం కాకపోవడానికి కారణం అక్కడి పర్యావరణమే. పర్యావరణం పచ్చగా ఉండడమే పల్లెటూళ్ళు ఆరోగ్య కేంద్రాలై పల్లె ప్రజలు ఆరోగ్యంగా, సుఖంగా జీవించగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో పర్యావరణంకంటే కూడా కార్పొరేట్ ఆసుపత్రులపట్ల దృష్టి సారిస్తుండడమే పర్యావరణ సమతుల్యం దెబ్బ తినడానికి కారణాలవుతున్నాయి. రోగం వచ్చిన తర్వాత చేయించుకునే చికిత్సకంటే అసలు రోగం రాకుండా జాగ్రత్త పడడం అవసరమనే భావన పట్టణ ప్రజల్లో లోపిస్తోంది. సంప్రదాయసిద్ధమైన ఆహారపు అలవాట్లు, పరిశుభ్రమైన గాలి, వెలుతురు పల్లె ప్రజలను రోగాలపాలు కాకుండా చేస్తుంది. ఇందుకు వారు స్వయంగా శ్రద్ధవహించడం కూడా ఒక కారణం. వారు తినే ఆహారం ఖరీదుగా ఉండకపోయినా ఖనిజ లవణాలతో కూడి ఉంటుంది. తాజా కూరగాయలు వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ తాజాదనం పట్టణాలు, నగరాల్లో కూడా సాధ్యమే కానీ వారు దీనిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడమే ఈ అనారోగ్యాలకు హేతువవుతోంది. దానికి వారు చెప్పే కారణాలు సవాలక్ష ఉన్నా ఏ ఒక్క కారణమూ బలమైనదిగా తోచదు. కారణాలెన్నున్నా, ఏవైనా సరే కాలుష్యాన్ని నివారించుకోవడమనేది కనీస బాధ్యత.

వైద్య విధానం ఆరోగ్యం విషయంలో ప్రధాన పాత్రవహిస్తుంది కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడు సరైన చికిత్స తీసుకోవడంపట్ల తగు జాగ్రత్త అవసరం. నేడు వైద్య విజ్ఞానం ఎంత పురోగతి సాధిస్తున్నా సకాలంలో గుర్తించి ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే రోగం ముదిరి ప్రాణాంతకమయ్యే పరిస్థితి వస్తుంది. టీబీ, ఆస్త్మా, సైనుసైటిస్ వంటి రోగాలను మొదటగనే కనిపెట్టడం అవసరం. సరైన చికిత్స కూడా ఏ రోగికైనా అవసరం. ఏ రోగానికి ఏ మందు అనే కనీస జ్ఞానంతో ఆ వైద్యుడిని మాత్రమే సంప్రదించాలి ప్రతి రోగానికీ సొంత వైద్యం పనికిరాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.

ఆధ్యాత్మిక గ్రంధాలు అనిర్వచనీయమైన మానసిక విశ్రాంతినిస్తాయి కాబట్టి అటువంటి పుస్తకాలు తరచుగా చదువుతూ ఉండాలి. తోట పని చేయడం, మార్నింగ్ వాకింగ్ వంటి చిన్న చిన్న వ్యాయామాలు చక్కని ఆరోగ్యాన్నిస్తాయి. ఈ సందర్భంలో “మదర్ గూస్ రైం” అనే ఓ చిన్న పద్యం కుదరని రోగాలతో బాధపడేవారికి ఎంతో ధైర్యాన్నీ, ఉత్సాహాన్నీ కలిగిస్తుందో తెలుసుకుందాం. “ప్రపంచంలో ఏ రోగానికైనా ఉండవచ్చు చికిత్స, లేకపోవచ్చు కూడా. ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నించండి, చికిత్స లేదా, చింతే లేదు”. ఇదే విధంగా రెయిన్ హోల్డ్ నైబూర్ చెప్పిన మరో గొప్ప సందేశం “ఓ భగవంతుడా! మనశ్శాంతినీ, వివేకాన్నీ కలిగించు, మార్చుకోలేనివాటిని పరిగ్రహించేట్టు చేయి, మార్చుకోగలవాటిని మార్చుకోడానికి ధైర్యం కలిగించు, రెంటికీ భేదాన్ని గ్రహించగల వివేకాన్ని ప్రసాదించు”. ఒక వైద్యుడు తన అనుభవంతో నైపుణ్యాన్ని అనుసరించి రోగికి సహకరించవచ్చు. ఒక బంధువు చేయగలిగినంత సపర్యలు చేయవచ్చు. కానీ మందులేని రోగంతో రోగి ధైర్యంగా జీవించడం అభ్యాసం చేసుకోవడం అతడు అవలంబించవలసిన ధర్మం. కుదరని రోగాలతో తమ తమ ఉద్యమాలు కొనసాగించి జీవించిన మేధావుల ఆదర్శ జీవితాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలి.


ఏదేమైనా మెరుగైన వాతావరణం మెరుగైన ఆరోగ్యాన్నిస్తుందనే వాస్తవాన్నిప్రతి ఒక్కరూ గ్రహించాలి. గాలి, వెలుతురు సమృద్ధింగా ఉండే పర్యావరణాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. తాజా కూరగాయలనే భుజించేందుకు ప్రయత్నించాలి. ఆహరంలో పండ్లు, పాలు తీసుకుంటూ సమతౌల్యం పాటిస్తుండాలి. మంచి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడం చాలా సులువు కాబట్టి ఆహారపు అలవట్లను ఒకసారి సమీక్షించుకోని చక్కని క్రమశిక్షణతో మంచి అలవాట్ల ద్వారా వేళకు భుజిస్తూ, వేళకు నిద్రపోతూ ఎటువంటి మానసిక ఒత్తిళ్ళు లేకుండా జాగ్రత్త వహిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

శొంఠి పొడి

 

శొంఠి అంటే తెలుసు కదా? ఎండబెట్టిన అల్లం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శొంఠి పొడి ఆకలి కలిగిస్తుంది. జలుబు, జ్వరాలకు, కడుపులో గడబిడకు మంచి ఔషధం ఈ శొంఠి. టీలో వేసుకుని తాగితే వెంటనే పనిచేస్తుంది. లేదా పొడి చేసి అన్నంలో కలుపుకుని తినాలి. శొంఠి అజీర్ణానికి కూడా బాగా పనిచేస్తుంది.. మరి ఈ శొంఠి పొడి చేయడం కూడా సులువే ..

కావలసిన వస్తువులు:

శొంఠి - 50 gms

కందిపప్పు – 2 tbsp

పెసరపప్పు – 2 tbsp

సెనగపప్పు – 2 tbsp

ధనియాలు -2 tbsp

నెయ్యి – 4 tbsp

ఉప్పు – తగినంత

రెండు చెంచాల నెయ్యి వేడి చేసి ధనియాలు,పప్పులన్నీ విడివిడిగా వేయించాలి. మిగతా నెయ్యిలో శొంఠి ముక్కలు రంగు మారేవరకు వేయించాలి. చల్లారాక శొంఠిని చిన్నముక్కలుగా దంచి పెట్టుకోవాలి. లేదా ముందే చిన్నముక్కలుగా దంచి వేయించుకోవాలి. చల్లారాక అన్నీ కలిపి, తగినంత ఉప్పు వేసి గ్రైండర్ లో పొడి చేసుకోవాలి. ఇది సీసాలో వేసి భద్రపరుచుకుని తడి తగలకుండా నిల్వ చేసుకోవాలి.

ఓట్స్ వెజ్ సూప్

వానలు మొదలైనాయి. చల్లని వేళ వేడి వేడి సూపులు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి వేడితోపాటు శక్తిని కూడా ఇస్తాయి. ఆకలిని తీరుస్తాయి కూడా. ఈ క్రమంలో ఓట్స్ తో కొన్ని కూరగాయలు కలిపి వేడి వేడి సూప్ చేసుకుందామా? చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు.

కావలసిన వస్తువులు:

ఓట్స్ – 1/2 కప్పు

క్యారట్, బీన్స్ తరుగు – 1/2 కప్పు

ఉల్లిపాయ – 1 చిన్నది

ఉప్పు – తగినంత

మిరియాలపొడి – చిటికెడు

వెన్న – 1 tsp

ఉల్లిపొరక – 1 tbsp

పాన్ లో సగం వెన్నను వేడిచేసి ఓట్స్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వెన్న వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్, బీన్స్ ముక్కలను వేసి రెండు నిముషాలు వేయించి రెండు కప్పుల నీళ్లు పోసి మరో రెండు నిముషాలు ఉడికించాలి. ఇందులో ఓట్స్, ఉప్పు,మిరియాలపొడి వేసి మరో రెండు నిముషాలు ఉడికించాలి. కొద్దిగా చిక్కబడ్డాక దింపేసి సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి వేడిగా సర్వ్ చేయాలి. రుచికరమైన, ఆరోగ్యకరమైన సూప్ రెడీ …

కీరదోస సాండ్ విచ్

బ్రెడ్ తో పచ్చికూరగాయలు కలిపి సాండ్ విచ్ చేసుకోవడం చాలామందికి అలవాటు. కీరదోసతో ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన సాండ్ విచ్ ఎలా చేయాలో చూద్దాం.. మామూలుగా బ్రెడ్ అంటే ఇష్టపడనివారు కూడా ఈ సాండ్ విచ్ బావుందంటారు. మళ్లీ కావాలంటారు..

కావలసిన వస్తువులు:

కీర దోసకాయలు – 2

బ్రెడ్ స్లైసులు – 6 – 8

చీజ్ – 4 tbsp

వెన్న – 4 tbsp

ఉప్పు -తగినంత

మిరియాలపొడి – చిటికెడు

సోయాకూర లేదా కొత్తిమిర – 2 tsp

గ్రీన్ చట్నీ – 1/4 కప్పు

(కొత్తిమిర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి రుబ్బుకుని గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి)

కీర దోసకాయలు చెక్కు తీసి సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి. చిన్న గిన్నెలో వెన్న, చీజ్, ఉప్పు, మిరియాలపొడి, సన్నగా కట్ చేసిన సోయాకూర లేదా కొత్తిమిర వేసి కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి చీజ్ మిశ్రమాన్ని పలుచగా పూయాలి. దానిపైన గ్రీన్ చట్నీ కూడా పలుచగా రాసి కీర స్లైసులు అమర్చాలి. దాన్ని చీజ్, గ్రీన్ చట్నీ రాసిన మరో స్లైసుతో మూసి కాస్త అదిమి ఫ్రిజ్ లో పెట్టాలి. పదినిమిషాల తర్వాత తీసి త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.

పండ్ల రసాలు – ఆరోగ్యము

 

 

పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా

తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు.

అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. ప్రపంచంలోని అన్ని జబ్బులకు ప్రకృతి ఇచ్చే ప్రతి పండు, కాయ, కూరగాయ ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడివుంది.

శరీర బరువు పెంచుకునేందుకుః కొందరు బలహీనంగా ఉంటారు. అలాంటి వారు శరీర బరువు పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు పెరగడంతోపాటు ఆరోగ్యంగాను తయారవుతారంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రైఫ్రూట్స్, గోధుమలు, సజ్జలద్వారా తయారు చేసిన రసం, అన్ని రకాల పండ్ల రసాలను ఆహారంగా తీసుకుంటే శరీర బరువు పెరిగి ఆరోగ్యంగా తయారవుతారు.

ఎసిడిటీ నుంచి దూరమయ్యేందుకుః క్యారెట్, క్యాబేజీ, దోసకాయ, కలకండ, యాపిల్, పైనాపిల్ పండ్ల నుంచి తీసిన రసాలను సేవిస్తుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎసిడిటీతో బాధపడేవారు ప్రతి రోజు మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మకాయ రసం, అరచెంచా కలకండ కలుపుకుని సేవించాలి. ఉసిరికాయ చూర్ణం ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సేవించాలి. రెండుపూటలా మీరు తీసుకునే ఆహరం వేళల్లో ఖచ్చితమైన సమయాన్ని పాటించాలి. శారీరక ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రాణాయామం, ధ్యానం చేస్తుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

జలుబుతో బాధపడుతుంటేః : గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని నోట్లోవేసుకుని గరగరలాడించాలి. తులసి ఆకులు, పుదీనా ఆకులు, అరచెంచా అల్లం, బెల్లంకలుపుకుని రెండు కప్పుల నీటిలో మరిగించండి. ఈ మిశ్రమాన్ని వడగట్టిన తర్వాత అందులో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని సేవించండి. దీంతో జలుబు మటుమాయమంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

ఎత్తును పెంచే హార్మోన్‌ థెరపీ

 

కన్నబిడ్డలు నిలువెత్తు పెరగాలన్న కాంక్ష అందరికీ ఉంటుంది.కానీ, కొంతమంది పిల్లల్లో ఆ ఎదుగుదల సవ్యంగా సాగకుండా ఏవో అవరోధాలు వచ్చిపడుతుంటాయి. ఎత్తు పెరగడం అన్నది బాల్యంతో ముడిపడిన అంశం. అందుకే ఎదగడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే అన్ని చర్యలూ ఇప్పుడే చేపట్టాలి.

అందుకు పిల్లల ఎదుగుదలను పిన్న వయసు నుంచే నిశితంగా గమనిస్తూ ఉండాలి.లోపాలను చక్కదిద్దే విషయంలో ఏ ప్రయత్నం చేసినా 16 మహా అయితే 18 ఏళ్ల లోపే. ఆ వయసు దాటిపోతే ఇంక ఏ వైద్య విధానాలూ ఏమీ చేయలేవు. పిల్లలు ఏపుగా ఎదగాలని కోరుకుంటే సరిపోదు. అది కుంటుపడిపోతున్నపుడు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు నిపుణులు…

ఎలా తెలియాలి ?

తమ పిల్లలు ఏపుగా ఎదుగుతున్నారో లేదో తెలుసుకునేందుకు తల్లిదండ్రులకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. పీడియాట్రిషియన్లు, ఎండోక్రినాలజిస్టులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇవి రూపొందాయి. సాధారణంగా 4నుంచి 8 ఏళ్లలోపు పిల్లలంతా దాదాపుగా ఒకే ఎత్తుతో ఉంటారు.

ఒకవేళ ఏదైనా తేడా ఉంటే తమ పిల్లలు చదివే తరగతిలోని మిగతా పిల్లలందరితో అప్పుడప్పుడు పోల్చి చూస్తుంటే ఆ తేడా తెలిసిపోతుంది. తరగతిలోని 97 శాతం మంది పిల్లలు తమ పిల్లవాడి కన్నా ఎక్కువ ఎత్తుతో ఉంటే అప్పుడు ఇతన్ని పొట్టిగా గుర్తించాలనేది ఒక శాస్త్రీయ నిర్ధారణ, అయితే, తమకు తామే తమ పిల్లలు పొట్టి అనే భావనతో ఉండిపోవడం కాదు. పిల్లల వైద్యుడు గానీ, ఎండోక్రినాలజిస్టు గానీ పరీక్షలు నిర్వహించి ఆ విషయాన్ని నిర్ధారించినప్పుడే లోపాలు ఉన్నట్లు భావించాలి.

తల్లిదండ్రుల ఎత్తువారి నేపథ్యంతో పాటు ఒక నిర్థారిత పట్టికను అనుసరించి నిపుణులు మాత్రమే ఆ లోపాలను సరిగ్గా అంచనా వేయగలుగుతారు. ఎదుగుదలలో కనిపించే అన్ని లోపాలూ శాశ్వతమైనవేమీ కావు. దీర్ఘకాలికంగా వ్యాధులబారిన పడి ఉన్న పిల్లల్లో ఎదుగుదల కొంత కాలం ఆగిపోవచ్చు. అయితే వ్యాధి పూర్తిగా నయం కాగానే ఎదిగే వేగం మళ్లీ పుంజుకుంటుంది. ఎదుగుదలలో నిజంగానే ఏదైనా ఆటంకం ఉన్నట్లు పరీక్షల్లో తేలితే అప్పుడు ఆ మూలాలను పరిశీలించవలసి ఉంటుంది.

కారణాలు అనేకం :

పలురకాల కారణాలు పిల్లల సహజమైన ఎదుగుదలకు అడ్డుపడుతుంటాయి.వాటిలో ముఖ్యంగా పోషకాహార లోపాలు, పోషకాహారమే తీసుకుంటున్నా అని జీర్ణం కాకపోవడం, తరుచూ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, క్షయ వంటి తీవ్రవ్యాధులతో శరీరం క్షీణించిపోవడం, రక్తహీనత, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్‌ సమస్యలు పొట్టి తనానికి దారి తీస్తాయి. అయితే, ఈ సమస్యలన్నీ వైద్య చికిత్సలతో సరిచేయగలిగేవే. సకాలంలో సమస్యను గుర్తించి పూర్తిస్థాయి చికిత్సలు అందిస్తే పిల్లల ఎదుగుదల సహజవేగాన్ని పుంజుకుంటుంది.

వ్యాయామం పాలు…

ఎత్తు పెరగడానికి అవసరమయ్యే గ్రోత్‌ హార్మోన్లను ఉత్తేజితం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలు ఎంతగా అందించినా వ్యాయామం లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది. కండరాలు పెరగడానికేకాక ఎముకల వృద్ధికీి వ్యాయామం తప్పనిసరి.

మానసిక సమస్యలు : ఎదుగుదల అన్నది పూర్తిగా శారీరకమేమీ కాదు. మానసిక ఒత్తిళ్ళు కూడా ఎదుగుదలను కుంటుపరుస్తాయి. శక్తికి మించిన మానసిక శ్రమ, కుటుంబసభ్యుల మధ్య నిరంతర కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడంతో పిల్లలు నిరాదరణకు గురికావడం, లేదా అనాథలుగా మిగిలిపోవడం వంటివి ఎదుగుదలను బాగా దెబ్బతీస్తాయి.

జన్యుమూలాలు : తల్లిదండ్రులు, ఆపై వంశీకులంతా పొట్టివారైతే వారిపిల్లల్లో ఎక్కువ మంది ఆ లక్షణాలతో ఉంటారు. ఈ తరహా సమస్యలను సరిచేయడం మాత్రం కష్టమే. వంశీకులందరి ఎత్తు తక్కువే అంటే అది జన్యుపరమైన లక్షణమే తప్ప వ్యాధి కాదు. వీరికి జన్యుపరమైన చికిత్స చేసినా వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు.

తల్లిదండ్రులు ఇద్దరూ పొడుగ్గానే ఉన్నా పిల్లలు మాత్రమే పొట్టిగా ఉంటేఅప్పుడు ఆ లోపాలను పూర్తిగా పిల్లలకు సంబంధించినవిగానే భావించాలి. ఈ రకం లోపాలను చాలా సులభంగానే తొలగించవచ్చు. కాకపోతే చిన్న వయసులోనే ఆ ప్రయత్నాలు చేయాలి.

గ్రోత్‌ హార్మోన్లు : శరీరగ్రంథుల్లోంచి ఉత్సత్తి అయ్యే హార్మోన్లు నిరంతరం రక్తంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఎత్తు పెరగడానికి సంబంధించిన థైరాయిడ్‌ హార్మోన్లు, సెక్స్‌ హార్మోన్లు, గ్రోత్‌హార్మోన్లు సంయుక్తంగా తమ విధులను నిర్వహిస్తూ ఉంటాయి. వీటిలో గ్రోత్‌హార్మోన్లదే కీలక పాత్ర, మెదడు కింద అంటే నుదురు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి ఈ గ్రోత్‌ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఎదిగే వయసులో ఈ హార్మోన్ల ఉత్పత్తి అధికంగా ఉండి క్రమేపీ తగ్గి మామూలు స్థాయికి చేరుతుంది. గ్రోత్‌ హార్మోన్ల లోపం ఎదుగుదలలో పెద్ద అవరోధంగా ఉంటుంది. అయితే ఈ హార్మోన్ల లోపం కొందరిలో పుట్టుకతోనే ఉంటే కొందరిలో మధ్యలోనూ తలెత్తవచ్చు. పిట్యూటరీ గ్రంథిపైన కణుతులు ఏర్పడినా, తలకు బలంగా దెబ్బ తగిలినా హార్మోన్‌ సమస్యలు తలెత్తవచ్చు.

దీనివల్ల గ్రోత్‌హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి, ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. ఎదుగుదలలో లోపం ఉందని అనుమానం కలిగిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం కూడా చాలా ముఖ్యం. గ్రోత్‌ హార్మోన్‌ల లోపం వల్ల వచ్చే సమస్య ఎదుగుదల కుంటుపడటం ఒక్కటే కాదు. ఇది ఎముకలను బలహీనపరిచే ఆస్టియోపొరోసిస్‌ వ్యాధికీ, రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడానికి దారి తీస్తుంది.

దీనితో పాటు కొలెస్ట్రాల్‌ పెరగడానికీ, గుండె రక్తనాళాలు గట్టిపడటానికి కూడా దారి తీస్తుంది. అలాగే ఆందోళన, వ్యాకులత, నిలకడలేనితనం వంటి మానసిక సమస్యలు కూడా గ్రోత్‌ హార్మోన్ల లోపం వల్ల సంక్రమిస్తాయి. అందుకే పిల్లల ఎదుగుదల లోపాలను పట్టించుకోకపోవడం అంటే అది మరికొన్ని ఇతర వ్యాధులను ఆహ్వానించడం కూడా అనే నిజాన్ని గ్రహించాలి.

కృత్రిమ హార్మోన్లు

ఇతర హార్మోన్లు కూడా కొంత తోడ్పడినా ఎత్తును పెంచడంలో గ్రోత్‌హార్మోన్లదే ప్రధాన పాత్ర. మొత్తం శరీర నిర్మాణంలోనూ ఈ హార్మోన్లే మూలధాతువుల్లా పనిచేస్తాయి. పొట్టితనానికి లోనయిన అత్యధికుల్లో ఈ హార్మోన్‌ లోపాలే ఉంటాయి. ఈ స్థితిలో కృత్రిమ గ్రోత్‌ హార్మోన్లను ఎక్కించడం ద్వారా ఈ సమస్యను తొలగించవచ్చు.

జన్యువు మూల్యాంశాలతో ఈ హార్మోన్లను పరిశోధనాశాలల్లో కృత్రిమంగా తయారుచేస్తారు. వీటిని హ్యూమన్‌ రికాంబినెంట్‌ గ్రోత్‌ హార్మోన్లు అంటారు. ఇవి పూర్తిగా సురక్షితమైన హార్మోన్లు. గ్రోత్‌ హార్మోన్ల లోపంతో ఎదుగుదల నిలిచిపోయిన వారికి ఈ హార్మోన్లు సిరంజి ద్వారా ఇస్తారు.

ఎదుగుదల సహజ స్థాయికి వచ్చేంత వరకు రోజు ఒకటి చొప్పున ఈ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. కొంత ఎక్కువ కాలమే. ఈ చికిత్స అవసరమవుతుంది. హార్మోన్‌ లోపం లేని వారికి ఈ హార్మోన్లు ఇస్తే వచ్చే ఫలితం ఏమీ ఉండదు. గ్రోత్‌ హార్మోన్లు విటమిన్‌ మాత్రల్లాంటివి కావు.అనవసరంగా తీసుకుంటే వీటితో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. పిల్లలు లేత వయసులో అంటే 5 నుంచి 8 ఏళ్లలోపు ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అస్థిపంజరం లేతగా ఉన్న కాలంలో అయితేనే హార్మోన్‌ చికిత్స బాగా పని చేస్తుంది. అందుకే అనుమానం కలిగిన వెంటనే పిల్లల డాక్టర్‌ను గానీ, ఎండోక్రినాలజిస్టును గానీ సంప్రదించడం తప్పనిసరి. ఎక్కడో అరుదుగా తప్ప 16 ఏళ్లు దాటిన పిల్లల్లో చాలా మందికి హార్మోన్ల చికిత్స వల్ల పెద్ద ఫలితం ఉండదు. ఇక 18 ఏళ్లు దాటిన తరువాత ఎత్తు పెంచే మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎత్తును పెంచే ఇతరత్రా మందులు గానీ, మాత్రలు గానీ ఏమీ లేవు. హార్మోన్‌ చికిత్స ఒక్కటే ఇందుకు సరియైన మార్గం.

పిల్లలకు వంశపారంపర్యంగా ఏర్పడే రకరకాల అనారోగ్యాలు

 

మధుమేహం, గుండె జబ్బులు, హైపర్‌ టెన్షన్‌, కొలెస్ట్రాల్‌ పెరగడం లాంటి అనారోగ్యాలు పెద్దవారికి వస్తాయి పిల్లలకురావు అనుకుంటారు చాలా మంది. కానీ ఈ రోజుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలకు కూడా ఇటువంటి వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకు కారణాలను డాక్టర్లు పరిశీలించినపుడు వంశపారం పర్యంగానూ, జీవన విధానం, ఆహారం తీసుకునే పద్ధతి, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, పిల్లల అలవాట్లు లాంటి ఎన్నెన్నో కారణాలు పిల్లల అనారోగ్యాలకు కారణమవు తున్నాయని నిర్థారించారు. అంతే కాకుండా, గర్భం ధరించిన సమయం లో తల్లిద్వారా కూడా కొన్ని అనా రోగ్యాలు గర్భస్థ శిశువుకు ఏర్పడు తాయని కనుగొన్నారు.

పెద్దలలో కొన్ని అనారోగ్యాలు ఏర్పడినపుడు వాటి ప్రభావం పిల్లల మీద పడు తుంది. అతి ప్రమాదకర మైన ఎయిడ్స్‌ వ్యాధి పెద్దల ద్వారా వారి బిడ్డలకు సంక్రమి స్తుంది.పెద్దలకు వుండే వ్యాధులు పిల్లల కు రాకుండా నివారించటానికి జాగ్రత్త పడటం మంచిది.

కొలెస్ట్రాల్‌,లక్షణాలు

పిల్లలలో కొలెస్ట్రాల్‌ పెరగడం మన్నది వారి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఏర్పడుతుంది. ఫాస్ట్‌ఫుడ్స్‌ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా, అతిగా తినే ఫాస్ట్‌ఫుడ్స్‌ అనారోగ్యాలకు గురిచేస్తుంది. కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే పిల్లలు బరువు పెరుగుతారు. స్థూలకాయం ఏర్పడు తుంది. తరచూ అనారోగ్యాలకు గురవుతారు. కొలెస్ట్రాల్‌ శరీరంలో నిలవ ఉండడం వల్ల అటువంటి పిల్లలకు చిన్న వయసులో కానీ, వయస్సు పెరిగిన తర్వాత కానీ మధు మేహ వ్యాధి, హైపర్‌ టెన్షన్‌, గుండె జబ్బులు, స్థూలకాయం వల్ల ఏర్పడే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కొలెస్ట్రాల్‌ ఏర్పడటానికి కారణాలు- అదే పనిగా చిరుతిళ్ళు తింటూవుండటం, బరువును పెంచే పదార్థాలను అతిగా తినడంవల్ల, నూనెతో చేసిన పదా ర్ధాలు, తీపి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు అధికమవుతుంది. అంతే కాకుండా, పిల్లలకు పాఠశాలలో డ్రిల్లు, ఎక్సర్‌సైజులు, స్పోర్ట్స్‌ లాంటివి లేకపోవడం, ఇంటికి వచ్చినా పిల్లలు సాయంత్రపు నీరెండలోఆటలాడక పోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. అంతే కాదు, శరీరానికి ఎంతమాత్రం కదలిక లేకుండా టి.వి. ముందు ఎక్కువ సమయం కూర్చునిఉండడం కూడా కొలెస్ట్రాల్‌ పిల్లలదేహంలోఏర్పడటానికి కారణమవు తుంది.

కొలెస్ట్రాల్‌ను నివారించే పద్ధతి – పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాల్లో వెన్న, మీగడ, జున్ను, గుడ్లు లాంటివి ఇవ్వ కూడదు. తీపి పదార్ధాలు, కొవ్వు పదార్థాలు కూడా తగ్గించేసెయ్యాలి. పిల్లలకు మాంసాహారం కూడా అతిగా ఇవ్వకూడదు. వృక్షసంబంధమయిన ఆహారాన్నే ఇవ్వాలి. గింజధాన్యాలు, కాయ కూరలు, ఆకుకూరలు, పళ్ళు, పళ్లరసాలను ఇవ్వడం వల్ల కొలెస్ట్రాల్‌ శరీరంలో ఎక్కువ కాకుండా నివారించవచ్చు. పిల్లలకు తయారు చేసే ఆహారపదార్ధాలను, వృక్షసంబంధమయిన ఆయిల్స్‌తో తయారు చేయడం మంచిది. పిల్లలు ప్రతిరోజూ కొంత సమయం ఆటలాడేటట్లుగా పెద్దలు ప్రోత్సహించాలి. ఆటలు, ఎక్సర్‌సైజులు, వ్యాయామం లాంటి వాటిని చేయ డానికి, వారి దినచర్యలో కొంత సమయాన్ని కేటాయించాలి, బాల్యంనుంచే, శరీరంలో కొలెస్ట్రాల్‌ శాతం అధికమయితే, భవిష్యత్తులో వారు అనారోగ్యాలతో బాధపడక తప్పదన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి, పిల్లలదేహంలో కొవ్వుపేరు కోకుండా, పోషక విలువలు తగ్గని సరయిన ఆహారాన్ని వారికి అందిస్తూ, తీసుకునే ఆహారానికి సరిపడా వ్యాయామం చేసేలా జాగ్రత్తపడితే, కొలెస్ట్రాల్‌ దేహంలో పేరుకోకుండా నివారించవచ్చు.

మధుమేహవ్యాధి-లక్షణాలు

డయాబెటిస్‌ వ్యాధికి గురైన పెద్దవారికి ఉన్న లక్షణాలే పిల్లల లోనూ ఉంటాయి. పిల్లలలో ఆకలి అధికంగా ఉంటుంది. బరువు తగ్గిపోతారు. దృష్టిలోపం ఏర్పడు తుంది. కళ్ళు తిరుగుతున్నట్లు అవు తుంది. శరీరానికి తిమ్మిరి ఏర్పడు తుంది. గాయలు త్వరగా నయం కావు. కొంతమంది పిల్లలకు వాంతులు, డి హైడ్రేషన్‌ లాంటివి కూడా కలుగవచ్చు. వినికిడి శక్తిలో లోపం కలుగవచ్చు. చర్మవ్యాధులు రావచ్చు.

వ్యాధికి కారణాలు: చిన్నపిల్లలలో మధుమేహవ్యాధి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. పిల్లలకు శారీరక శ్రమలేకపోవడం, శరీరానికి కావల సినంత ప్రోటీన్స్‌ అందకపోవడం, సరయిన ఆహారం తీసు కోకుండా పస్తు లుండటం, పోషకా హారలోపం ఏర్పడటం, వయస్సుకు మించి అధిక బరువు పెరిగి స్థూల కాయం రావడం లాంటివి చిన్నపిల్లలలో ఏర్పడే మధుమేహ వ్యాధికి కారణాలు. శక్తికి మించిన అధిక శారీరక శ్రమవల్ల కూడా ఈ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలలో మధుమేహ వ్యాధి రావడానికి వారసత్వం ముఖ్యమైనది.

వ్యాధినివారణ చర్యలు: మధు మేహవ్యాధి నివారణకు ముందుగా చేయవలసినది ఆహారంలో మార్పులు, శరీరానికి శక్తిని కలిగించే పోషక విలు వలు కలిగిన ఆహా రాన్ని ఇవ్వాలి. బరువు పెరగకుండా ఉండే పదార్థాలను ఎన్ను కోవాలి. కొవ్వు పదార్థాలను తగ్గించాలి, పోటాటో చిప్స్‌, బర్గర్‌, పిజ్జాలాంటివి తినిపించ కూడదు. నిలవపానీయాలను త్రాగించకూడదు. తాజా కూరగాయలు, ఆకుకూరలు లాంటివి పిల్లలు తినేటట్లు ఆకర్షణీ యంగా తయారు చేసి ఇవ్వాలి. పాలను, పాలతో తయారు చేసిన మిల్క్‌షేక్స్‌ను ఇవ్వవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం, ఎక్సర్‌సైజులు చేయడం వల్ల శరీరం లోని ఇన్సులిన్‌ లోపాన్ని నివారించ వచ్చు. క్రీడలు, ఔట్‌ డోర్‌గేమ్స్‌ ఆడుకునేలా పెద్దలు ప్రోత్సహించాలి. పిల్లలకు మానసిక ఒత్తిడి ఏర్పడకుండా చూసుకోవాలి.

స్ట్రెస్‌ లక్షణాలు

చిన్నపిల్లలలో కూడా మానసిక స్ట్రెస్‌, ఒత్తిడి ఏర్పడుతుందని తెలుసుకోవాలి. వారి ప్రవర్తనలో ఏర్పడే కొన్ని లక్షణాలను బట్టి స్ట్రెస్‌ను గుర్తించ వచ్చు. నోట్లోవేలు వేసు కోవడం, గోళ్ళు కొరకటం, అతిగా స్పందించడం, భయపడటం, తమ భావాలను, ఆలోచన లను అదుపులో ఉంచుకోలేకపోవడం లాంటివి మానసిక లక్షణాలు. శారీరక అనారోగ్యాలయిన తలనొప్పి, ఆకలి ఎక్కువ వడం, లేదా ఆహారం తక్కువగా తీసుకోవడం, నిద్రలేమి, హైపర్‌ టెన్షన్‌, మధుమేహంలాంటి ఎన్నెన్నో అనారోగ్యాలు స్ట్రెస్‌వల్ల ఏర్పడుతాయి.

కారణాలు: చిన్నపిల్లలలో స్ట్రెస్‌ ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. తల్లిగర్భంలో ఉండగానే గర్భస్థ శిశువుకు స్ట్రెస్‌ ఆరంభమవవచ్చు. అందుకు కారణం, తల్లిమానసిక ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్‌ ప్రభావం గర్భస్థశిశువుమీద ప్రసరిస్తుంది. శైశవదశలో పాపాయికి తల్లికనిపించక పోవడం, తల్లిస్పర్శకు ఎక్కువ సమయం దూరం అవడం వల్ల అభద్రతా భావం ఏర్పడి, ఆ శిశువు స్ట్రెస్‌కు గురవుతుంది. తోబుట్టువులతో, ఫ్రెండ్స్‌ తో పోలుస్తూ పిల్లలను చులకన చేయడం, తక్కువ చేసి మాట్లాడటం వల్ల స్ట్రెస్‌ ఏర్పడుతుంది. పిల్లలమీద ఎక్కువ ఆశలు పెట్టుకుని వారిని ఒత్తిడికి గురి చేయడం, అతిగా క్రమ శిక్షణకు గురిచేయడం, క్రమశిక్షణ, కుటుంబ వాతా వరణంలో ప్రశాంతత లోపించడం, తల్లి దండ్రుల మధ్య ఏర్పడే అపార్థాలు, కలహాలు, కుటుంబ సభ్యులతో ఏర్పడే ఘర్ష ణలు, పిల్లల మనస్సుల ను అశాంతికి గురిచేసి స్ట్రెస్‌ను పెంచుతాయి.

స్ట్రెస్‌ను తొలగించే పద్ధతులు: పిల్లలను ప్రేమగా చూడడం, వారితో కొంత సమయం గడపడం వల్ల పిల్లలలో తల్లిదండ్రుల అండదండ తమకు ఉన్నదన్న నిశ్చింత ఏర్పడుతుంది. పిల్లల ఆలోచనలను, భావాలను తల్లిదండ్రు లకు చెప్పగలిగే స్వేచ్ఛ పిల్లలకు పెద్దల నుంచి లభించాలి. పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు సరిదిద్దే సమయంలో కఠినంగా వ్యవహరించకూడదు. పిల్లలు మంచి పనులను చేసినపుడు తప్పకుండా వారిని అభినందించాలి. ఇతర పిల్లలతో కానీ, తోబుట్టువులతో కానీ తమ పిల్లలను ఎన్నడూ పోల్చ కూడదు. పిల్లలు ఏదైనా కోరినపుడు, అవి సమంజస మయినవి అయితే, వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి.

పిల్లల ఆలోచనలను అర్థం చేసుకుని,వారు సవ్యమైన విధంగా ప్రవర్తించేలా తీర్చిదిద్దాలి. సెలవుల్లో పిల్లలకి మంచి కాలక్షేపం ఏదన్నా ఏర్పరచాలి. బంధువుల, స్నేహితుల ఇళ్ళకు, పిక్‌నిక్కులకు, జూ, మ్యూజియం లాంటి వాటికి పిల్లలను తీసుకెళ్లాలి. పిల్లలకు ఇష్టమైన అభిరుచి ఉన్న విషయాల్లో వాళ్లు పాల్గొనేలా ప్రోత్సహించాలి.

ఆధారము: ఆంధ్రఈవెంట్స్.బ్లాగ్

2.94339622642
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు