অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆంత్రాక్స్

ఆంత్రాక్స్

ఇటీవల కాలంలో అమెరికాలో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా యావత్ ప్రపంచం ఆంత్రాక్స్ ను ఒక ఆయుధంగా వాడగల సామర్థ్యంపై చర్చలు తీవ్రతరమయ్యాయి. ఎన్నో సందేహాలు, ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రజలు స్వయం సంరక్షణకు మరియు ప్రభుత్వాలు సమాజ సంరక్షణకు ఆతృత చెందుతున్నారు. ఆంత్రాక్స్ పై తగిన సమాచారాన్ని మరియు సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ సమాచారాన్ని విడుదల చేయడమైనది. దక్షిణ పూర్వ ఆసియా ఖండంలో ఆంత్రాక్స్ అతి తక్కువ మందికి సర్వ సాధారణంగా వచ్చే వ్యాధి. ఈ కొద్దిపాటి కేసులతో మనల్ని జాగృత పరచుకోవాలే కాని భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు.

వ్యాధి లక్షణాలు ?

ఆంత్రాక్స్ సాధారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు వంటి గడ్డితినే జంతువులలో వచ్చే అంటు వ్యాధి. ఇది బాసిల్లస్ ఆంత్రాక్స్ అను స్పోర్స్ ఏర్పరచే బాక్టీరియా వల్ల వస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ జంతువుల నుంచి ఆంత్రాక్స్ మనుషులకు సోకే ప్రమాదం ఉంది.

ఆంత్రాక్స్ వార్తల్లోకి ఎందుకు వచ్చింది?

ఆంత్రాక్స్ బాక్టీరియాను జీవాయుధంగా ఉపయోగిస్తున్నారనే నమ్మకమే ఇందుకు కారణం.

ఆంత్రాక్స్ ఎలా వ్యాపిస్తుంది?ఎవరికి వ్యాపిస్తుంది?

పశు సంపద ప్రధాన పాత్ర వహించే వ్యవసాయక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువ. పశువుల ద్వారా లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ఆంత్రాక్స్ మనుషులకు సోకుతుంది. చనిపోయిన జంతువులకు సంబంధించిన ముడిసరుకుల కర్మాగారాలలో పనిచేసేవారు విదేశాల నుంచి జంతు సంబంధమైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేవారు ఆంత్రాక్స్ బారినపడే అవకాశాలు ఉన్నాయి.

మనుషులలో ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి చర్మం సంబంధిత, శ్వాసకోశ సంబంధిత మరియు జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ అను మూడు రకాలుగా ఉంటుంది.  ఆంత్రాసిస్ స్పోర్స్ మట్టిలో సైతం చాలా ఏళ్ళు మనగలుగుతాయి. ఆంత్రాక్స్ స్పోర్స్ లను పీల్చడం ద్వారా, ఆంత్రాక్స్ వ్యాధి బారిన పడిన జంతుమాంసాన్ని సరిగ్గా వండకుండా తినడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

ఆంత్రాక్స్ లక్షణాలేమిటి?

వ్యాధి సోకిన విధానాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వ్యాధి సోకిన వారం రోజుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడతాయి.

చర్మ సంబంధిత ఆంత్రాక్స్:

ఆంత్రాక్స్ సోకిన జంతువుల ఉన్ని, చర్మం, వెంట్రుకలు మొదలైన ఉత్పత్తులకు సంబంధించిన కర్మాగారాలలో పని చేసేవారికి చర్మంపై ఉన్న గాయాల ద్వారా వ్యాధి కారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ భాగంలో ఏధైనా పురుగుకుట్టిందేమో అన్నట్లుగా వాపు వస్తుంది. అది ఒకటి, రెండు రోజుల్లో ఉబికి అల్సర్ గా పరిణమిస్తుంది. మధ్యలో నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది. ఎలాంటి చికిత్స జరగని సందర్భంలో 20% చర్మ సంబంధిత ఆంత్రాక్స్ కేసులు మరణానికి దారి తీస్తాయి. తగిన చికిత్సతో మరణాన్ని నివారించవచ్చు.

శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్:

గాలిలో ఉన్న ఆంత్రాక్స్ స్పోర్స్ పీల్చడం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తొలి దశలో జలుబులా అనిపిస్తుంది. తరువాత శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ ప్రాణాంతకరము.

జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్:

ఆంత్రాక్స్ బాసిల్లస్ తో కలుషితమైన మాంసాన్ని సరిగా వండకుండా తినడం వల్ల ఇది వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, వాంతులు, జ్వరం, రక్తపు విరేచనాలు, గొంతునొప్పి మరియు కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా ఆంత్రాక్స్ బారిన పడ్డ కేసుల్లో 25%నుండి 60% వరకు మరణాలు సంభవిస్తాయి.

ఆంత్రాక్స్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది?

ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఆధార ప్రదేశాలలోను, ప్రజారోగ్య కార్యక్రమాలు సరిగా చేపట్టని దేశాల్లోను మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను కనిపిస్తుంది.

ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందా?

ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు.

ఆంత్రాక్స్ ను నియంత్రించడం ఎలా?

ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే దేశాలలో పశువులకు టీకాలు వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చును మరియు వ్యాధి బారిన పడిన జంతువుల కళేబరాలను కాల్చివేయడం ద్వారా స్పోర్స్ ను నాశనం చేయడం, వాటి మాంసాన్ని తినకుండా ఉండడం, వాటి ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చును.

ఆంత్రాక్స్ కు టీకా ఉందా?

ఆంత్రాక్స్ కు టీకా ఉంది. కానీ ఈ టీకా వాడకము మనుషుల్లో అంతగా ప్రాచుర్యములో లేదు.

ఆంత్రాక్స్ టీకాను ఎవరు వేయించుకోవాలి?

  • పశువైద్య సిబ్బంది
  • ప్రయోగశాలల్లో ఆంత్రాక్స్ బాక్టీరియాతో ప్రత్యక్షంగా పనిచేసేవారు
  • జంతు సంబంధ ఉత్పత్తుల పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది
  • జీవాయుధాల ప్రమాదం పొంచి ఉన్నచోట విధులు నిర్వహించే రక్షణ సిబ్బంది

ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించటం ఎలా?

ఆంత్రాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి రక్తంలోని నిర్ధిష్ట యాంటీ బాడీస్ ను లెక్కించటం, రక్తం, చర్మం, శ్వాసద్రవాల పదార్థాల నుంచి ఆంత్రాసిస్ వేరు చేయడం ద్వారా ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించవచ్చు.

మన రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాధిని నిర్ధారించే ప్రయోగశాలలు ఉన్నాయా?

ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్, నారాయణ గూడ, హైదరాబాదు మరియు అన్ని వైద్య కళాశాలలకు అనుబంధముగా యున్న వైద్యశాలల్లో ఈ వనరులు ఉన్నాయి.

ఆంత్రాక్స్ కు చికిత్స ఉందా?

చికిత్స ఉంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమవుతుంది. వైద్యుల సలహా మేరకు పెన్సిలిన్, డాక్సిసైక్లిన్, ఎరిత్రోమైసిన్ లేదా సిప్రోప్లాక్సాసిన్ మందులు వాడితే వ్యాధినయమవుతుంది. ప్రస్తుతము సిప్రోప్లాక్సాసిన్ వాడుట మంచిది.

ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

ఆంత్రాక్స్ గురించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఈ పిడిఎఫ్ ను క్లిక్ చేయండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate