పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇది సోలార్ గ్రామం

ఆ గ్రామం అసలు పేరు ధర్నయి. బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉంది. దేశంలోనే పూర్తిస్థాయిలో సౌర విద్యుత్తును వినియోగించుకుంటున్న మొట్టమొదటి గ్రామంగా ఘనతనూ దక్కించుకుంది.

సూర్యుడే దీపమై వెలిగితే కరెంటు కష్టాలు పారిపోవా... కన్నీరు పెట్టించే చీకటి బాధలు సమసిపోవా... ఆటంకాలను తప్పించుకుని అభివృద్ధి ముందడుగు వెయ్యదా..? దేశంలోనే తొలి సోలార్ విద్యుత్తు గ్రామంగా పేరు తెచ్చుకున్న ధర్నయిని చూస్తే ఎవరు మాత్రం ఈ ప్రశ్నలకు అవునని సమాధానం చెప్పకుండా ఉంటారు..!

హైదరాబాద్ రెండు కిలో మీటర్లు, గుంటూరు నాలుగు కిలోమీటర్లు... అంటూ వూరి పేర్లతో మైలు రాళ్లూ బోర్డులూ కనిపించడం మనకు తెలిసిందే. అలాగే ఆ వూళ్లోకి వెళ్లేముందూ ఓ బోర్డు కనిపిస్తుంది. 'సోలార్ విద్యుత్ గ్రామానికి స్వాగతం' ఇదే దానిమీది సారాంశం. ఆ గ్రామం అసలు పేరు ధర్నయి. బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉంది. విద్యుత్ కనెక్షన్ లేక మనదేశంలోని ఎన్నో గ్రామాలు ఇప్పటికీ అంధకారంలో మగ్గిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ధర్నయి గ్రామం పరిస్థితి కూడా అదే. కానీ ఇప్పుడా గ్రామంలోని ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఉండడం గొప్ప విషయం అయితే ఏ ఇంట్లోనూ కరెంటు కోత లేక పోవడం అంతకన్నా గొప్ప విషయం. ఎందుకంటే వూళ్లో ఏర్పాటు చేసిన సోలార్ మైక్రోగ్రిడ్లే వారికి అవసరమైన మొత్తం కరెంటును ఉత్పత్తి చేసేస్తున్నాయి. అందుకే, ధర్నయి ఇప్పుడు దేశంలోనే పూర్తిస్థాయిలో సౌర విద్యుత్తును వినియోగించుకుంటున్న మొట్టమొదటి గ్రామంగా మరో ఘనతనూ దక్కించుకుంది.

ఎన్నో ఏళ్ల నిరీక్షణ...

ముప్ఫై ఏళ్ల కిందట ఓరోజు ఆ వూరికి విద్యుత్తును సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. ఆ వూళ్లో విద్యుద్దీపాలు వెలగడం అదే ఆఖరిసారి అయింది. అసలే బీహార్ వెనుకబడిన రాష్ట్రం. పట్టణాల్లోనే కరెంటు ఎప్పుడుంటుందో ఎప్పుడుండదో అన్న పరిస్థితి. దాంతో విద్యుత్తు కోసం గ్రామస్థులు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. బీహార్ రాజధానికి కేవలం 70కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా ధర్నయి వాసులకు కిరోసిన్ దీపాలూ ఖర్చు ఎక్కువ ఉండే డీజిల్ జనరేటర్లే దిక్కయ్యాయి. అయితే, దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నో చీకటి కష్టాలు పడిన వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మూడేళ్ల కిందట'గ్రీన్‌పీస్ ఇండియా' స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ సమస్యకు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే దిశలో పరిష్కారం కనిపెట్టింది. అలా వచ్చినవే సూర్యకాంతిని తీసుకుని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే మైక్రోగ్రిడ్లు. సీడ్(సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ డెవెలప్‌మెంట్), బేసిక్స్(మెరుగైన జీవన విధానానికి తోడ్పడే సంస్థ) అనే మరో రెండు స్వచ్ఛంద సంస్థలతో కలసి గ్రీన్‌పీస్ ఇండియా సుమారు మూడు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి సౌరఫలకాలున్న మైక్రోగ్రిడ్లను వూరంతటా ఏర్పాటు చేసింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే గ్రామంలోని ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్తును సరఫరా చెయ్యగలిగింది. అంతేకాదు, వంద కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ మైక్రో గ్రిడ్లు 450ఇళ్లూ 2400మంది జనాభా ఉన్న ధర్నయి గ్రామం మొత్తం అవసరాలకు విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. అందులో యాభై వాణిజ్య భవనాలూ రెండు పాఠశాలలూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిసాన్ శిక్షణ సంస్థలూ నీటి పంపులు కూడా ఉన్నాయి. ఫలితం... ఒకప్పుడు సాయంత్రమైతే చిమ్మ చీకట్లో అక్కడో వూరుందనే తెలియకుండా ఉండే ధర్నయి ఇప్పుడు 24 గంటలూ సౌర విద్యుత్తుతో కళకళలాడిపోతోంది. పిల్లలు చదువుకుంటున్నారు, పంటలకు నీరు వెళుతోంది, మహిళలు చీకటి పడ్డాక కూడా పనులు చేసుకోగలుగుతున్నారు, వ్యాపారాలు లాభాల్లో నడుస్తున్నాయి, ఇళ్లలోకి ఫ్రిజ్‌లూ ఫ్యానులూ టీవీలూ వస్తున్నాయి, ఇంకేముందీ... ఆ గ్రామం అభివృద్ధి వైపు నడుస్తోంది.

ఆదర్శప్రాయం

'గత ముప్ఫయ్యేళ్లలో భారత్ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎన్నెన్నో రంగాల్లో కొత్త పరిజ్ఞానం వచ్చింది. గృహోపకరణాల దగ్గర్నుంచీ వ్యాపార వ్యవసాయ రంగాల్లోనూ ఎన్నో విధాలుగా ఉపయోగపడేవీ రకరకాల పనుల్ని సులభంగా చేసేందుకూ అత్యాధునిక మెషీన్లు ఎన్నెన్నో వచ్చాయి. కానీ మా గ్రామం మాత్రం వాటన్నింటికీ దూరంగా చీకటిలో మగ్గిపోయింది. ఆఖరికి ఫోను వాడాలన్నా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క వూరికి వెళ్లాల్సొచ్చేది. కానీ సౌరవిద్యుత్తు వల్ల ఇప్పుడు మా గ్రామం వెలుగుల్ని వెదజల్లుతోంది. దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది' అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అంటాడు కమల్ కిషోర్ అనే గ్రామస్థుడు. ఒకప్పుడు కిరోసిన్ దీపాలకే ఈ గ్రామస్థులు వందల రూపాయల్ని ఖర్చుపెట్టేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోని అవసరాలన్నింటికీ సరిపడా విద్యుత్తును వాడినా వచ్చే బిల్లు రూ.రెండొందల లోపే. పైగా మైక్రో గ్రిడ్లను నిర్వహించే పనిని వూళ్లోని యువకులకే అప్పగించింది గ్రీన్‌పీస్ సంస్థ. దాంతో కొందరికి ఉపాధీ లభించింది. అందుకే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ సౌర విద్యుత్తు మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడే దిశలో దేశంలోని విద్యుత్తు అవసరాలను తీర్చే ఈ ఉపాయం కూడా ఎందరికో నచ్చింది. దాంతో పర్యటకులతో పాటు దేశావ్యాప్తంగా ఎందరో ప్రముఖులూ రాజకీయ నాయకులూ ఈ గ్రామాన్ని సందర్శించడానికి ప్రత్యేకంగా వస్తున్నారు.

ఆధారము: ఈనాడు సండే మాగజైన్

3.04255319149
vasumathi Apr 08, 2015 01:51 PM

ఇది చాలా మంచి విషయం ,మన తెలుగు రాష్ట్రాలు కూడా దీని మీద ద్రుష్టి పెడితే మనకిక కరెంట్ కోతలుండవు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు