অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యాధి

వ్యాధి

వ్యాధులు - ప్రాథమిక పరిజ్ఞానం

సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని కల్లోల పరిచే పరిస్థితిని వ్యాధి అంటారు.

  1. ప్రత్యక్ష తాకిడి వలన వచ్చు వ్యాధులు - దనుర్వాతం, గజ్జి.
  2. సూక్ష్మ బిందువులద్వారా వచ్చు వ్యాధులు - గవధబిల్లలు, ప్లూ జ్వరము, ఆటలమ్మ, కోరింత దగ్గు, పడిశము, క్షయ.
  3. గాలి ద్వారా వచ్చు వ్యాధులు - తట్టు, నిమోనియ, ప్లో జ్వరము, క్షయ.
  4. నీటి ద్వారా వచ్చు వ్యాధులు - పోలియో, కలరా, జిగత విరేచనాలు.
  5. జంతువుల ద్వారా వచ్చు వ్యాధులు - దోమల వలన మలేరియా, బోధజ్వరం. ఈగల వలన కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్ వంటి వ్యాధులు వస్తాయి.
  6. అంటు వ్యాధులు - డిప్తీరియా, పోలియో, టి.బి., బాసిల్లరిదీసేన్త్రి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

ఫైలేరియాసిస్ వ్యాధి ( బోదకాలు )

మనం బోదకాలుగా వ్యవహరించే ఆ జబ్బు కాలు వాపుకు దారి తీస్తుంది. కేవలం కాలికే కాదు... కొందరిలో చేతులు, మరికొందరిలో మర్మావయవాల వాపుకు దారితీస్తుంది. చాలా అరుదుగా కొందరిలో రొమ్ముల్లో వాపు కూడా వస్తుంది. ఇలా కాలికిగాని, చేతికి లేదా మర్మావయవాల వద్ద వచ్చే ఈ జబ్బు ఒకసారి వస్తే దాని వల్ల కలిగే దుష్ఫలితాలు జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు కొన్ని రకాల చికిత్సలు లభ్యమవుతున్నాయి. మనలాంటి వేడి ఎక్కువగా ఉండే (ఉష్ణమండల) ప్రాంతాల్లో వచ్చే ఈ జబ్బు నివారణ, చికిత్స మొదలైన అనేక అంశాల గురించి అవగాహన కోసం ఈ కథనం.

మనదేశంలో... ఫైలేరియాసిస్ వ్యాధి తీవ్రత మన దేశంలోవి కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ. దేశంలోని 17 రాష్ట్రాలలో, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కవగా ఉండే ప్రాంతాల్లో దీన్ని నివారించడానికి ఒక్కో వ్యక్తి బరువును బట్టి డై ఇథైల్ కార్బమజైన్ 6 ఎంజీ / కేజీ మందులు ఇవ్వాలి. శరీరంలోని పరాన్నజీవులను తొలగించే మందులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మన దేశంలో 2003లో రూపొందించిన నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద 2015 నాటికి దీన్ని పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో కొన్ని నివారణ కార్యక్రమాలను చేపడుతున్నారు.

మనం బోదకాలుగా చెప్పే వ్యాధి కేవలం కాలికే పరిమితం కాదు. చేతులు, రొమ్ము, వృషణాలు వంటి భాగాల్లోనూ వస్తుంది. కాలు వాచి ఏనుగు కాలులా అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు. ఏనుగును మనం ఇష్టపడతాం. కానీ... దానిలాంటి ఊబకాయాన్ని, దానిలాంటి పొట్టను ఇష్టపడనట్లే... దాని కాలులా ఉండే బోదకాలినీ ఇష్టపడం. చురుగ్గా కదలడానికి ఉపకరించకుండా, బరువుగా ఉండే ఆ కాలు వల్ల వచ్చే సమస్య కేవలం కదలలేకపోవడం ఒక్కటే కాదు. తరచూ జ్వరం రావడం, చూడటానికి కాలు అసహ్యంగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధికి అందరూ భయపడతారు.దారపు పోగుల్లాంటి రౌండ్ వార్మ్స్ మనలోకి ప్రవేశించినప్పుడు ఈ బోదకాలు వ్యాధి వస్తుంది. ఇవి నిమటోడా వర్గానికి చెందినవి. ఇందులో వుకరేరియా బ్యాంక్రాఫ్టీ, బ్రుగియా మలయీ, బ్రుగియా టైమోరి అనే మూడు రకాలు ఉంటాయి. ఇవి క్యూలెక్స్ దోమకాటు వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అందుకే దోమకాటు నుంచి రక్షించుకుంటే దీని నివారణ సాధ్యమవుతుంది.

మరికొన్ని లక్షణాలు :

ఈ వ్యాధిగ్రస్తుల్లో మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.

అవి... తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, బొంగురుపోవడం (సోర్‌థ్రోట్), శరీరంలోకి పరాన్నజీవి ప్రవేశించిన 24 గంటల నుంచి 48 గంటల పాటు దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

నిర్ధారణ పరీక్షలు :

రక్తపరీక్ష : ఫైలేరియాతో వచ్చిన జ్వరాన్ని నిర్ధారణ చేయడానికి రక్త పరీక్ష చేయాలి. దీనికోసం వేలిని సూదితో పొడిచి రక్తం తీసి పరీక్షించాల్సి ఉంటుంది. దీన్నే ఫింగర్ ప్రిక్ టెస్ట్ అంటారు. అయితే నిర్ణీత సమయంలో తీసిన రక్తంలోనే ఈ రౌండ్ వార్మ్స్ తాలూకు మైక్రోఫైలేరియాను గుర్తించడం సాధ్యమవుతుంది. ప్రధానంగా ఈ మైక్రోఫైలేరియా రాత్రివేళల్లో గుర్తించవచ్చు. అయితే రాత్రి డ్యూటీలు చేసి, పగలు విశ్రాంతి తీసుకునే వారిలో పగటివేళలో రక్తం సేకరించాల్సి ఉంటుంది.

లింఫోసైంటిగ్రఫీ :ఇందులో తక్కువ రేడియోధార్మికత ఉన్న పదార్థాలను లింఫ్ నాళాల ద్వారా లింఫ్ ప్రవాహంలోకి ప్రవేశపెట్టి ఫొటోలు తీస్తారు.

ఎమ్మారై (మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్) :ఇందులో అయస్కాంత తరంగాలను పంపి వాటి ఆధారంగా చిత్రాలు తీసుకుంటారు.

కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కానింగ్ (సీటీ స్కానింగ్):ఈ పరీక్షలో తక్కువ రేడియేషన్‌తో ఎక్స్-రే తీస్తారు.

డ్యూప్లెక్స్ అల్ట్రాసౌండ్ స్కానింగ్:ఇందులో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలతోనూ, డాప్లర్ టెక్నాలజీతో రక్తప్రవాహం ఎలా ఉందో పరీక్షిస్తారు. కాలిలో రక్తం గడ్డ కట్టిందా, లేదా అన్నది నిర్ధారణ చేయడం కోసం ఈ పరీక్ష చేస్తారు.

లింఫ్ యాంజియోగ్రఫీ:ఇందులో లింఫ్ నాళాల్లోకి ఒక రకం రంగు పదార్థాన్ని (డై) ప్రవేశపెట్టి యాంజియోగ్రఫీలా చిత్రీకరిస్తారు. అయితే ఇప్పుడు ఈ పద్ధతిని అంతగా అనుసరించడం లేదు.

ఇమ్యునో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ) :ఇప్పుడు ఫైలేరియా యంటిజెన్‌ను కనుక్కునేందుకు ఎలైజా, కార్డ్ టెస్ట్ అనే ప్రత్యేక పరీక్షలు ఉన్నాయి. ఇందులో వుకరేరియా బ్యాంక్రాఫ్టీ జీవుల ఉనికి తెలుసుకోవచ్చు. ఇక ఫింగర్ ప్రిక్ టెస్ట్‌లో తీసుకున్న రక్తాన్ని గతంలో ప్రత్యేకంగా ఒక సమయంలో తీసుకుంటేనే మైక్రోఫైలేరియా ఉనికి తెలిసేది. కానీ కార్డ్ టెస్ట్ ద్వారా రోజులోని ఏ సమయంలో రక్తాన్ని సేకరించినా మైక్రోఫైలేరియా ఉనికి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పరీక్షలో పరాన్నజీవులు బతికి ఉండే అర్లీ స్టేజ్‌లో ‘పాజిటివ్’ అని, తర్వాతి దశల్లో నెగెటివ్ అని వచ్చే అవకాశం ఉంది.

పారసైట్ డీఎన్‌ఏ పరీక్ష :ఇది మనిషిలోని పరాన్న జీవుల డీఎన్‌ఏను పరీక్షించే అత్యున్నత శ్రేణికి చెందిన పరీక్ష. దీనితో వుకరేరియా బ్రాంకాఫ్టీ పరాన్నజీవిని, బ్రుగియన్ ఫైలేరియాసిస్ జీవులను కనుగొనవచ్చు. ఇది చాలా త్వరగానూ, తేలికగానూ చేయగల పరీక్ష. అయితే దీనిలో చాలా సున్నితమైన పరికరాలు కావాల్సి ఉంటుంది.

చికిత్స : దీనికి చికిత్సగా డై ఇథైల్ కార్బమజైన్ సిట్రేట్ (డీఈసీ) అనే మందును వ్యక్తి బరువు ఆధారంగా ఇస్తారు. డీఈసీ డోసుతో పాటు శరీరంలోని పరాన్నజీవులను తొలగించేందుకు అల్బాండజోల్ మాత్రలను తగిన మోతాదులో డాక్టర్లు సూచిస్తారు. కాలు వాచే కండిషన్ లింఫ్ ఎడిమాను తగ్గించడానికి వాచిన భాగాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం, అది పొడిగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. వాచిన కాలుకూ లేదా శరీర భాగానికి ఎలాంటి గాయాలూ కాకుండా చూసుకోవాలి.

చేతులు వాచినట్లయితే ఏదైనా రుబ్బడం లేదా వంట చేయడం వంటి పనులు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా గ్లౌజ్ ధరించాలి. వాపు ఉన్న భాగంలో షేవ్ చేస్తుంటే ఎలక్ట్రిక్ రేజర్‌ను మాత్రమే ఉపయోగించాలి. కాలికి వాపు వస్తే పాదరక్షలు లేకుండా నడవడం సరికాదు. ఫైలేరియా వచ్చిన రోగులు కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం సరికాదు. ఒకవేళ చేతికి వాపు ఉన్నప్పుడు ఆ చేతిపై బరువు పడేలా బ్యాగ్స్ వంటి బరువులను ఆ చేత్తో ఎత్తకూడదు.

మరికొన్ని జాగ్రత్తలు :

వాపు వచ్చిన ప్రాంతంలో ఎలాంటి ఇంజెక్షన్స్ వేయకూడదు.వాపు వచ్చిన చోట రక్తపోటు రీడింగ్ తీయకూడదు.

మరికొన్ని చికిత్సలు :

మాన్యువల్ లింఫాటిక్ డ్రెయినేజ్ (ఎమ్‌ఎల్‌డి) : ఇప్పుడు దెబ్బతిన్న కణజాలంలోకి కూడా లింఫ్ ప్రవాహం ప్రవేశించేలా మృదువుగా, ఒక క్రమపద్ధతిలో, పంప్ చేస్తున్నట్లు మసాజ్ చేసే ప్రక్రియను మ్యాన్యువల్ లింఫాటిక్ డ్రెయినేజ్ అంటారు. దీనితో త్వరితంగా ఫలితాలు వస్తాయి. ఇది లింఫ్ ప్రవాహాన్ని నాళాల్లో ప్రవహింపజేయడమే గాక... మనలోని వ్యర్థాలను, ప్రోటీన్లు, శిథిల కణజాలాన్ని బయటకు పంపుతుంది. కాలు వాపు వచ్చిన చోట మామూలుగా చేయడానికి కొంతమేర దోహదపడుతుంది.

కంప్రెషన్ గార్మెంట్ / కంప్రెషన్ బ్యాండేజ్ :లింఫ్ ఎడిమా వచ్చిన చోట గట్టిగా ఒత్తిడి పడేట్లుగా వేసే బ్యాండేజ్‌ను లేదా బిగుతుగా ఉండే వస్త్రాన్ని చుట్టే ప్రక్రియ ఇది. ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్న ప్రక్రియ. ఇంకా ఆరంభదశలో ఉంది.

కంప్రెషన్ పంప్ థెరపీ :వాపు వచ్చిన చోట ఒక తొడుగు లాంటిది వేస్తారు. క్రమంగా కాలు లేదా చేతి షేప్‌లో దానిపై ఒత్తిడి కలిగిస్తారు. దాంతో కాలు లేదా చేయి దాని మొదటి రూపుకు వచ్చాక బలమైన స్టాకింగ్ లేదా పైప్ లాంటిది తొడుగుతారు.

శస్త్రచికిత్స ప్రక్రియలు :ఇందులో వాపు వచ్చిన భాగాన్ని శస్త్రచికిత్స ప్రక్రియల్లో తొలగిస్తారు. లైపోసక్షన్ మాదిరిగానే వాపు ఉన్నచోట్ల ఉబ్బిన కణజాలాన్ని తొలగిస్తారు.

మైక్రోసర్జరీ: ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న అధునాతన వైద్య విజ్ఞానం, కొత్త సర్జకల్ పరికరాల ఆధారంగా లింఫోనోడల్ వీనస్, మల్టిపుల్ లింఫాటిక్ వీనస్ అనాస్టోమోసిస్ వంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అయితే ఒకసారి వాపు వచ్చాక సర్జికల్ మార్గాలతో దాన్ని తగ్గించుకోవడం కంటే ముందుగానే దోమకాటు బారిన పడకుండా నివారించుకోవడం లేదా దోమకాటుతో వచ్చే జ్వరానికి తొలిదశలో తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

దోమకాటు తర్వాత ఏమవుతుంది...?

దోమ లాలాజలంలో ఉన్న రౌండ్ వార్మ్ జీవులు మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి అవి లింఫ్ ప్రవాహంలోకి వెళ్తాయి. మనలో రక్తం లాగే లింఫ్ అనే ద్రవం కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మనలోని రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఉన్నట్లే... ఈ లింఫ్ ప్రవహించడానికి లింఫ్ నాళాలు ఉంటాయి. ఈ లింఫ్ ప్రవాహం మనిషిని అనేక ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంటుంది. దోమకాటుతో రక్తం నుంచి లింఫ్ నాళాల్లోకి ప్రవేశించిన రౌండ్ వార్మ్ అక్కడ లింఫ్ ప్రవహానికి అడ్డుపడేంత ఎక్కువ సంఖ్యలో ఎదుగుతాయి. వీటిని మైక్రోఫైలేరియా అంటారు.

ఫైలేరియాను వ్యాపింపజేసే మైక్రోఫైలేరియా... లింఫ్ ప్రవాహానికి అడ్డుపడతాయి. లింఫ్ ప్రవాహం సక్రమంగా లేనప్పుడు అక్కడ ఉన్న కణజాలం అంతా ఉబ్బుతుంది. ఆ ఉబ్బు క్రమంగా వాపులా వస్తుంది. ఈ రౌండ్ వార్మ్స్ సోకినవారిలో మొదట జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన సమయంలో చలివేస్తుంది. ప్రధానంగా లింఫ్ నోడ్స్‌లో (ఈ లింఫ్ నోడ్స్‌ను గజ్జలలో గుర్తించవచ్చు) వాపు వస్తుంది. గజ్జలలో వాపు వచ్చి జ్వరం వస్తే దాన్ని ఫైలేరియాకు ఒక కొండగుర్తులా భావించవచ్చు. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా ఈ వాపు రావచ్చు. ఈ వాపును వైద్యపరిభాషలో లింఫో ఎడిమా అంటారు.

వెన్నుపూస జారిపోయే స్పాండిలోలిస్ధెసిస్

వెన్నుపాములో పూసలు జారిపోయే సమస్యనే స్పాండిలోలిస్థెసిస్ అంటారు. అంటే వెన్నుపాములో ఒకపూస మరొక పూసమీదకు జారిపోతుంది. ఇందులోనూ పూస ముందుకు జారడం, వెనుకకు జారడం రెండు రకాలుగా ఉంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు వెన్నుపూసమీద ఒత్తిడి పడుతుంది. దాంతో ఆ ప్రాంతంలో నొప్పి ప్రారంభమవుతుంది. ఒక్కోసారి ఈ పూసలు జారడం వల్ల వాటి కిందనున్న నరాలు కూడా ఒత్తుకుపోతాయి. ఈ సమస్యను ఆయుర్వేద వైద్యంలో శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.

రకాలు డిస్‌ప్లాస్టిక్, ఇస్థ్‌మిక్, డీజనరేటివ్, ట్రామాటిక్, పాథాలజిక్ ఇలా స్పాండిలోలిస్థెసిస్‌లో ప్రధానంగా ఐదురకాలున్నాయి. లక్షణాలు స్పాండిలోలిస్థెసిస్‌లో ప్రధానంగా కనిపించే లక్షణం నడుము భాగంలో నొప్పిరావడం. తొడ వెనుకభాగంలో పట్టేసినట్లు ఉండడం, కాలులో నొప్పి, తిమ్మిరి, బలహీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అరుదుగా వెన్నుపాములో నరాలు ఒత్తిడికి లోనవడం వల్ల కొన్నిసందర్భాల్లో మూత్రకోశంపై నియంత్రణ కోల్పోతారు. నడుము, వెన్నుపాముకి సంబంధించిన వ్యాయామలు చేయడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువవుతుంది.

వ్యాధి నిర్ధారణ

చాలా కేసుల్లో రోగిని మామూలుగా పరీక్షించి స్పాండిలోలిస్థెసిస్‌ను నిర్ధారించడం సాధ్యపడదు. వెన్నుపాములో నొప్పితోపాటు కాళ్లలోకూడా నొప్పి వస్తూ పోతుంటుందని కొందరు రోగులు డాక్టర్లకు చెబుతుంటారు. ఈ సమస్య కొన్ని సందర్భాల్లో కండరాల నొప్పులు లేదా కండరాలు బిగుసుకుపోవడానికి దారితీస్తుంది.

అయితే సాధారణ ఎక్స్‌రే ద్వారా స్పాండిలోలిస్థెసిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. వెన్నుపూస మరోవెన్నుపూస మీదకు జారిందా, జారితే ఏ స్థాయిలో జారింది అనేదాని ఆధారంగా స్పాండిలోలిస్థెసిస్ ఏ గ్రేడ్‌లో ఉన్నది ఎక్స్‌రే ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. ఏసీటీ లేదా ఎమ్ఆర్ఐ స్కాన్ కూడా ఈ సమస్యను గుర్తించడానికి తోడ్పడతాయి.

చికిత్స

నొప్పి నివారణకు ఆయుర్వేద మందులిస్తూనే హెర్బల్ మసాజ్‌తో ఈ సమస్యను పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావచ్చు.

హైపోథైరాయిడిజం

శరీరంలోని ప్రధాన జీవక్రియలన్నిటినీ నియంత్రించే ఒక కేంద్రబిందువు థైరాయిడ్ గ్రంధి. ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది. జీవక్రియలకు అవసరమైన హార్మోన్లన్నీ ఈ గ్రంధిలోంచే ఉత్పత్తి అవుతాయి.

ఈ హార్మోన్లు రక్తంలో కలిసి శరీరమంతా తమ విధులు నిర్వహిస్తూ ఉంటాయి. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలలో ఈ హార్మోన్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఇక గుండె, జీర్ణవ్యవస్థ, విసర్జన లాంటి జీవక్రియలన్నిటినీ ఈ హార్మోన్లు క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరంలో ఈ హార్మోన్ల పరిమాణం తగ్గిపోయినప్పుడు జీవక్రియల వేగం కూడా త గ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడాన్ని హైపోథైరాయిడిజం అంటారు.

ఒకవేళ ఈ హర్మోన్ల పరిమాణం పెరిగిపోతే జీవక్రియల వేగం కూడా పెరిగిపోతుంది. ఇలా పెరగడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని దెబ్బ తీసే ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఉత్పన్నం కావడమే ఈ హార్మోన్ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం.హైపోథైరాయిడిజం

నిజానికి హర్మోన్లు తగ్గిపోవడమే ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య. పురుషుల్లో కన్నా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యలో థైరాయిడ్ గ్రంధికి విరుద్ధంగా శరీరంలో కొన్ని యాంటీబాడీస్ పెరుగుతాయి. ఫలితంగా గ్రంధి క్రమంగా క్షీణిస్తూ వెళుతుంది.

ఆ క్రమంలో శరీర క్రియలన్నీ తమ సహజ వేగాన్ని కోల్పోతాయి. అయినా చాలా కాలం దాకా ఈ వ్యాధి లక్షణాలే వీ స్పష్టంగా కనిపించవు. ఒక్కోసారి నెలలు, ఏళ్లు గడిచినా వ్యాధిగ్రస్తులు తమ సమస్యను గుర్తించలేరు.

ఎలా తెలుస్తుంది ?

ఊ తొందరగా అలసిపోవడం, కాళ్లూ చేతుల్లో నొప్పులు, మలబద్ధకం, శరీరం బరువు పెరిగిపోవడం, వాతావరణం ఏకాస్త చల్లగా ఉన్నా విపరీతంగా వణికిపోవడం, ముఖం పాదాల్లో వాపు రావడం, పగటివేళ ఎక్కువగా నిద్ర రావడం వంటి లక్షణాలు కనినిస్తాయి. వీటితో పాటు చర్మం పాలిపోవడం, జుత్తు రాలిపోవడం వంటివి కూడా ఉంటాయి. మహిళల్లో ఈ హార్మోన్ లోపాలు ఉంటే రుతుపరమైన సమస్యలు తలెత్తుతాయి.

  • థైరాయిడ్ సమస్య ఉన్న స్త్రీలు గర్భం ధరించినప్పుడు వీరి హార్మోన్లను సాధారణ స్థాయిలో ఉంచడానికి మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. లేదంటే తల్లిలోని ఈ లోపం గర్భంలోని శిశువు ఎదుగుదలను దెబ్బ తీస్తుంది. హార్మోన్లు తక్కువగా ఉంటే అసలు గర్భమే రాకుండా పోవచ్చు.
  • ఎదిగే పిల్లల్లో హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే వారి శారీరక మానసిక వృద్ధి కుంటుపడుతుంది.
  • థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇది అధికరక్తపోటుకు కొలెస్ట్రాల్ పెరగడానికీ దారి తీయవచ్చు. పైగా గుండె చుట్టూ నీరు చేరి కొన్ని గుండె జబ్బులకు కూడా కార ణం కావచ్చు.
  • హార్మోన్లు తక్కువగా ఉన్న వారిలో ఆకలి మామూలుగానే ఉంటుంది. కానీ, తీసుకున్న ఆహారంలోని క్యాలరీలు చాలా తక్కువగా ఖర్చు అవుతాయి. అందుకే వీరు ఎంత తక్కువగా తిన్నా వీరి శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది.

అందుకే ఈ సమస్య ఉన్న వారు చికిత్సల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు.

హైపర్ థైరాయిడిజం

హార్మోన్లు అవసరానికి మించి ఉత్పన్నం కావడం ఇందులోని సమస్య. కాకపోతే ఈ సమస్య చాలా కొద్ది మందిలోనే కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో గొంతు భాగంలో వాపు, కళ్లు ఉబ్బెత్తుగా బయటికి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వీరిలో జీవక్రియల వేగం బాగా పెరిగిపోతుంది. విపరీతంగా ఆకలిగా ఉండటంతో పాటు క్యాలరీలు చాలా వేగంగా ఖర్చు అవుతాయి. అందుకే ఎంత తిన్నా శరీరం బరువు తగ్గిపోతూనే ఉంటుంది. దీనికి తోడు కాళ్లూ చేతులు వణకడం, మాట తడబడటం, నాడీ వేగం పెరగడం, గుండె దడ మొదలవుతాయి. ఎముకల నుంచి క్యాల్షియం బయటికి వెళ్లిపోవడం ఇందులో మరో సమస్య.

దీనివల్ల ఎముకలు బాగా బలహీనపడతాయి. రక్తపోటు సాధారణంగా ఉంటుంది కానీ, భావోద్వేగాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కళ్లు మరింతగా పొడుచుకువస్తాయి. కళ్లల్లో తేమ తగ్గిపోయి ఎర్రబడతాయి.

తొలుత సాధారణ దృష్టి లోపాలు ఏర్పడినా ఒక దశలో చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో గుండె వేగం బాగా పెరగడం వల్ల గుండె దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే ఎండోక్రినాలజిస్టును సంప్రదించడం తప్పనిసరి. సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి వల్ల వచ్చే దుష్పరిణామాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

నరంపై ఒత్తిడే సయాటికా

సయాటికా.. శరీరంలో పొడవైన నరం ఇది. వెన్నుపాము దగ్గర ప్రారంభమై కాలు వేలు వరకు విస్తరించి ఉంటుంది. వెన్నుభాగంలో ఈ నరంపై ఒత్తిడి పడినపుడు తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. సయాటికా అని పిలిచే నరంపైన పడుతున్న ఒత్తిడి వల్ల కలిగే నొప్పి కాబట్టి దీనిని సయాటికా అంటారు.

కారణాలు

సయాటికా నరంపై డిస్క్ ఒత్తిడి పడినపుడు నొప్పి ప్రారంభమవుతుంది. ఒక్కోసారి తీవ్రమైన నొప్పి రావచ్చు. కండరాలు పట్టేయడం జరుగుతుంది. అంతర్గతంగా రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంది.

లక్షణాలు

సయాటికా నొప్పిని కలుగజేస్తుంది. వెన్ను నుంచి ప్రారంభమై కాలు వరకు నొప్పి విస్తరిస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు నడవటానికి కూడా వీలుపడదు. కూర్చున్నా, నిలుచుని ఉన్నా ఈ నొప్పి రావచ్చు. ఒక్కోసారి నిద్రలో కూడా మొదలవుతుంది. ఎక్కువ సేపు కూర్చుని లేచినపుడు సయాటికా నరం ఒత్తిడికి గురయి నొప్పి ప్రారంభమవుతుంది.

నిర్ధారణ

నొప్పి విస్తరిస్తున్న తీరు, లక్షణాల ఆధారంగా సయాటికాను గుర్తించవచ్చు. కొన్ని రకాల పరీక్షల వల్ల కూడా సయాటికాను గుర్తించే వీలుంది. ఎక్స్‌రే, డిజిటల్ ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ స్కాన్, ఎలక్ట్రోమయోగ్రామ్ పరీక్షల ద్వారా సయాటికాను తెలుసుకోవచ్చు.

చికిత్స

సయాటికాకు ఆయుర్వేదంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా నొప్పిని తగ్గించవచ్చు. ముఖ్యంగా తైలాలతో మర్దన చేయడం వల్ల సయాటికా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సతో పాటు తగిన వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

స్వైన్ ఫ్లూతో జాగ్రత్త

స్వైన్ ఫ్లూ వ్యాధి 'ఇన్‌ఫ్లూయెంజా H1N1' అనే వైరస్ వలన వస్తుంది. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి రాకుండా టీకాలు కనుగొన్నారు. కానీ ఈ టీకాలు మార్కెట్‌లోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. స్వైన్ ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం జన్యుపరమైన మార్పులు పొంది కొత్త జాతిగా రూపాంతరం చెందుతుంది. అందువల్ల స్వైన్‌ఫ్లూకి సంబంధించిన టీకాలు కూడా ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఇలా వ్యాపిస్తుంది..

దగ్గడం, తుమ్మడం వలన ఏర్పడే తుంపరలు గాలి ద్వారా వ్యాప్తి చెందడం వల్ల ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. లేదా ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కలిగిన తుంపరలు పడిన వస్తువులునుకాని, ఉపరితలములనుగాని చేతులతో ముట్టుకుని మళ్ళీ ఆ చేతులతో ముక్కు లేదా నోటిని రుద్దుకున్నప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.

ఒకసారి గాలిలో కలిసిన వైరస్ వాతావరణ పరిస్థితులను బట్టి వస్తువులు, ఇతర ఉపరితలముల మీద కొన్ని గంటల నుంచి ఒక రోజు వరకు బతుకుతుంది. ఈ వైరస్ మనుషులలోకి ప్రవేశించిన తర్వాత, వ్యాధి లక్షణాలు కనిపించడానికి ఒకరోజు ముందు నుంచి, వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత కూడా (పెద్దవాళ్లయితే ఏడు రోజుల వరకు, పిల్లలైతే పధ్నాలుగు రోజుల వరకు) మరొకరికి సోకే ప్రమాదం ఉంటుంది.

ఇవీ లక్షణాలు..

స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారిలో సాధారణంగా జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్ళునొప్పులు, అలసట, వాంతులు, విరేచనాలు, ఆయాసం, జలుబు, బద్ధకం, ఆకలి మందగించడం, దగ్గులో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఐదేళ్ళలోపు పిల్లలలో, 50 ఏళ్ళ కన్నా పైబడిన వారిలో, గర్భిణులలో, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిలో ప్రమాదకర పరిస్థితికి దారితీయవచ్చు.

పిల్లల్లో ఇవి గమనించాలి..

పిల్లలు ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా లేదా త్వరత్వరగా ఊపిరితీస్తూ ఆయాసపడుతున్నా, చర్మం లేదా గోళ్ళు నీలిరంగులోకి మారినా, ఇంతకుముందులా అన్నపానీయాలు సరిగా తీసుకోలేకపోయినా, వాంతులు తగ్గపోయినా లేదా వాటి తీవ్రత పెరిగినా, మత్తుగా ఉన్నా, ఇతరులతో సరిగా కలవలేకపోతున్నా, చిరాకు పడుతున్నా, మొదట ఫ్లూ లక్షణాలు కనిపించి, తగ్గి మళ్ళీ జ్వరం లేదా దగ్గు తీవ్రత పెరిగినా ఆలస్యం చేయకుండా అత్యవసర, ఉధృత చికిత్స (క్రిటికల్ కేర్) వైద్యులను సంప్రదించాలి.

పెద్దల్లో అయితే..

ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాస పడుతున్నా, పొట్టలోకాని, ఛాతీలోకాని నొక్కితే నొప్పిగా ఉన్నా, అనుకోకుండా లేదా ఒక్కసారిగా కళ్ళుతిరగడం మొదలైనా, మతిస్థిమితం లేకపోయినా(కన్ఫ్యూజన్) వాంతులు తగ్గకపోయినా లేదా తీవ్రత పెరిగినా, ఫ్లూ లక్షణాలు కనిపించి, తగ్గి మళ్ళీ జ్వరం లేదా దగ్గు తీవ్రత పెరిగినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి నరాల ద్వారా ఫ్లూయిడ్స్, ప్రాణవాయువు, అవసరమైతే కృత్రిమ శ్వాస, మందులు తదితర అత్యవసర చికిత్సలు చేయవలసి ఉంటుంది. జబ్బుకు సంబంధించిన ప్రత్యేక మందులు వ్యాధి లక్షణాలు కనబడిన 48 గంటలలోపు వాడడం మొదలుపెడితే ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. జబ్బు బాగా ముదిరితే ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న మందులు పనిచేసే అవకాశం చాలా తక్కువే. ఈ వ్యాధి లక్షణాలను, ఇతర పరిస్థితులను బట్టి ఎ, బి1, బి2, సి అనే కేటగిరీలుగా విభజించారు.

ఈ జాగ్రత్తలు ముఖ్యం..

ఈ వ్యాధి లక్షణాలు కనబడిన వారు ఇంట్లో ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకోవాలి. వైద్య సేవల కోసం తప్ప వారు ఆ గదిలోంచి బయటికి రాకూడదు. పెద్దలైతే రోగ లక్షణాలు తగ్గిన 7 రోజుల వరకు, పిల్లలైతే 14 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలి. రోజూ జ్వరం చెక్ చేసుకోవాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు, నోరు రెండింటినీ టిష్యూ పేపర్ లేదా చేతిగుడ్డుతో మూసుకోవాలి.

వాడిన టిష్యూ పేపర్లను ప్రత్యేక డస్ట్‌బిన్‌లో వేయాలి. రోగ లక్షణాలు ఉన్న వ్యక్తి అన్ని వేళలా ముఖానికి మాస్క్ ధరించాలి. ఈ మాస్క్‌ను ప్రతి ఆరుగంటలకు ఒకసారి మార్చుకోవాలి. మాస్క్‌ని తరచూ ముందు నుంచి ముట్టుకోకూడదు.

దీన్ని వెనకనుంచి మాత్రమే తీసివేయాలి. తీసేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి వాడిన మాస్క్‌ని మళ్ళీ వాడరాదు. మాస్క్ ధరించేటప్పుడు కూడా ముక్కు, నోటి దగ్గర ఎలాంటి ఖాళీ లేకుండా బిగించుకోవాలి. దగ్గినా, తుమ్మినా వెంటనే చేతులు కడుక్కోవాలి.

సబ్బునీళ్ళకు బదులుగా స్పిరిట్ వాడవచ్చు. స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలున్న వ్యక్తిని ఇంట్లో ఎవరైతే పర్యవేక్షిస్తుంటారో వారు కూడా తరచూ చేతులు కడుక్కోవాలి. వారూ ముక్కుకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వ్యాధి గ్రస్థుల దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులు 8 శాతం హైపోక్లోరైడ్ ద్రావణంలో గంటపాటు నానబెట్టి ఆ తరువాతే ఉతకడంగాని, కడగడంగాని చేయాలి.

వ్యాధిగ్రస్థులు ఉపయోగించిన దుస్తులుకాని, దుప్పట్లుకాని దగ్గరగా హత్తుకుని తీసుకెళ్ళకూడదు. వాటిని దేహానికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. వ్యాధిగ్రస్థులు ఉపయోగించిన వస్తువులు, ఇతర ఉపరితలములను యాంటీసెప్టిక్ లోషన్‌లో ముంచిన బట్టతో తుడవాలి. బాత్‌రూంలు రోజూ ఫినాయిల్‌తో క డగాలి. బహిరంగ ప్రదేశాలలో నల్లాలు, తలుపు గడియలు పట్టుకోకుండా జాగ్రత్త పడాలి. లేదా వెంటనే చేతులు కడుక్కోవాలి. స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్థులు మంచినీరు, పళ్ళరసాలు అధికంగా తీసుకోవాలి.

డిఫ్తీరియా

డిఫ్తీరియా ఒక ప్రమాదకరమైన అంటువ్యాధి. శరీరంలోని మ్యూకస్ పొరల మధ్య అసహజమైన మరో పొర కమ్ముకుపోవడం ఇందులో సమస్య. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన సమస్యలు కలుగచేస్తుంది. సాధారణంగాఈ జబ్బు రెండేళ్లకు పైబడి, పదేళ్లలోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

తలనొప్పి, జ్వరం ఉంటాయి. గొంతునొప్పితో పాటు గొంతులో బూడిద రంగులో ఒక పొర కమ్ముకుంటుంది. టాన్సిల్స్ పైన కూడా ఈ పొర కనిపిస్తుంది. మెడలోని లింఫ్‌నోడ్స్‌లో వాచిపోతాయి., నోటినుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఈ వ్యాధి మరీ చిన్న పిల్లలకు గానీ, పెద్ద వారికి గానీ వస్తే అది మరింత విషమంగా ఉంటుంది.

గొంతు వాపు కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ, నొప్పి అంతగా ఉండదు. విపరీతమైన నీరసం, జ్వరంతో పాటు ఎప్పుడూ మత్తుగా ఉంటుంది. గొంతులో వార్నిష్ పూసినట్లుగా ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. గొంతులో చురుకులు పోట్లు ఉంటాయి. చల్లటి నీటితో ఉపశమనంగా ఉంటుంది. చిన్న నాలిక ఉబ్బిపోయి కిందికి వేళ్లాడుతూ ఉంటుంది. అందుకే మింగడం కష్టంగా ఉంటుంది. వీరికి ఎపిస్ మెలిఫికా-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున 7 డోసులు వాడవచ్చు.

ముక్కునుండి గానీ, నోటినుండి కానీ వచ్చే స్రావాలన్నీ జిగురుగా తీగలా సాగుతూ ఉంటాయి. వ్యాధి గొంతు నుంచి పైకి పాకుతూ ముక్కును, స్వరపేటికను దెబ్బ తీస్తుంది. గొంతులో పెరిగిన పొర పసుపు రంగులో ఉంటుంది. ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల పై పెదవి మీద పుండు కూడా ఏర్పడవచ్చు. వీరికి కాలీబైక్రోమిక ం-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున 5 సార్లు వేసుకోవచ్చు.

కొందరిలో ఈ జబ్బు ఎడమ పక్కన మొదలై కుడి పక్కకు పాకుతుంది. వేడి ఆహారం, నిద్ర జబ్బును ఎక్కువ చేస్తాయి. గొంతులో నొప్పి చెవిలోకి వెళుతున్నట్లు అనిపిస్తుంది. నాడీ తక్కువగా ఉంటుంది. కాళ్లూ చేతులూ చల్లగా ఉంటాయి. నాలుకు ముందుకు చాచితే వణుకుతూ ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి ఆరుగంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు ఇస్తే ఉపశమనం లభిస్తుంది.

గమనిక : ఇక్కడ సూచించిన మందులన్నీ ప్రథమ చికిత్సకు ఉద్దేశించినవి. ఒక వేళ ఈ మందులతో తగ్గకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

అందరిని బాధించే హర్మోన్ సమస్యలు

శరీరంలోని కొన్ని గ్రంథులు రక్తంలోకి నేరుగా కొన్ని రసాయన ద్రవపదార్థాలను విడుదల చేస్తాయి. ఈ గ్రంథులను 'ఎండోక్రైన్ గ్రం«థులు' అంటారు. ఇవి విడుదల చేసే ద్రవ పదార్థాలను 'హర్మోన్స్' అని అంటారు.

హర్మోన్ విధులు...

  • హర్మోన్లు మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి.
  • శరీరంలో జరిగే జీవ ప్రక్రియకు, నియంత్రణకు హర్మోనులే ఆధారం.
  • స్త్రీ , పురుషుల్లో వయసుకు తగ్గ మార్పులకు కారణం హార్మోన్లే.
  • శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ పెరగడానికి ఇన్సులిన్ అనే హర్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
  • మానవుల సంతానోత్పత్తికి హర్మోన్స్ కీలకపాత్రను పోషిస్తాయి.
  • శరీరంలో జరిగే ముఖ్య విధులైన సెక్స్, ఆలోచన, ఆవేశాలలో హర్మోన్లది ప్రధాన పాత్ర.

సమస్యలకు కారణాలు...

  • వంశపారంపర్య కారణాలు
  • శరీరంలోని రక్షణ వ్యవస్థలో లోపాలు
  • మానసిక ఒత్తిడి
  • ఆహారం, పోషక పదార్థాల లోపాలు.
  • అధిక బరువు.
  • కొన్ని రకాలైన మందులు.
  • హర్మోన్ల సమస్య వల్ల వచ్చే వ్యాధుల ముఖ్య లక్షణాలు...
  • బరువు పెరగడం లేదా తగ్గడం
  • శరీరంలో చురుకుదనం తగ్గడం, అతి నీరసం.
  • అతి దాహం, మూత్రం.
  • బహిష్టులు సరిగా రాకపోవడం, ఎక్కువ రోజులు ఉండి బాధపెట్టడం. వేడిని లేక చలిని తట్టుకోలేకపోవడం.
  • వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం.
  • అతిగా బరువు పెరగడం, తగ్గడం.
  • ఆడవాళ్లలో అవాంఛిత రోమాలు
  • సంతాన సాఫల్య సమస్యలు
  • చర్మ సంబంధ వ్యాధులు, జుట్టు రాలడం.
  • సెక్స్ సంబంధ సమస్యలు.

హర్మోన్ల లోపాలు - వ్యాధులు :

హర్మోన్లు మన శరీరంలో మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. చిన్న పిల్లల్లో థైరాయిడ్ లోపం వల్ల వచ్చే శారీరక, మానసిక ఎదుగుదల సమస్య అయిన క్రెటినిజమ్ దీనికి ఉదాహరణ. పిల్లల్లో మతిమరుపు, బరువు పెరగడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనపడితే అవి థైరాయిడ్ లోపం వల్ల వచ్చే హైపోథైరాయిడిజం అని చెప్పుకోవచ్చు.

ఆడపిల్లల్లో యుక్త వయస్సులో నెలసరి సమస్యలు, మొటిమలు రావడం, శారీరక ఎదుగుదల లేకపోవడం, అతి బరువు, అవాంఛిత రోమాలు రావడం వంటి లక్షణాలు హర్మోన్ల లోపం వల్ల వచ్చేవే.

కొంతమంది పిల్లల్లో ఎత్తు పెరగడం చాలా నిదానంగా ఉంటుంది. దీనిని మనం ద్వార్ఫిసమ్ అని అంటారు. ఇది గ్రోత్ హర్మోన్ తక్కువ అవడం వల్ల వచ్చే సమస్య. మరి కొంతమంది పిల్లల్లో పొడవు వయసు కంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీనిని పొడగరితనం అని అంటాం. ఇది గ్రోత్ హర్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే సమస్య.

పిల్లల్లో బరువు తగ్గడం, అతి మూత్రం, అతి ఆకలిగా ఉన్నప్పుడు చిన్న పిల్లల్లో వచ్చే మధుమేహంగా అనుమానించి పరీక్షలు చేసి నిర్థారించాలి.

మగపిల్లల్లో యుక్తవయసులో వచ్చే మొటిమలు, ఛాతి ఎక్కువగా ఉండటం, జట్టు రాలడం, బట్టతల సమస్య, మీసాలు, గడ్డాలు రావడంలో లోపం వంటివన్నీ హర్మోన్‌ల వల్ల వచ్చే సమస్యలే.

వివాహం తర్వాత ఆడవాళ్లు ఎదుర్కొనే సంతానసాఫల్య సమస్యలు, బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, అండాశయంలో తిత్తులు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, కుషింగ్స్ వ్యాధిలు కూడా హర్మోన్ లోపాల వల్ల వచ్చేవే.

మగవాళ్లలో వచ్చే సంతాన సాఫల్య సమస్యలు (వీర్య కణాలు తక్కువగా ఉండడం), సెక్స్ సమస్యలు, మధుమేహం హర్మోన్ తేడాల వల్ల వచ్చే సమస్యలే.

40 నుండి 50 సంవత్సరాల మధ్య ఆడవారిలో వచ్చే మధుమేహం, మెనోపాజ్ సమస్యలు, వేడిని తట్టుకోలేకపోవడం, వేడి ఆవిర్లు, చికాకు, దేనిమీద ధ్యాసలేకపోవడం, ఎముకలు అరగడం మొదలైన సమస్యలు కూడా హర్మోన్స్‌కు సంబంధించినవే. ఈ విధంగా హర్మోన్‌లు పుట్టినప్పటి నుంచి చివరి వరకు మానవ శరీరంలో అమోఘమైన పాత్రను పోషిస్తాయి.

ఊపిరాడనివ్వని బ్రాంకైటిస్‌

దీర్ఘకాలంగా శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారి ఇబ్బందులు మృగశిరం ప్రవేశించగానే మరింత ఎక్కువ అవుతాయి. ధూమపానం వలన వచ్చే బ్రాంకై టిస్‌, బ్రాంకిఎక్టేసిస్‌, అలెర్జీవ్యాధులు మొదలవటం, లేదా ఇంతకు ముందే ఉన్నట్లయితే అవి తీవ్రరూపం దాల్చడం జరుగుతుంది.కొన్ని సంవత్సరాలుగా ఉబ్బసవ్యాధి శీతాకాలంలోనే ఉన్నట్లుగా గుర్తించిన వారు శీతాకాలం మొదలవుతుందన్న రెండు, మూడు వారాల ముందునుంచే ప్రివెంటివ్‌ మందులు వాడాలి.

దీర్ఘకాలంగా శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారి ఇబ్బందులు వర్షాకాలం, చలికాలం మరింత ఎక్కువ అవుతాయి. ధూమపానం వలన వచ్చే బ్రాంకైటిస్‌, బ్రాంకిఎక్టేసిస్‌, అలెర్జీవ్యాధులు మొదలవటం, లేదా ఇంతకుముందే ఉన్నట్లయితే అవి తీవ్రరూపం దాల్చడం జరుగుతుంది.చల్లని వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రత వైరస్‌ వంటి సూక్ష్మక్రిములు పెరగడానికి అనువుగా ఉంటుంది.అందువలన వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇవి గాలిలో కంటికి కనిపించకుండా ఉండటమే కాకుండ, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలి ద్వారా చేరుకుంటాయి. వీటిలో రైనోవైరస్‌ , రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్‌, అడినోవైరస్‌, ఇన్‌ప్లూఎంజా వైరస్‌లు ప్రధానమైనవి. ముక్కు నోటి ద్వారా శ్వాసతీసుకున్నప్పుడు ఇవి శ్వాసనాళాలను చేరతాయి.

జలుబు, దగ్గు, జ్వరం, వళ్లు నోప్పులు, తలపోటు మొదలైన లక్షణాలను కలుగచేస్తాయి. మిగతా వైరస్‌ల కంటే ఇన్‌ప్లూ ఎంజావైరస్‌లు కలిగించే జబ్బు లు తీవ్రంగా ఉంటాయి. శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని ఈ వైరస్‌లు తగ్గిం చటం మూలాన పలురకాల బాక్టీరియాలు చేరి సైనుసైటిస్‌, బ్రాంకైటిస్‌, ఫారిం జైటిస్‌, టాన్సిలైటిస్‌, న్యుమోనియా వంటి వ్యాధులు రావడానికి కారణమవు తాయి.అడపాదడపా ఇలాంటి జబ్బులు వర్షంలో తడవటం మూలానో, చల్లగాలికి తిరగటం మూలానో ఎక్కువ అవుతాయి. చలిగాలి ఉంటే అయిదు, ఆరుమాసా లు ఈ వ్యాధులు తరచుగా వస్తుంటాయి. అరోగ్యవంతుల్లో కూడా కనీసం మూడు, నాలుగు సార్లు జలుబు రావడం సహజం. అయితే కొందరిలో వంట్లో నలతగా ఉండి ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోతే, మరికొందరిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి ఒకటి, రెండు వారాలు తగ్గకుండా ఉంటాయి.

క్రానిక్‌ బ్రాంకైటిస్‌ :

ధూమపానం చేసేవారికి కోద్దో గొప్పో దగ్గు ఉంటుంది. పొడిదగ్గు వారి జీవితంలో ఒక భాగంగా ఉండిపోతుంది. దగ్గు లేదంటూనే దగ్గడం వారికి పరి పాటి. దీనిని స్మోకర్స్‌ కాఫ్‌ అంటారు. వరుసగా మూడు నెలల పాటు కనీసం రెండు సంవత్సరాలుగా ఉన్నవారికి క్రానిక్‌ బ్రాంకైటిస్‌ ఉన్నట్లుగా వ్యవహ రిస్తారు. శీతాకాలంలో సాధారణంగా ఉండే ‘స్మోకర్స్‌ కాఫ్‌’ ఉధృతమవడం, కళ్ళె పడటం, అయాసం- పిల్లికూత రావడం జరుగుతుంది. ఒక్కోసారి శరీ రంలో తరచుగా వస్తుంటుంది. మిగతా కాలాల కంటే శీతాకాలంలో ఇవి ఎక్కువగా కనపడతాయి. వ్యాధి కొద్దిగా ముదురుతున్నప్పుడే యాంటి బయా టిక్స్‌, బ్రాంకో డైలేటర్లను వాడాలి.

ఏమరపాటుగా ఉన్నట్లయితే వ్యాధి తీవ్రంగా మారడమే కాకుండా హాస్పిట ల్‌లో చేరాల్సిన అవసరం కూడా రావచ్చు. కొంతమందికి కృత్రిమ శ్వాస అవసరమవుతుంది. న్యుమోనియా రాకుండా న్యుమోకోకల్‌ వ్యాక్సిన్‌లకు క్రాని క్‌ బ్రాంకైటిస్‌ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి. ఇది కనీసం 70-80 శాతం వరకు న్యుమోనియా ఎటాక్‌ రాకుండా రక్షిస్తుంది.చిన్నప్పుడు వచ్చే కోరింత దగ్గు, న్యుమోనియా వలన శ్వాసనాళాలు దెబ్బ తింటాయి. శ్వాసనాళాలు సాధరణంగా ఉండే స్థాయి కంటే వెడల్పుగా ఉండటాన్ని బ్రాంకిఎక్టేసిస్‌ అంటారు. లోగడ క్షయవ్యాధి వచ్చిన వారిలో కూడా శ్వాసనాళాలు ఇలా ఉంటాయి. బాక్టీరియాలు ఇలాంటి చెడు భాగాల్లో ఉండ డమే కాకుండా అప్పుడప్పుడు దగ్గు, కఫం, దగ్గులో రక్తం వంటి వ్యాధి లక్షణాలను కూడా కలిగిస్తాయి. ఇవి మిగతా కాలాలకంటే శీతాకాలంలో తరచుగా కనపడుతుంటాయి. జలుబు తరువాత వ్యాధి ఎక్కువ కావడం సాధారణంగా కనపడుతుంది. జలుబు రాకుండా, లేదా కొద్దిగా ఉన్నప్పుడే సరైనా మందులు వాడి ఈ లక్షణా లను అరికట్టవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

జలుబు కొద్దిగా ఉన్నప్పుడే, రాను రాను తీవ్రంగా మారే ప్రమాదముందని గుర్తించి వెంటనే జలుబుతగ్గించడానికి అవసరమైన యాంటి హిస్టమిస్‌లను, జ్వరం రాకుండా యాంటిపైరటిక్‌ను, ముక్కునుంచి కారుతున్న నీరు, చీముగా మరుతున్నప్పుడు యాంటిబయాటిక్స్‌ను వాడాలి.జలుబు రాకుండా ఉండాలంటే చల్లని నీటితో తలస్నానం చేయకూదడు. తలస్నానం చేసిన వెంట నే అరబెట్టుకోవాలి. శీతా కాలంలో ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌ తాగినపుడు గొంతు పట్టేసి ఫేరింజై టిస్‌, టాన్సిలైటిస్‌ వచ్చే అవకాశం ఉంది.

హెపటైటిస్‌ వ్యాధి - చికిత్స

పంచవ్యాప్తంగా హెపటైటిస్‌ ‘బి’ లేక ‘సి’ లతో బాధపడుతున్న వారు అయిదువందల మిలియన్ల దాకా ఉన్నారు. హెపటైటిస్‌ వ్యాక్సినేషన్‌ తీసుకోకుండా అలా విడిచి పెడితే లివర్‌ క్యాన్సర్స్‌ రావచ్చు, సిర్రోసిస్‌ రావచ్చు. హెపటైటిస్‌ బి లేక సి తో బాధపడుతూ మరణిస్తున్న వారు ప్రతీ సంవత్సరం 105 మిలియన్ల దాకా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హెపటైటిస్‌ రాకుండా జాగ్రత్త పడాలి. ఒక వేళ హెపటైటిస్‌ వస్తే లక్షణాల్ని బట్టి ప్రారంభదశలో కనుక్కొని సకాలంలో సరైన చికిత్స పొంది నివారించుకోవాలి.

హెపటైటిస్‌ - బి ని ‘సీరం హెపటైటిస్‌’ అని కూడా అంటారు. చేతులు పట్టుకోవడం వల్ల, వంటపాత్రల ద్వారా, చనుబాలద్వారా, కౌగిలించు కోవడం ద్వారా ఈ వైరస్‌ వ్యాపించదు. ఇన్‌ఫెక్షన్‌తో కూడుకున్న రక్తం, శరీరం ద్రావకాల ద్వారానే ఇది ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ జబ్బులతో లివర్‌ ఇన్‌ ఫ్లమేషన్‌ కలిగి వాంతులు, జాండీస్‌ రావచ్చు, అతి అరుదుగా మరణం సంభ వించవచ్చు. హెపటైటిస్‌ బి వల్ల లివర్‌ క్యాన్సర్‌, లివర్‌ సిర్రోసిస్‌ రావచ్చు. కీమోథెరపీలాంటి చికిత్సల వల్ల ఇది తగ్గదు. ముందే వ్యాక్సినేషన్‌ తీసుకోవ డంతో ఈ హెపటైటిస్‌-బి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. రక్తపరీక్షల ద్వారా హెపటైటిస్‌-బి ఇన్‌ఫెక్షన్‌ తెలుసుకోవచ్చు.

ఎక్యూట్‌ హెపటైటిస్‌ -బి కి ప్రత్యేక చికిత్స ఏమీ అవసరం లేదు. ప్రారంభంలో యాంటీవైరల్‌ చికిత్స సరి పోతుంది. మనకు లభించే మందులేవి ఈ ఇన్‌ఫెక్షన్‌ తగ్గించలేవు. కానీ శరీరం లోపల వైరస్‌ పెరగకుండా కాపాడి లివర్‌ డామేజ్‌ జరగకుండా చూసు కోవచ్చు. హెపటైటిస్‌ బి ఉన్న వాళ్ళకి పుట్టే పిల్లలలోని హెపటైటిస్‌-బి వైరస్‌ని యాంటీబాడీస్‌తో తగ్గించవచ్చు. పుట్టిన 12 గంటల్లోపు ఈ వ్యాక్సినేషన్‌ ఇస్తారు. దాంతో హెపటైటిస్‌-బి ద్వారా వచ్చే రిస్క్‌ 90 శాతం వరకు తగ్గిపోతుంది. తల్లి బిడ్డకు పాలివ్వవచ్చు.హెపటైటిస్‌-సి ఇన్‌ఫెక్షన్‌ తో లివర్‌ దెబ్బ తింటుంది. ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్లు లక్షణాలు కనిపించవు. రక్తం నుంచి రక్తం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది.

జలుబు

వివిధ రకాల వైరస్‌ల ప్రభావం వల్ల జలుబు వస్తుంది. జలుబు రోజువారీ దైనందిన జీవనానికి ఆటంకంగా మారుతుంది. పిల్లలు స్కూలుకు వెళ్లకపోవటానికి, పెద్దలు వారి పనులకు వెళ్లక పోవటానికి జలుబు మొట్టమొదటి కారణమవుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఎక్కువసార్లు వచ్చేఅతిసాధారణమైన జలుబును అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ శ్రీకర్ మను.

ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే జలుబు అంటువ్యాధి. శరీరంలోరాజీపడుతున్న రోగనిరోధక వ్యవస్థకు తొలి సంకేతం ఈ జలుబు. 200 రకాలకు పైగా వైరస్‌ల ప్రభావం వల్ల వచ్చే జలుబుతో శ్వాసకోశ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడతాయి. ముక్కు, సైనస్, టాన్సిల్స్, గొంతులో జలుబు లక్షణాలుంటాయి. వైరస్‌లు కలుషితమైన గాలి, నీటి ద్వారా వ్యాప్తి చెందటం సాధారణం. ఎలాంటి కారణం లేకుండానే జలుబు రావటం పలు రకాల సందేహాలకు దారితీస్తుంది. జలుబు అనారోగ్యం ఆరంభానికి సూచికలాంటిది.

లక్షణాలు :

వైరస్‌ల ప్రభావం వల్ల రెండు నుంచి మూడు రోజుల్లోనే జలుబు వస్తుంది. తుమ్ములు రావటం, ముక్కు దిబ్బడ, ముక్కు మూసుకుపోవటం, ముక్కు కారటం, గొంతునొప్పి, గొంతు బొంగురు పోవటం, దగ్గు, కళ్లలో నీరు కారటం, జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, సైనస్ ఇన్‌ఫెక్షన్, అలసట, ఆకలి మందగించటం లాంటివి జలుబు లక్షణాలు. జలుబు మొదట ముక్కు నుంచి నీళ్లలా కనిపించి, తర్వాత కఫంలోకి మారుతుంది. నాలుగు నుంచి 14 రోజుల వ్యవధిలోగా ఎలాంటి చికిత్స తీసుకోకుండానే సహజంగా తగ్గుముఖం పడుతుంది.

అసలేం జరుగుతుంది? జలుబుకు కారణమయ్యే వైరస్‌లు శ్వాసకోశ కణాలపై ప్రభావం చూపడం వల్ల తుమ్ములు, దగ్గు వంటి సహజ శరీర రక్షణ ప్రతిచర్యలు ఆరంభమవుతాయి. అయితే రోగిని కాపాడే ప్రతి చర్యే మిగిలిన వారికి ఇన్‌ఫెక్షన్‌ను అంటించే ఘటనగా పరిగణిస్తుంది. ఈ వైరస్‌లు శరీర రోగనిరోధక కణాలను ప్రమాదకర స్థాయిలో నాశనం చేస్తున్నపుడు రోగ నిరోధక వ్యవస్థ వీటిని ప్రతిచర్య ద్వారా శరీరం నుంచి బయటకు పంపుతుంది. ఈ చర్యల పర్యవసానంగా రకరకాల లక్షణాలు చూస్తుంటాం.

దుష్ప్రభావాలు

జలుబు నివారణకు చికిత్సతోపాటు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉపేక్షిస్తే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఆస్తమా, అలర్జీ, డయాబెటీస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో వివిధ రకాల దుష్ప్రభావాలు ఏర్పడటానికి అవకాశముంది. ఈ జలుబు సైనస్ ఇన్‌ఫెక్షన్‌లు, ఆయాసం, చెవి ఇన్‌ఫెక్షన్‌లు, బ్రాంకైటీస్, టాన్సిల్స్‌కు కూడా కారణమవుతుంది. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదురుకావచ్చు.

వైద్యుల సలహా అవసరం :

జలుబే కదా అని ఉపేక్షించటం లేదా తెలిసిన సొంత వైద్యం చేయటం అన్ని సమయాల్లో మంచిది కాదు. లక్షణాల ద్వారా నిర్ధారణ చేయటంతోపాటు అవసరాన్ని బట్టి రక్త పరీక్షలు, ఎక్స్‌రే వంటివి సమస్య అవగాహన కోసం తీయాల్సిన అవసరం పడవచ్చు. ఆయాసం వంటి ఊపిరితిత్తుల సమస్యలు మొదలవటం, 7 నుంచి 20 రోజుల కంటే ఎక్కువ సమయం జలుబు కొనసాగటం, సైనస్, చెవి ఇన్‌ఫెక్షన్‌ల వంటి దుష్ప్రభావాలు మొదలవటం వంటివి జరిగినపుడు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో సంపూర్ణ చికిత్స తీసుకోవాలి.

జాగ్రత్తలు :

జలుబు వచ్చిన వారు చేతులు శుభ్రంగా కడుక్కొని, నాణ్యమైన మందులు వాడాలి. సొంత వైద్యం చేయటం మానుకోవాలి. జలుబు సోకిన వారి వస్తువులను మిగిలిన వారు వాడకూడదు. శిశువులకు తల్లి పాలు ఇవ్వడం ద్వారా జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి పలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాయామం చేయటంతోపాటు సరైనంత నిద్ర పోవటం చాలా ముఖ్యం. సమతుల్యమైన పౌష్ఠికాహారం తీసుకోవాలి. ఇంట్లో తగినంత గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి.

హోమియో వైద్యం :

వివిధ కారణాల వల్ల వచ్చే జలుబు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌లకు హోమియో వైద్యం శాశ్వతమైన సమాధానాన్ని ఇస్తుంది. రోగాలకు గురయ్యే వారిలో జరిగిన సామూహిక మార్పులు, కారణాలను పరిశీలించటం ద్వారా చికిత్స చేస్తారు. దీనివల్ల హోమియో మందులు జలుబు ఇన్‌ఫెక్షన్‌లను సమూలంగా నిర్మూలించగలుగుతున్నాయి. అధిక ఆందోళన, ఒత్తిడి శరీరం తట్టుకోలేనంత ఉన్పప్పుడు రకరకాల రోగాలకు దారితీస్తుందని అధ్యయనంలో తేలింది. సరైన విషయపరిజ్ఞానంతో, జన్యుపరమైన మందులతో శాశ్వత చికిత్సతోపాటు నివారణ కూడా సాధ్యం హోమియో మందులకే సొంతం.

మలబద్దకం - పైల్స్(హెమరాయిడ్స్) - ట్రావెలర్స్ డయేరియా

కొందరిలో అన్నం తినకపోతే కడుపులో మంట, తింటే అజీర్తి వేధిస్తుంటాయి. మరికొందరిలో మలబద్దకం సమస్య ఏళ్ల పర్యంతం ఉంటుంది. ఇవి మొదట్లో చిన్న సమస్యలుగానే అనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారతాయి. అయితే వీటిని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చంటున్నారు హోమియో వైద్యులు డా. కె. మురళి అంకిరెడ్డి.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జీర్ణ సంబంధ సమస్యలలో సాధారణంగా కనిపించే లక్షణాలు అజీర్తి, గ్యాస్, తేన్పులు, కడుపు నొప్పి, కడుపులో మంట, మలబద్దకం, విరేచనాలు. ఒక్కోసారి మలంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్దకం, బరువు తగ్గటం, ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి పనితీరు వల్ల కూడా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరిలో రోజువారి విరేచనాలు సాఫీగా జరగవు. దీనినే మలబద్దకం అంటారు. విరేచనం అయిన తరువాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం మలబద్దకం లక్షణమే.

కారణాలు :

పీచుపదార్థాలు తీసుకోకపోవడం. సరిపడా నీరు తాగకపోవడం. కొన్ని రకాల మందులు వాడటం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం. ఆకుకూరలు, పండ్లు తీసుకోకపోవడం. తగిన శారీరక వ్యాయామం కొరవడటం.

నివారణా మార్గాలు :

ప్రతిరోజు మూడు లీటర్ల నీటిని తాగడం. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మొలకెత్తిన ధాన్యాలు, క్యారెట్, కీరదోస,క్యాప్సికం, ముల్లంగి వంటి కూరగాయలు తీసుకోవడం చేయాలి. ఆయా సీజన్‌లలో దొరికే పండ్లను తప్పకుండా తినాలి. ముడి బియ్యం(దంపుడు బియ్యం) తీసుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. సమయానికి భోజనం, నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. యోగా, మెడిటేషన్ వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పైల్స్(హెమరాయిడ్స్) :

మలాశయ ద్వారంలో వాచి ఉబ్బిన రక్తనాళాలు(సిరలు). ఇందులో ఇంటర్నల్ హెమరాయిడ్స్, ప్రొలాప్స్‌డ్ హెమరాయిడ్స్, ఎక్స్‌టర్నల్ హెమరాయిడ్స్ అని మూడు రకాలుంటాయి. మల విసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి కలుగజేసినపుడు సిరలలో రక్తసరఫరా పెరిగి ఉబ్బుతాయి. ఆ ఒత్తిడి మళ్లీ మళ్లీ పడినపుడు వాచిపోతాయి. సిరల నుంచి రక్తసరఫరా సరిగ్గా జరగనప్పుడు ఇవి విరేచనం సాఫీగా జరగకుండా అడ్డుపడతాయి. ఒత్తిడి కలగజేసినా, విరేచనాలు గట్టిగా అయినా ఒరుసుకుపోయి రక్తస్రావం జరుగుతుంది.

కారణాలు :

అధిక బరువుతో బాధపడుతున్న వారిలో పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి వచ్చే అవకాశం. ఆల్కహాల్, టీ, సిగరెట్, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్ రావడానికి అవకాశం ఉంటుంది.

నివారణ

పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మల విసర్జన కోసం ఒత్తిడి పెట్టకూడదు. విరేచనాలు వస్తున్నట్లయితే ఆపకుండా వెంటనే వెళ్లాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫాస్ట్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు.

ట్రావెలర్స్ డయేరియా

ప్రయాణం చేసే వారిలో భోజనంలో, తాగే నీటిలో మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కాబట్టి ప్రయాణంలో ఉన్నప్పుడు కుళాయి నీరుతాగకుండా ఉండటం, ఐస్ ఉపయోగించిన నీరు తీసుకోకుండా ఉండటం చేయాలి. ఐస్ వేసిన చెరకు రసం, జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. పాలు, పాల సంబంధ పదార్థాలు తీసుకోకూడదు. శుభ్రంగా కడగని పండ్లు తినకూడదు. మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. రోడ్డుపైన, ఫుట్‌పాత్‌పైన అమ్మే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. మంచి కంపెనీ ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ట్రావెలర్స్ డయేరియా సమస్య తలెత్తకుండా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలను రక్త పరీక్షలు, మల పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారించుకోవచ్చు.

హోమియో వైద్యం

హోమియో వైద్యంలో రోగి జీవనవిధానం, శారీరక తత్వమును బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. పైల్స్ సమస్యకు నక్స్‌వామికా, అస్క్‌లస్‌హిప్, రెటానియా, కోలిన్‌సోనియ, గ్యాస్ సమస్యకు కార్బోవెజ్, చైన, లైకోపోడియం, మలబద్దకం సమస్యకు నక్స్‌వామికా, బైవోనియ వంటి మందులు బాగా పనిచేస్తాయి. ముందుగా సమస్యను నిర్ధారించుకుని వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

హెపటైటిస్-బి : నివారణ సులువు, విస్మరిస్తే స్రమాదం

చిన్న జీవి లాంటి పదార్థం... కానీ కాలేయాన్నే మట్టుబెట్టగలదు. కొంచెం ఏమరుపాటుగా ఉంటే ఇట్టే దాడి చేస్తుంది. విచ్చలవిడిగా శృంగారానికై పరిగెత్తితే మృత్యువునే దగ్గరికి తెస్తుంది. అదే.. హెపటైటిస్ వైరస్. ప్రస్తుతం మనదేశంలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవాళ్లున్నారని అంచనా. హెపటైటిస్-బి వాక్సిన్ కనుక్కున్న తరువాత కొంతవరకు దీని ఉద్ధృతి తగ్గినప్పటికీ హెపటైటిస్ పట్ల అవగాహన మరింత పెరగాలంటున్నారు డాక్టర్ వంశీధర్.

హెపటైటిస్-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. పచ్చకామెర్లతో మొదలైన వ్యాధి కాలేయం వాపునకు దారితీస్తుంది. హెపటైటిస్-బి వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల కలిగే ఈ వ్యాధి ముదిరితే లివర్ సిర్రోసిస్, లేదా లివర్ క్యాన్సర్ లాంటి ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తొలిదశలోనే గుర్తిస్తే ప్రమాదాన్ని అధిగమించవచ్చు. ముందుగానే నివారణ చర్యలు చేపడితే మరింత మంచిది.

లక్షణాలు లేని జబ్బు :

హెపటైటిస్ బి వైరస్ శరీరంలో ప్రవేశించిన తొలి దశలో చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వ స్తాయి. దీన్ని అక్యూట్ దశ అంటారు. ఈ దశలో కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. తరువాత 95 శాతం మందికి వైరస్ శరీరంలో నుంచి పూర్తిగా తొలగిపోతుంది. కానీ ఓ 5 శాతం మందికి మాత్రం వైరస్ శాశ్వతంగా శరీరంలో ఉండిపోతుంది. అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్ శరీరంలో శాశ్వతంగా ఉండిపోతుంది.

దీన్నే క్రానిక్ దశ అంటారు. ఇలా ఒంట్లో వైరస్ మకాం వేసుకున్న క్రానిక్ హెపటైటిస్ బాధితుల్లో 60 శాతం మందికి వైరస్ వల్ల ఏ ఇబ్బందీ కలగదు. కానీ మిగిలిన 40 వాతం మందిలో వైరస్ క్రమంగా కాలేయాన్ని నష్టపరిచి భవిష్యత్తులో లివర్ సిర్రోసిస్ అనే తీవ్రమైన కాలేయ సమస్యకు దారితీయవచ్చు. కాలేయ క్యాన్సర్‌ని కూడా కలుగజేయవచ్చు. ఇంత నష్టం జరుగుతున్నా జబ్బు ముదిరేవరకు, రోగికి ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్ నిశ్శబ్దంగా ఉంటుంది.

గుర్తించడం ఎలా?

హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజెన్ (ఏఛఖిఅజ) అనే రక్త పరీక్ష ద్వారా వైరస్ శరీరంలో ఉన్నట్టు గుర్తించవచ్చు. హెపటైటిస్ బి వైరస్ డిఎన్ఎ పరీక్ష ద్వారా శరీరంలో వైరస్ మోతాదు అంచనా వేయవచ్చు.

ఎలా వస్తుంది?

  • కలుషితమైన సూదులు, పచ్చబొట్లు, బ్లేడ్లు
  • ఈ వైరస్ ఉన్నవారితో లైంగిక సంపర్కం
  • వైరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్న తల్లి నుంచి బిడ్డకు
  • కలుషితమైన రక్తమార్పిడి, అవయవ మార్పిడి
  • ఒకే ఇంట్లో ఉండటం, తాకడం, కౌగిలించుకోవడం, ఉమ్మేయడం, దగ్గడం అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందదు.
  • తాగునీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపించదు.

టీకాలతో నివారణ :

  • హెపటైటిస్-బి టీకా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి సోకకుండా పూర్తిగా రక్షణ పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చిన్నారులు ఈ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టీకా ధర కూడా ఎక్కువేం కాదు.
  • ఒకరి రేజర్‌లు, నెయిల్ కట్టర్ల వంటివి మరొకరు వాడొద్దు. సెలూన్లలో తప్పనిసరిగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
  • డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు మాత్రమే వాడాలి.
  • రక్తమార్పిడి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
  • విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండాలి. కండోమ్స్ ఉపయోగించడం తప్పనిసరి.
  • తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా ఏఛఐజ (హెపటైటిస్-బి ఇమ్యునోగ్లోబ్యులిన్) మందు బిడ్డకు పుట్టగానే ఇవ్వడం ద్వారా సులభంగా కాపాడవచ్చు.

పసరు చికిత్స కాదు

వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే ఆధునిక వైద్య పరిజ్ఞానం ఉపయోగించి కాలేయానికి ఎటువంటి నష్టం జరగకుండా కాపాడవచ్చు. హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నంత మాత్రాన అందరికీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. రక్తంలో వైరస్ మోతాదు ఎక్కువ ఉన్నవారికే మందులు అవసరం. ఈ వ్యాధి చికిత్సకు ఇంటర్‌ఫెరాన్ ఇంజెక్షన్లు, ఎంటికావిర్, టినోఫక్షవిర్,ల్యామీవుడిన్ వంటి మందులు అందుబాటులో ఉన్నా యి. పసరు మందులు ఈ వైరస్ మీద ఎలాంటి ప్రభావం చూపవు. పైగా అవి కాలేయానికి నష్టం కలిగించవచ్చు.

జీవక్రియలను నియంత్రించే థైరాయిడ్

థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలు చోటు చేసుకుంటాయి. ఒకటి టి3, టి4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. రక్తపరీక్షల్లో టీఎస్‌హెచ్ పెరగడం, టి3, టి4 తగ్గడం లేక నార్మల్‌గా ఉంటుంది. రెండవది టి3, టి4 పెరగడం వలన హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది.

థైరాయిడ్ గ్రంథి లోపాలు మన శారీరక, మానసిక వ్యవస్థమీద పనిచేస్తాయి.థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా మూడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి ట్రైఐడో థైరోనిన్, థైరాక్సిన్, కాల్సిటోనిక్. ఈ హార్మోన్ల వలన మెటబాలిక్ ప్రాసెస్ త్వరితగతిన సాగుతుంది. ఇవి బరువు, ఎత్తు, ఎదుగుదల, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రతలను, రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

థైరాయిడ్ జీవక్రియలకు అవసరమైన ముఖ్యమైన గ్రంథి. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి పనిచేయదో అది శరీరంలోని ప్రతీ జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళన, శక్తి స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది.

థైరాయిడ్ సమస్యల్ని గుర్తించనట్లయితే స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళన, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్ డిస్‌ఫంక్షన్, సంతానలేమి తదితర ఆరోగ్య సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంటుంది.థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను తయారుచేస్తుంటుంది. ఈ హార్లోన్లు శరీరంలో బీఎమ్ఆర్(బేస్‌డ్ మెటబాలిక్ రేట్)ను పెంచుతాయి. ప్రొటీన్ల తయారీలో, గుండెకు, ఇతర అవయవాలకు రక్త సరఫరాను హెచ్చించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోన్స్ వల్ల పిల్లల్లో గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. సరియైన సమత్యులత, పోషణ, శరీర పెరుగుదలకు థైరాయిడ్ గ్రం«థి అవసరం చాలా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథిలో మార్పులు చోటుచేసుకుంటాయి.థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్స్ ఎక్కువ కావడం లేదా తక్కువ కావడం.

హైపర్‌థైరాయిడిజమ్ :

థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అయినపుడు దానిని హైపర్‌థైరాయిడిజమ్ అంటారు.

లక్షణాలు :

ఆకలి బాగా ఉంటుంది కానీ, బరువు తగ్గుతారు. కోపం, చికాకు, నీరసం, అలసట, ఉద్రేకం, నాడీ వేగం పెరగటం, కాళ్లు, చేతులు వణుకుట, ఎక్కువ వేడిని భరించలేకపోవుట, చెమటలు పట్టుట, నీటి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం మామూలుగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా బరువు కోల్పోవడం అనేది హైపర్ థైరాయిడిజమ్‌కు సూచన. థైరాయిడ్ గ్రంథి భాగం వాచి నొప్పి ఉన్నప్పుడు థైరోటాక్సికోసిస్ అంటారు. దీనినే అటో ఇమ్యూన్ డిజార్టర్ అంటారు. ఇది ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది.

హైపోథైరాయిడిజమ్ :

టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తి కొన్ని కారణాల వల్ల తగ్గిపోతుంది. దీనిని హైపోథైరాయిడిజమ్ అంటారు.

లక్షణాలు :

నీరసం, బద్దకం, బరువు పెరగటం, ముఖం వాచినట్లుండటం, జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లుండటం, మలబద్దకం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కండరాలు, కీళ్ల నొప్పులు, చేతుల్లో నీరసం, చేతిలో కార్పల్ టన్నెల్, కాళ్లలో టార్సల్ టన్నెల్ సిండ్రోమ్‌లు వచ్చే అవకాశం ఎక్కువ అవడం. మెడ వాచినట్లుగా అనిపించడం, టర్టిల్‌నెక్స్ లేక నెకెటిస్‌తో పాటు అసౌకర్యం, గొంతు బొంగురు పోవుట, థైరాయిడ్ గ్రంథి బయటకు కనిపించే విధంగా పెద్దగా అవడం. ఇవన్నీ థైరాయిడ్ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వెంట్రుకలు ఊడిపోవడం అనేది థైరాయిడ్ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం. హైపోథైరాయిడిజమ్ కలిగిన వారిలో వెంట్రుకలు ముతకగా, మందంగా,ఎండినట్లుగా అవుతాయి. చర్మము మందంగా, ఎండిపోయినట్లుగా అవుతుంది.

థైరాయిడ్ సమస్య ఉంటే కనిపించే మరో లక్షణం మలబద్దకం. విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఎక్కువగా హైపర్ థైరాయిడిజమ్‌లో ఉంటాయి. కొలెస్టరాల్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం, ఆహారం తగ్గించినా, వ్యాయామం చేసినా, కొలెస్టరాల్ తగ్గించే మందులు ఉపయోగించినా కూడా సాధారణ స్థాయికి రాకపోవడం హైపోథైరాయిడిజమ్‌కి సూచనగా భావించవచ్చు.

తక్కువ కొవ్వు పదార్థాలున్న, క్యాలరీలున్న ఆహారం తీసుకోవడంతో పాటు తగిన శారీరక వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు కోల్పోకపోవడం లేక బరువు పెరగకపోవడం జరుగుతుంది. హైపోథైరాయిడిజమ్ ఉన్న వారిలో బరువును కోల్పోవుట చాలా కష్టంతో కూడుకున్న పని.

నిర్ధారణ

రక్తపరీక్షలు చేయడం ద్వారా టి3, టి4, టీఎస్‌హెచ్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా రోగనిర్ధారణ చేసుకోవచ్చు.

చికిత్స

హోమియోపతి చికిత్స ద్వారా థైరాయిడ్ హార్మోన్ సమస్యలను సరిచేసే వీలుంది. థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించడం ద్వారా హార్మోన్స్‌ను రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి టి3, టి4, టీఎస్‌హెచ్ నార్మల్ రేంజ్ కు వచ్చిన తరువాత చాలా ఏళ్ల వరకు థైరాయిడ్ నార్మల్‌గా పనిచేస్తుంది. హార్మోన్స్ నార్మల్ అయిన వెంటనే ఊబకాయం, నిద్రలేమి, ఆత్రుత, ఆందోళన తగ్గిపోతాయి. శారీరక, మానసిక సమస్యలు సర్దుకుంటాయి.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate