অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పరధ్యానం

పరధ్యానం(Absent mindedness)- మెంటల్ హెల్త్ :

ధ్యానం మంచిదే...కాని పరధ్యానంతోనే అసలు సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. పని పక్కదారి పడుతుంది. రహదారి వదిలేసి పక్కదారులు పడితే ప్రమాదమే కదా! దాంతో ప్రధానమైన విషయాలను విడిచి, కొత్తవాటి గురించే ఆలోచిస్తుంటాం.

పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి. వాటితో ఎన్నో సమస్యలూ వస్తాయి. వాటిని అధిగమించడాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు సమస్యలు, కొసరు సమస్యలూ అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.

బస్‌స్టాప్‌కు వెళ్లి బస్సు గురించి చూస్తూ ఎక్కడో ఆలోచిస్తే ఆ బస్సు వెళ్లిపోయింది కూడా తెలియకపోవచ్చు. రోడ్డు దాటే సమయంలో అలెర్ట్‌గా ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఇవి ఏ పనులు చేసేటప్పుడైనా ఏర్పడవచ్చు. మనిషిక్కడ, మనసెక్కడో అన్నట్టుగా ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

సుజన్యకు 35 ఏళ్లు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. పనివాళ్లు ఇంటి పని చేసేసి వెళ్లిపోతారు. సుజన్యకు కావల్సినంత ఖాళీ సమయం. ఈ మధ్య సుజన్యలో వస్తున్న మార్పు భర్తను కలవరపరుస్తోంది. తను పిలిచినా త్వరగా పలకడం లేదు. రాతిళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. ముందున్న హుషారు ఎంతమాత్రం లేదు. మనిషిగా ఇక్కడే ఉంటుంది కాని, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. డాక్టర్ని కలిస్తే డిప్రెషన్ పరధ్యానం అని చెప్పారు.

* * *
మాధురి, రమేష్‌కు పెళ్లై రెండేళ్లే అవుతోంది. విడాకులు తీసుకుంటానని మాధురి తన తల్లిదండ్రుల దగ్గర పోరుతోంది. కారణం రమేష్‌కు అసలు ఇంటి ధ్యాసే లేదని, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నాడని, అతనికి ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశారని’ కంప్లైంట్. తర్వాత తెలిసిన నిజం. రమేష్ సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. బిజినెస్ పనుల్లో టూర్లకు వెళ్లడం, ఎలా చేస్తే త్వరగా ఎదుగుతామనే ఆలోచనలు, ఆర్థిక సమస్యల మూలంగా పరధ్యానంగా ఉండేవాడు.

* * *
భార్గవ్‌కి పద్నాలుగేళ్లు. నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ మధ్య ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నాడు, చదువుమీద ఏకాగ్రత లేదు అని తల్లి బెంగపెట్టుకుంది. భార్గవ్‌ని తరచి తరచి అడిగితే తేలిన విషయం ఏంటంటే కిందటి క్లాస్‌లో లాగ మ్యాథమేటిక్స్ మంచిగా చెప్పే టీచర్ లేరు. ఫ్రెండ్స్ కూడా సపోర్ట్‌గా లేరు. లెక్కల్లో ఫెయిల్ అవుతానేమో అనే ఆందోళనతో పరధ్యానంగా ఉంటున్నాడు.

* * *
ధ్యానం అంటే ఆరోగ్యానికి మేలు కలిగించేదిగా, మనసుకు ప్రశాంతత నిచ్చేదిగా చెబుతుంటారు. మరి పరధ్యానం అంటే...! మనిషి ఉన్న చోటే ఉండి, అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా ఉంటారు. ఆలోచన, ఆచరణ ఒకేదానిపై కేంద్రీకరించినప్పుడు ఆ పని సఫలీకృతం అవుతుంది. ఉదాహరణకు బస్‌స్టాప్‌కు వెళ్లి బస్సు గురించి చూస్తూ ఎక్కడో ఆలోచిస్తే ఆ బస్సు వెళ్లిపోయింది కూడా తెలియకపోవచ్చు. రోడ్డు దాటే సమయంలో అలెర్ట్‌గా ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఇవి మరే వర్క్ చేసేటప్పుడైనా ఏర్పడవచ్చు. మనిషిక్కడ, మనసెక్కడో అన్నట్టుగా ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇది ఏ పనికైనా వర్తిస్తుంది. అంతమాత్రాన పరధ్యానం మానసిక వ్యాధి అని చెప్పడానికి లేదు. కొంత మంది వ్యక్తితత్వం అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వ్యాధి రూపంలో ఒక లక్షణంగా ఉంటే ఉండొచ్చు. మామూలు వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. పరధ్యానానికి వారు వీరు, వయసు తేడా ఏమీ లేదు.

ఇలా ఉంటారు...
పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు...సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో వివరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు.

ఎప్పుడూ మానసిక ప్రశాంతను కోరుకుంటారు. తమ భావాలను మరొకరితో పంచుకోవడానికి అంత ఉత్సాహం చూపరు. తక్కువగా మాట్లాడుతారు. ప్రతి ఒక్క విషయానికి ఇంకొకరిమీద ఆధారపడుతుంటారు. మెచ్యూర్డ్‌గా ఉండరు. సహజత్వానికి దూరంగా ఉంటారు.

పరధ్యానంగా ఉండటం వల్ల సమస్యలు

 • నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్‌లో రిజిస్టర్ కాదు. ఇది పిల్లల్లో అయితే చదువులో వెనకబడేలా చేస్తుంది. పెద్దల్లో పనుల్లో లోపాలు, జాప్యం, కెరియర్‌లో ఎదుగుదల లేకపోవడం.. వంటి నష్టాలు సంభవిస్తుంటాయి.
 • సమస్యల నుంచి త ప్పుకోవాలనుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దూరంగా ఉంటారు కనుక ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతుంటారు.
 • వివాహ బంధంలో భాగస్వామితో త్వరగా సర్దుకుపోలేరు. ఎదుటి వ్యక్తి అంటే ఉండే భయం కారణంగా వివాహం కూడా వద్దనుకుంటారు.
 • ఏదైనా వర్క్ విషయంలో ‘చేస్తాను’ అని మాట ఇచ్చి నిలుపుకోలేరు. దీంతో ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతుంటారు.

కారణాలు

వంశపారంపర్యం : తల్లిదండ్రుల్లో పరధ్యానం సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది.

కుటుంబ వాతావరణం : ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో చులకనగా మాట్లాడటం. ఉదాహరణకు ‘నీకే పనీ చేతకాదు, ఓ చోట కూర్చో, నువ్వు సరిగ్గా చదవలేవు...’ వంటి పెద్దల మాటల ప్రభావం చిన్నతనంలో ఒంటరిగా ఉండేలా చేస్తుంది. ఇంకొంతమంది పిల్లల్ని అతిగారాబం చేస్తుంటారు. తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా... ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భావంలో ఉంటారు. అన్నీ సజావుగా జరిగిపోవడంతో ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటారు. తమకు అనుగుణంగా లేనప్పుడు త్వరగా మూడీ అయిపోతారు. ఇవి రకరకాల ఆలోచనలను కలిగిస్తాయి.

పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు (ఎమోషనల్ ప్రాబ్లమ్స్), అతిగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పరధ్యానం వస్తుంటుంది.

పెద్దవారిలో పర్సనాలిటీ డిసార్డర్స్, మేజర్ డిప్రెషన్ డిసార్డర్స్ వల్ల మనసు దిగులుగా, దుఃఖంగా ఉండటం, తమను తాము తక్కువగా అంచనా వేసుకొని వాళ్లలో వాళ్లు లీనమైపోతారు.

స్కిజోఫ్రీనియో : ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధపెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా, ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.

మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.

మల్టీటాస్కింగ్ : ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది. ముఖ్యంగా స్ర్తీలు- ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు... ఇలా ఒక పని తర్వాత మరో పని పెట్టుకొనే వారు, పనులను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోనివారు పరధ్యానంగా కనిపిస్తుంటారు. అలాగే వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు.. ఎన్నో రకాల పనులు పెట్టుకునేవారిలో ఈ సమస్య ఉంటుంది. దీని వల్ల తప్పులు దొర్లుతుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో ‘మర్చిపోతున్నాం’ ‘మతిమరుపు మూలంగా ఏ పనీ చేయలేకపోతున్నాం’ అని తిట్టుకుంటూ ఉంటారు. కాని ఇది మతిమరుపు కాదు, పరధ్యానం వల్ల కలిగే సమస్య.

పరధ్యానం నుంచి బయట పడాలనుకునేవారు చేయవలసినవి :

 • మనస్తత్వ నిపుణులను సంప్రదించి, మానసిక రుగ్మతతో ఉంటే చికిత్స తీసుకోవాలి.
 • ఇష్టమైన పనులు చేయాలి. వారం మొత్తం ఏమేం పనులు చేశామో వారాంతంలో గుర్తుచేసుకొని బుక్‌లో రాసుకోవాలి.
 • ఏకాగ్రత కుదరడానికి, సోషల్ స్కిల్స్‌లో ప్రావీణ్యానికి శిక్షణ తీసుకోవాలి.
 • ఏకాగ్రత పెరగడానికి రకరకాల పజిల్స్‌తో మెంటల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. పిల్లల చేత వీటిని చేయించాలి.
 • పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
 • సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకోవాలి. అనుకున్న పని పూర్తవగానే టిక్ పెట్టుకోవాలి.
 • ఒక బుక్ పెట్టుకొని ఏయే సమయాల్లో పరధ్యానంగా ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు? అనేవి రాసుకోవాలి.
 • పిల్లలు దేని కారణంగా పరధ్యానంగా ఉంటున్నారో తెలుసుకొని, చర్చిస్తే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.

ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/13/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate