অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విచారణ ఖైదీలు – బందిఖానాకు ప్రత్యమ్నాయాలు

విచారణ ఖైదీల సమస్యలు

  • జైళ్ళలో ఉండే మొత్తం ఖైదీలలో 75% మంది, నేరం చేశారా లేదా అన్నది ఇంకా ఋజువు కావాల్సిన వాళ్ళే.
  • ప్రస్తుతం దేశంలో 2.3 లక్షల మంది విచారణ ఖైదీలు తమ కేసులు విచారణ మొదలు కావడానికి లేదా పూర్తి కావడానికి ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ఎదురు చూపులు ఒక నెల నుండి పది సంవత్సరాల వరకు ఎంతైనా ఉంది.
  • వాళ్ళలో చాలా మంది అణగారిన వర్గాలకు చెందినవాళ్ళు. అందువల్ల ఈ వ్యవస్థ నిర్లక్ష్యానికి, వివక్షకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ.
  • వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళు కనుక మంచి లాయర్ ను పెట్టుకోలేరు కాబట్టి చట్టం నిర్ణయించిన వ్యవధిలోగా న్యాయం పొందడమూ కష్టమే.
  • విచారణ కొరకు ఇలా చాలాకాలం వృధా అవుతున్న కొద్దీ, వాళ్ళకి తమ తమ కుటుంబాలతో సంబంధాలు తెగిపోతాయి. అంటువ్యాధుల పాలవుతారు. తోటి ఖైదీల నుండి ఖైలు సిబ్బంది నుండి హింసకు కూడా గురవుతూ ఉంటారు

కొన్ని పరిష్కారాలు

విచారణ ఖైదీల విషయంలో జైళ్ళ సందర్శకులు చాలా కృషి చెయ్యొచ్చు. మొదటగా, మీ జైల్లో బెయిల్ కు అర్హమైన (బెయిలబుల్ ) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలు ఉన్నట్లయితే, ఆ విషయం సెషన్స్ జడ్జి గారికి చెప్పి – వారిని జమానత్ (ష్యూరిటీ) లేకుండా, వ్యక్తిగత పూచీకత్తు (పర్సనల్ బాండ్ )మీద విడిపించవచ్చు.

రెండవది చిన్న చిన్న నేరారోపణలతో జైలుకు వచ్చిన ఖైదీలలో – స్వచ్ఛందంగా నేరం ఒప్పుకునే ఖైదీలు గనక ఉన్నట్లయితే అటువంటి వారిని జైలు అదాలత్ లు అని పిలువబడే ప్రత్యేక కోర్టుల ముందుకు తీసుకురావచ్చు.

జైలు అదాలత్ లను జైలు ఆవరణలోనే నిర్వహిస్తారు. పేరుకు పోయిన చిన్న కేసుల సంఖ్య తగ్గించడం కోసం – 29.11.1999న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి డా|| ఎ.ఎస్ ఆనంద్, దేశంలొ నున్న అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఒక ఉత్తరం రాస్తూ జైళ్ళలో జైలు అదాలత్ లు పెట్టి, చిన్న చిన్న నేరాలుగా పరిగణీంచే కేసులలో – స్వచ్ఛందంగా నేరాన్ని అంగీకరించే ఖైదీల కేసుల విచారణ ను పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. తద్వారా పేరుకు పోయిన కేసుల సంఖ్య తగ్గించాలని ఆయన సూచించారు. (ఈ అధ్యాయం చివరలో ఆ ఉత్తరం జత చేశాము) జైలు అదాలత్ లకు సంబంధించి ఈ క్రింది సెక్షన్ల క్రిందికి వచ్చే నేరాలకు చిన్న నేరాలుగా నిర్వచించడ మైనది.

భారత శిక్షా స్మృతిలోని –సెక్షన్

160,279,294,298,323,334,336,337,338,341,342,343,346,352,354,355,358,403,417,421,422,423,424,427,428,447,448,482,483,486,494,497,498,500,501,502,504,506 (ఫార్ట్ -1), 508,509,

భారత్ శిక్షా స్మృతి కాక వేరే ఏ చట్టం కిందనైనా 2 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు.

ఒక ఖైదీ తన నేరాన్ని ఒప్పుకోనేటట్లయితే అప్పటికే అతను జైలులో గడిపిన సమయాన్ని బట్టి లేదా తీవ్రతను బట్టి, జడ్జి అతని వెంటనే వదిలివేయవచ్చు లేదా ఇంకొంత కాలం జైలులో ఉన్న తర్వాత వదలమని ఆదేశించవచ్చు.

2000 సంవత్సరం తొలినాళ్ళలో ప్రారంభమైన జైలు అదాలత్ లు, 2-2-2001 నాటికి దేశ వ్యాప్తంగా 8వేలకు పైగా కేసులను పరిష్కరించాయి. (దాదాపు ఒక సంవత్సరంలో ) మీరు సందర్శించే జైలులో ఇంత వరకు జైలు అదాలత్ లు నిర్వహించి ఉండకపోతే, వాటిని ఏర్పరిచేందుకు చొరవ తీసుకోవాలి.

జైలు అదాలత్ ల వలన ప్రయోజనాలు.

  • § విచారణ త్వరగా జరిగి, కేసులు త్వరగా పూర్తవడం వలన ఖైద్దెలు లాభపడతారు, జడ్జీల పనిభారం కూడా తగ్గుతుంది.
  • § త్వరగా కేసులు పరిష్క్రరింప బడితే మొదటిసారి నేరం చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళకు, కరడుగట్టిన నేరస్తులకు మధ్య ప్రమాదకర సంబంధాలను ఏర్పడకుండా నివారించవచ్చు.
  • జైళ్ళలో రద్దీ కూడా కొంతవరకు తగ్గడానికి వీలవుతుంది

జైలు అదాలత్ ల ప్రయోగం విజయవంతం కావడం వలన కేందం న్యాయశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రతి జైళ్ళో ఇటువంటి కోర్టులను ఏర్పాటు చేయవలసిందిగా కోరింది. అది రాష్ట్రాలకు రాసిన ఒక లేఖలో న్యాయవాదులైన స్త్రీ పురుషులతో కూడిన న్యాయ సహయ కమిటీలను వారానికి ఒకటి రెండు సార్లయినా ఖైదీలకు తగు సహాయం చేయడానికి సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరింది.

ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, జైళ్ళ అదాలత్ ల వలన తలెత్తే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. నేరాన్ని అంగీకరించడం అన్న్దది ఒక ఖైదీ పేరున ఎప్పుడైతే నమోదు అవుతుందో అప్ప్డటినుండి ఆ ఖైదీపై నేరస్తుడు అన్న ముద్ర పడిపొతుంది. జైలునుంచి తొందరగా బయటపడదామన్న అమాయకపు ఆలోచన వలన ఎవరైనా నేరాన్ని అంగీకరిస్తే వాళ్ళకు – ప్రభుత్వోద్యోగాలకు అనర్హత ఏర్పడడం, పాస్ పోర్ట్ దొరకక పోవడం లేదా వాళ్ళుండే ప్రాంతంలో నేరం జరిగినప్పుడల్లా పోలీసుల వేధింపులు తదితర అన్యయాలు జరిగే అవకాశం ఉంది. నేరం ఒప్పుకున్న సందర్భంలో ... వాళ్ళను వ్యక్తిగత పూచీ కత్తు మీదగానీ, ప్రొబేషన్ మీద గానీ విడుదల చేసి, ఆ తర్వాత వారి సత్ప్ల్రవర్తన మీద ఆధారపడి వారిపైన నమోదు చేసిన నేర రికార్డును పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉండడం ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం కాగలదు.

అలాగే బంధిఖానాకు ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించమనీ సందర్శకులు జడ్జీలను అభ్యర్థీంచవచ్చు.

మూడవ అంశం: ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎలా నడుస్తున్నాయో వాటిని ఇంకా ఎలా మెరుగుపరచ వచ్చో కూడా ఆలోచించాలి. నేర విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు – రెండేళ్ళకు పైగా పెండింగ్ లో ఉన్న సెషన్స్ కేసులకు మొదటి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అలాగే విచారణ ఖైదీలకు సంబంధించిన క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. పై ఆదేశాల ప్రకారం 1.4.2001 నుండి జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులన్నింటిని కూడా త్వరగా విచారణ పూర్తి చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలి. అంతేకాక ప్రస్తుతం పెండింగ్ లొ ఉన్న 2.4 కోట్ల సెషన్స్ కేసులలో 10 లక్షల కేసులను కూడా అదనంగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్సులకు బదిలీ చేయాలి.

1.4.2001 నాటికి, 1.734 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి పనిచేయించడం కోసం – కేంద్రం 2.2.27కోట్ల రూపాయలు కేటాయించింది. వీటికి ఆయా రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తుల ముఖ్య మంత్రుల అనుమతి కూడా తీసుకుంది. వీటి పనిని ఆయా హైకోర్టులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఎంతో అవసరమయితే తప్ప సాధారణంగా ఈ కోర్టులలో వాయిదాలు అంగీకరించ కూడదు. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక్కొక్క కేసులో మొత్తం సాక్ష్యాన్ని నమోదు చేయడానికి వారం కంటే ఎక్కువ తీసుకోకూడదు. వీటి విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాధులు కూడా ఓపిక వహించి, సహకరించివలసిందిగా –లేక పోతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిరర్థకమవుతాయని, కేంద్రం సూచించింది.

పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను, మంచి న్యాయవాదులను గుర్తించడంలో జైలు సందర్శకులు కొరవ తీసుకుని వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు అధ్యక్షత వహించవలసిందిగా ఒప్పిస్తే న్యాయమూర్తుల కొరత తగ్గుతుంది.

నాల్గవ అంశం: రాజీ పడదగిన (కాంపౌండబుల్ ) నేరాలలో – నేరస్తులకు, బాధితులకు మధ్య మధ్యవర్తిత్వం వహించి కేసుల పరిష్కారానికి సందర్శకులు సహకరించాలి.

రాజీపడదగిన నేరాలలో (భారత శిక్షాస్మృతిలోని 320 సెక్షన్ లో నిర్వచించినవి) ఖైదీలను, వారి ప్రతి సక్షులను గుర్తించి, రాయాఅరం నెఅరపి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా వారిని ప్రొత్సహించాలి. అంతేకాక ఖైదీ తన తప్పుకు నిజంగా పశ్చాత్తాప పడేటట్టు, క్షమాపణ అడిగేటట్టు, బాధితునికి లేదా అతని కుటుంబానికి తగు మొత్తంలో నష్టపరిహారం ఇచ్చేటట్టు లేదా వారు కోల్పోయి8న ఆస్తిని తిరిగి ఏర్పరచేటట్టు లేదా ఆరోగ్యం కోల్పోయినట్లయితే వైద్యానికి అయ్యే ఖర్చులు లేదా తన నేరంవల్ల ఉత్పన్నమయ్యే ఇతర ఖర్చులు పెట్టుకోనేటట్టు ఖైదీని ఒప్పించగలగాలి. అటువంటి అంగీకారానికి ఉభయ పక్షాలు సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తే వారి మధ్య సత్వర పరిష్కారాన్ని ప్రోత్సహించి – దానిని జడ్జీగారి దృష్టికి తీసుకొచ్చి, రాజీ నమోదు చేసి కేసు ముగించేందుకు సహకరించాలి. వీటివల్ల శత్రుత్వాలు తగ్గి ఇరుపక్షాలూ ప్రశాంతంగా ఉండేందుకు వీలవుతుంది.

జైలు అదాలత్ లు నెలకొల్పడంలో జైలు అధికారులకు సహాయం కావాలన్నా, ఖైదీలకు బాధితులకు మధ్య రాజీలు కుదర్చడంలో సలహాలు కావాలన్నా ఢిల్లీలోని తీహర్ జైలులో పనిచేసి విశేషానుభవం గిడించిన ప్రొ||.బి.బి. పాండేగారిని సంప్రదిస్తే ఇంకా ఎక్కువ సమాచారం లభించవచ్చు.

వీడియో అనుసంధాన విధానం

సమర్థులైన న్యాయవాదులను నియమించుకునే, పూచీకత్తులు ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేక పోవడంతో పేద వర్గాల నుంచి వచ్చిన విచారణ ఖైదీలు దీర్ఘకాలం జైళ్ళలో మగ్గుతున్నారు. పోలీసు ఎస్కార్ట్ కొరత ఉండడం వల్ల, రిమాండ్ కాలపరిమితి ముగిసిన వెంటనే వారిని కోర్టు ముందుంచలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి, పోలీసు ఎస్కార్ట్ మీద అయ్యే వ్యయం తగ్గించడం పేరు మీద, 2001 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోర్టులకు, జైళ్ళకు మధ్య వీడియో అనుసంధానం ఏర్పాటు చేసింది. సిహెచ్ ఆర్ ఐ దీనిని గతంలో ఉత్సాహంగా ఆహ్వానించింది. ఈ విధానంలో జైలులో వీడియో కెమెరా ముందు ప్రవేశపెట్టిన విచారణ ఖైదీ, కోర్టు గదిలోని వీడియో తెరపై న్యాయమూర్తికి కనిపిస్తాడు. న్యాయమూర్తి విచారణ ఖైదీ ఒకరితో ఒకరు సంభాషించగలుగుతారు. కానీ ఈ పద్ధతి వల్ల విచారణ ఖైదీలు ఎంతవరకు ప్రయోజనం పొందగల్గుతున్నారనేది సందేహాస్పదమే.

కోర్టు ముందు విచారణ ఖైదీని ప్రవేశపెట్టిన ప్రతిసారి, కేసు పరిశోధనలోని పురోగతిని తెలుసుకుని, మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరుచేసే అవకాశాలను న్యాయవాదులు సహకరించాలి. దీనికి డిపెన్స్ తరపు, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు సహకరించాలి. దీనికి డిపెన్స్ తరపు, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు సహకరించాలి. కానీ వీడియో అనుసంధాన వ్యవస్థను రివాజుగా రిమాండ్ ను పొడిగించడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగిస్తుండడంతో న్యాయవారులు ఆ సంధర్బాలలో హాజరుకావడం లేదు. దీంతో కేసులోని పురోగతి తెలియక విచారణ ఖైదీలు ఆందోళన చెందుతుంటారు. గతంలో కోర్టుకు హాజరైనా సందర్బాలలో అక్కడికి బంధువులనో, తెలిసిన వారిని ఒప్పించి బెయిళ్ళు/ తెలిసినవారినో పిలిపించి, వారిని ఒప్పించి బయిళ్ళు పూచీకత్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువాగా ఉండేది. కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తి జైలు పాలైనప్పుడు ఇది రతచూ జరిగేదే. ప్రస్తుతం జైళ్ళలో అనుమ తించే పరిమితమైన ఇంటర్వ్యూ సమయాలలోనే ఆ ప్రయత్నం చేయాల్సి రావడం ఖైదీలకు సమస్యగా మారుతోంది. వీడియో అనుసంధానం ఏర్పాటు తర్వాత, విచారణ ఖైదీలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్త్గా తెగిపోతున్నాయి. దాంతో వారికి, శిక్షపడిన ఖైదీలకు మధ్య ఉన్న సన్నని విభజన రేఖ పూర్తిగా తుడిచి పెట్టుకు పోతోంది. అంతేకాక, వీడియో అనుసంధాన గదిలో జైలు అధికారుల సమక్షంలోనే ఖైదీలు మాట్లాడాల్సి రావడంతో, జైళ్ళలోని సమస్యలను విచారణ ఖైదీలు – ముఖ్యంగా దీర్ఘకాలం ఉన్నవారు – న్యాయమూర్తి దృష్టికి తేలేకపోతున్నారు. వీడియో అనుసంధాన విధానంలోని లోపాలను సరిదిద్దకపోతే, విచారణ ఖైదీల సమస్యలు మరింత జఠిలమయ్యే అవకాశం వుంది.

బందిఖానాకు ప్రత్యామ్నాయాలు

  • నేరం రుజువయ్యాక విధించే శిక్షల్లో జైలు శిక్షే ప్రధానమైనది. కాని డా|| వివియన్ స్ట్రర్న్ వంటి నిపుణులు, కొన్ని జైళ్ళ సంస్కరణ కమిటీలు చెప్పేదేమిటంటే –
  • ఒకసారి ఒక వ్యక్తి జైలుకు వెళ్ళారంటే – వాళ్ళు సాంఘికంగా వెలివేయబడతారు. వాళ్ళు మళ్ళీ సాంఘిక జీవనంలో కలవడం ఎంతో కష్టం. ఆ విధంగా వాళ్ళ జీవెతాలు నాశనం అయి పోతాయి
  • నిర్బంధానికి అయ్యే ఖర్చు మాట అలా ఉంచి జైళ్ళవల్ల ఖైదీల సంస్కరణ జరగడం లేదు. నేరస్తుల పునరా వాసమూ సాధ్యం కావడం లేదు.
  • జైళ్ళలో ఉంచినందువల్ల నేరాల సంఖ్య తగ్గుతుందనే గ్యారంటీ కూడా ఏమీ లేదు.అంతేకాకుండా, మొదటిసారి నేరం చేసినటువంటి వ్యక్తిని జైల్లో ఎక్కువ కాలం పెడితే అతడు కరడుగట్టిన వృత్తి నేరస్తుడుగా మారే ప్రమాదముంది

జైలులో ఉంచడం కంటే కూడా ఈ క్రింది ప్రత్యామ్నాయాలు ప్రయత్నించి కూస్తే బాగుంటుంది

  • మందలించడం, హెచ్చరించడం
  • కొన్ని షరతులు విధించి విడుదల చేయడం
  • ఆర్ధిక ఆంక్షలు, జరిమానాలు లేదా తప్పు విధించడాలు లాంటివి.
  • జప్తు చేయడం లేదా ఆస్తిపై హక్కులేకుండా చేయడం
  • దొంగిలించబడిన వస్తువుల్ని వాటి స్వంతదార్లకు ఇచ్చేయ మనడం లేదా నష్టపరిహారం చెల్లించమనడం.
  • సమాజానికి సేవచేయమని ఆజ్ణాపించడం.
  • ఒక నిర్ణీత ప్రదేశంలో రోజూ హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడం
  • గృహనిర్బంధం

పైన సూచించిన శిక్షలలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కలిపి విధించడం.

ఇంకా వివరాల కోసం: నిర్బంధానికి బదులు – ఐక్యరాజ్య సమితి కనీస ప్రామణిక నిబంధనలు (టోక్యో నిబంధనలు) చూడండి. http://www.unhchr.ch/html/menu3/b/h-comp46.html. వెబ్ సైట్ లో ఉంటాయి.

సందర్శకులు న్యాయమూర్తులలోని ప్రగతివాదులు, సంస్కరణ వాదులను గుర్తించి పై ప్రత్యామ్నాయాలను శిక్షలుగా విధించే విషయం వారితో చర్చించాలి. న్యాయమూర్తులు సహితం నిర్బంధానికి ప్రత్యామ్నాయంగా పైన సూచించిన శిక్షలను విధించే విషయం కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఒక నేరస్తుని పునరావాస అవసరాన్ని, బాధితుల ప్రయోజనాల్ని సమాజానికి నేరస్తుల నుండి విముక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సందర్బంలోనూ ఆయా వ్యక్తులతో చర్చించి తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. పైన సూచించిన శిక్షలు – పోలీసులు, న్యాయ మూర్తులు, నేరస్తులు, బాధితుల కుటుంబాలతో సహా బయటి సమాజం, వీరందరి క్రియాశీలక సహకారం ఉన్నప్పుడే విజయ వంతంమవుతాయి. సందర్స్గకులు హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, సాంఘిక సేవను ఒక శిక్షగా విధించేటటువంటి ప్రత్యామ్నాయాలను చేర్చేలా – భారత శిక్షాస్మృతిని సవరింప చేయడానికి ప్రయత్నం చేయాలి.

ఈ మధ్యే భారత శిక్షాస్మృతిని సవరించి, సాంఘిక సేవను జైలుశిక్షకు ఒక ప్రత్యామ్నాయంగా చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. జింబాబ్వే లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ప్రయోగం బాగానే విజయవంతమైంది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ జైళ్ళ డి.ఐ.జి. ఎమ్.ఆర్. అహమద్ ను, అంతర్జాతీయ శిక్షా సంస్కరణ, లండన్, అంతర్జాతీయ జైళ్ళ అధ్యయన కేంద్రం, కింగ్స్ కాలేజి, లండన్ లను – సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఎక్కువమంది ఖైదీలను ఈ ప్రత్యామ్నాయ శిక్షల పరిధిలోకి తీసుకురాగలిగితే జైళ్ళలో రద్దీని చాలా వరకు తగ్గించవచ్చు; ఖైదీల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచవచ్చు. నేరస్తులు సాధారణ సాంఘిక జీవితంలోకి తిరిగి రావడానికి సహాయపడవచ్చు. జైళ్ళలో ఎక్కువకాలం ఉండడం వలన వృత్తి నేరస్తులుగా మారుతున్న వారి సంఖ్యను తగ్గించవచ్చు. అంతేకాకుండా జైళ్ళ నిర్వహణపైన ఖైదీల పోషణపైన అయ్యే ఖర్చును కూడా చాలా వరకు తగ్గించవచ్చు.

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate